సంగారెడ్డి రిజల్ట్‌పై నజర్.. లోకసభ ఎన్నికల్లో అనూహ్యంగా మారిన పరిణామాలు

by Aamani |
సంగారెడ్డి రిజల్ట్‌పై నజర్.. లోకసభ ఎన్నికల్లో అనూహ్యంగా మారిన పరిణామాలు
X

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ : సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జగ్గారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడంతో తనదైన రాజకీయంగా ముందుకు దూసుకుపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే అన్న మాటే తప్ప సంగారెడ్డిలో జగ్గారెడ్డి రాజకీయ చక్రం తిప్పుతున్నారు. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల ముందు అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మితో పాటు మరో ఐదు మంది కౌన్సిలర్లు జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ముందుగా అనుకున్నట్టే జగ్గారెడ్డి తన పాత అనుచరులతో బీఆర్ఎస్ ను ఖాళీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే లోక్ సభ ఎన్నికలు ముగియడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు ఇప్పుడు ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మెదక్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నీల మధు ఒకవేళ గెలిస్తే సంగారెడ్డి మున్సిపల్ లో మాత్రం బీఆర్ఎస్ కు చెందిన మిగతా కౌన్సిలర్లంతా ఆ పార్టీని వీడుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

నేతలు పార్టీ మారుతున్నా "చింత" మౌనం..!

గత అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరఫున సంగారెడ్డి నియోజకవర్గ నుంచి పోటీ చేసిన ఇంకా ప్రభాకర్ తన బలమైన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన జగ్గారెడ్డిపై 8 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలో తాజా మాజీ మంత్రి హరీష్ రావు గతంలో ఒక ఊపు ఊపారు. ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రలో ఉన్న మాజీ మంత్రితో పాటు ఇతర ఎమ్మెల్యేల రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్ఎస్ కు గతంలో రాజకీయ శత్రువుగా ఉన్న జగ్గారెడ్డి సంగారెడ్డిలో మాత్రం సైలెంట్ గా తన పని తాను చేసుకో పోవడంతో అన్ని పార్టీల నాయకులు గందరగోళం వాతావరణం నెలకొంది.

ఏ పార్టీ గెలిచేనో..?

కాంగ్రెస్ పార్టీ తరఫున మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడిన నీలం మధు గెలుపు పైనే సంగారెడ్డి మున్సిపాలిటీలో రాజకీయాల ముందుకు సాగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చాలామంది ఓటర్లు నేషనల్ పార్టీల వైపే మొగ్గుచూపి ఓట్లు వేస్తారని ప్రచారంతో స్థానిక నాయకుల్లో అయోమయ వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నీలం మధు గెలిస్తే మెదక్ పార్లమెంట్ పరిధిలో ఆ పార్టీ క్యాడర్ మరింత పుంజుకునే అవకాశాలు నిండుగా ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతే తాజాగా ఆ పార్టీలో చేరిన సంగారెడ్డి మున్సిపాలిటీ చెందిన నాయకుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న వారిలో నెలకొన్నది. మొత్తంగా అటు కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ ఈ మూడు పార్టీల మధ్యనే త్రిముఖ పోరు కొనసాగగా.. వీరిలో ఎవరు విజయం సాధిస్తారో అనే ప్రధాన అంశం ఇప్పుడు ఆయా పార్టీల నాయకుల్లో ఉత్కంఠను రేపుతోంది.

Next Story

Most Viewed