పరవాడలో ఎటు చూసినా పోలీసులే

by  |
పరవాడలో ఎటు చూసినా పోలీసులే
X

దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్‌లోని పరిశ్రమల్లో చోటుచేసుకుంటున్న ప్రమాదాలు నగర వాసులకు నిద్రలేని రాత్రులు మిగుల్చుతున్నాయి. ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన మర్చిపోకముందే పరవాడలోని పారిశ్రామిక వాడలో సాయినార్ లైఫ్ సైన్సెస్‌లో రియాక్టర్ పేలి ఇద్దరు మృత్యువాత పడ్డారు. గత రాత్రి పరవాడలోని రాంకీ ఫార్మాసిటీలోని ‘విశాఖ సాల్వెంట్స్’ సంస్థలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాయిలర్‌కుండే వాల్వ్ బాగు చేస్తున్న సమయంలో నిప్పు రవ్వలు రాజుకున్నాయని, ఇవి మిధానాల్ రసాయనానికి అంటుకుని మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది.

విశాఖ సాల్వెంట్స్ కంపెనీని 2010లో పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీలో సుమారు 50 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఫార్మస్యూటికల్స్ కంపెనీల నుంచి విసర్జితమయ్యే ఇథనాల్, హెచ్‌సీఎల్, ఎసిటోన్, ఎండీసీ, ఐపీఏ వంటి రసాయనాలను సేకరించి, శుద్ధి చేసి, హైదరాబాదు, చెన్నైలలో ఉన్న పరిశ్రమలకు సరఫరా చేస్తుంది. వీటిని శుద్ధి చేసేందుకే రియాక్టర్లు వినియోగిస్తారు. ఫార్మా కంపెనీలకు అవసరమయ్యే ముడి పదార్థాలను ఈ కంపెనీ సరఫరా చేస్తుంది. అలాగే శానిటైజర్లను కూడా ఉత్పత్తి చేస్తుంది.

మిథనాల్‌ను ఈ పరిశ్రమలో డ్రమ్ముల్లో నిల్వ ఉంచుతున్నారు. వీటికి మంటలు అంటుకోవడంతో డ్రమ్ములు పేలాయని తెలుస్తోంది. సుమారు 17 సార్లు భారీ పేలుళ్ల శబ్దాలు సుమారు పది కిలోమీటర్ల దూరం వరకు వినిపించాయంటే ప్రమాద తీవ్రత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. దీంతో విశాఖ వాసులు మళ్లీ వణికిపోయారు. రాత్రంతా ఏం జరుగుతోందన్న ఆందోళనతో జాగారం చేశారు. మరోసారి ఎల్జీ పాలిమర్స్‌ను గుర్తు తెచ్చుకున్నారు. పేలిన కెమికల్ డ్రమ్ములు 50 అడుగుల ఎత్తు వరకు ఎగసిపడే మంటలను రాజేశాయి. ఇవి మరింత ఆందోళనకు గురి చేశాయి. వీటి తీవ్రతకు అక్కడికి సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ లైన్లు కూడా తెగి కిందపడ్డాయి.

ఈ ప్రమాదం శబ్దాలు వినగానే పరిసర కంపెనీల్లోని కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఆ ప్రాంతమంతా ఎర్రని మంటలతో వెలుగులీనితే నల్లని పొగలతో మార్గాలన్నీ దట్టంగా కమ్మేశాయి. పేలుడు చోటుచేసుకోగానే గాజువాక పోలీసులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్‌కు సమాచారం అందించారు. ఎస్పీ మీనాతో కలిసి కలెక్టర్ సహాయక చర్యలు పర్యవేక్షించారు. హుటాహుటీన గాజువాకతో పాటు వైజాగ్‌లోని అన్ని ప్రాంతాల నుంచి 12 భారీ అగ్నిమాపక శకటాలను రప్పించారు. అయితే రాత్రి 3 గంటల వరకు మంటల దగ్గరకు వెళ్లేందుకు అవకాశం చిక్కలేదు. ఆ తరువాత మంటలార్పేందుకు వెళ్లారు. ఉదయానికి మంటలను అదుపులోకి తెచ్చారు.

నైట్ షిప్ట్ 10 గంటలకు ఆరంభమైతే పేలుళ్లు 11:30 గంటల తరువాత చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో సీనియర్ కెమిస్ట్ కాండ్రేగుల శ్రీనివాసరావు (40) అక్కడికక్కడే మృతి చెందగా, ఒళ్లంతా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన మల్లేశ్వరరావు (33) పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురు గాజువాకలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాంకీ ఫార్మాసిటీలోకి దారితీసే అన్ని మార్గాలను పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నారు. పరిశ్రమ వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. పరవాడ ఆరంభంలోనే అడ్డుకుంటున్నారు. రసాయనాలను భారీ ఎత్తున నిల్వ చేయడమే ప్రమాదానికి కారణమని ప్రాధమిక అంచనాకు వచ్చారు. కాగా, పరిశ్రమ ఆవరణలో ఉన్న ఐదు రియాక్టర్లలో ఒకదానిలో పేలుడు సంభవించినట్టు కలెక్టర్ వినయ్‌చంద్ వెల్లడించారు.

ప్రమాదం, ప్రమాద తీవ్రత, ప్రమాద నష్టంపై ఇప్పటి వరకు కంపెనీ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ, పోలీసుల నుంచి కానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి మాత్రం కలెక్టర్ వినయ్ చంద్‌ను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యసేవల అందించాలని ఆదేశించారు. పరిశ్రమలోకి మీడియాను కూడా అనుమతించకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రమాదం సమయంలో పరిశ్రమలో ఐదుగురే ఉన్నట్టు కంపెనీ చెబుతున్నప్పటికీ.. షిప్ట్ ప్రకారం 15 నుంచి 20 మంది వరకు ఉంటారని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు ప్రభుత్వం వెల్లడించనుంది.


Next Story

Most Viewed