5జీ పరిష్కారాల కోసం వొడాఫోన్ ఐడియా, ఎల్అండ్‌టీ భాగస్వామ్యం

by  |
VI1
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్ అందించే అంశంపై టెలికాం కంపెనీలు వేగవంతంగా ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. తాజాగా 5జీ నెట్‌వర్క్ పరీక్షలో భాగంగా వొడాఫోన్ ఐడియా, ఎల్అండ్‌టీతో కీలకమైన ఒప్పందం చేసుకున్నట్టు సోమవారం వెల్లడించింది. 5జీ స్మార్ట్ సిటీలో పరిష్కారాల కోసం పైలెట్ ప్రాజెక్ట్ కోసం భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. వీడియో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) సాంకేతికతలతో ఎల్అండ్‌టీ స్మార్ట్‌సిటీ ప్లాట్‌ఫామ్‌పై వొడాఫోన్ ఐడియా సంస్థ కలిసి పనిచేయనుంది.

‘5జీ టెక్నాలజీ ద్వారా పట్టణ ప్రాంతాల్లోని సవాళ్లను సులభంగా పరిష్కారమందించవచ్చు. ఈ కొత్త టెక్నాలజీని వినియోగించి ఇంకా ఇతర పరిష్కారాలను అందించడం ద్వారా స్మార్ట్‌సిటీని నిర్మించేందుకు వీలవుతుంది’ అని వొడాఫోన్ ఐడియా వ్యాపార విభాగానికి చెందిన అభిజిత్ కిషోర్ అన్నారు. ప్రభుత్వం కేటాయించిన స్పెక్ట్రమ్‌పై జరిగే 5జీ ట్రయల్స్‌లో భాగంగా ఈ ఒప్పందం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ‘నిరంతరం అభివృద్ధి చెందుతున్న ఈ సమయంలో మెరుగైన పరిష్కారాలను అందించేందుకు ప్రయత్నించాలి. దీని కోసం ఎల్అండ్‌టీ స్మార్ట్ వరల్డ్‌కు ప్రయోజనాలు అందించే ఐఓటీ టెక్నాలజీ ఆవిష్కరణల కోసం వొడాఫోన్ ఐడియాతో భాగస్వామ్యం చేసుకుంది’ అని ఎల్అండ్‌టీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్ జేడీ పాటిల్ చెప్పారు. కాగా, ఇటీవల వొడాఫోన్ ఐడియా నిర్వహించిన 5జీ ట్రయల్స్‌లో అత్యధికంగా 3.7 జీబీపీఎస్ ఇంటర్నెట్ వేగాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే, భాగస్వాములతో కలిసి సంస్థ 3.5 గిగాహెర్ట్జ్ బ్యాండ్ కింద 5జీ నెట్‌వర్క్ ట్రయల్స్‌లో 1.5 జీబీపీఎస్ డౌన్‌లోడ్ వేగాన్ని సాధించింది.

Next Story

Most Viewed