సీఎం కేసీఆర్ వివాదాస్పద‌ వ్యాఖ్యలపై విజయశాంతి ఫైర్

by  |
సీఎం కేసీఆర్ వివాదాస్పద‌ వ్యాఖ్యలపై విజయశాంతి ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా హాలియాలో బుధవారం జరిగిన బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఎన్నికల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన సభలో ప్రజలను కుక్కలతో పోల్చడం రాజకీయంగా దుమారం రేగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారానికి సీఎం వెళ్ళడం ఆ పార్టీ దీనావస్థకు నిదర్శనమని విమర్శలు వస్తున్న సమయంలో కేసీఆర్ నిండు బహిరంగసభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సందర్భానికి తగినట్లుగా విరుచుకుపడే విజయశాంతి వెంటనే కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.

“ఓటములతో ఫ్రస్ట్రేషన్ ఎక్కువై తెలంగాణ ప్రజలను కుక్కలని ముఖ్యమంత్రి కేసీఆర్ హేళన చేశారు. వేదన చెప్పుకోవడానికి వచ్చినవాళ్ళను ఈడ్చుకుపోవాలంటూ పోలీసులకు హుకుం జారీచేశారు. మేం తల్చుకుంటే నాశనమైపోతారని స్వయంగా సీఎం గూండాగిరికి తెగబడ్డారు. ఆ ‘దొర’హంకారానికి కర్రు కాల్చి ఓటు ద్వారానే వాత పెట్టాల్సిన జిమ్మేదారీని ప్రజలు తీసుకోక తప్పదు. బాధిత మహిళలు కుక్కలా? ఆడబిడ్డలను కుక్కలన్నందుకు యావత్ మహిళా సమాజానికి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పి తీరాలి” అని విజయశాంతి ఫేస్‌బుక్ వేదికగా డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి మరోమారు ఎన్నికల ప్రసంగాలను మొదలుపెట్టారని, జీహెచ్ఎంసీ తర్వాత ప్రజలను ఇప్పుడు మరోసారి కలవక తప్పని పరిస్థితి ఏర్పడిందని విజయశాంతి వ్యాఖ్యానించారు. ‘మాట నిలబెట్టుకోకుంటే ఓట్లు అడగం… మాట తప్పితే మెడ నరుక్కుంటా…’ ఇలాంటివన్నీ నిజమే అయితే… టీఆర్ఎస్ ఇప్పటికే ఓట్లు అడగడం మానేసి ఉండాల్సింది. ఎందుకంటే, కుర్చీ వేసుకుని స్వయంగా చేస్తానన్న అభివృద్ధి ఎంత ఘనంగా ఉంటదో పక్కనున్న వరంగల్ జిల్లా ప్రజలకు, మిగతా తెలంగాణకు బాగా తెలుసని కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఆమె గుర్తుచేశారు. మరోసారి ఆ మాటలకు ఇంకెవరూ మోసపోవడానికి సిద్ధంగా లేరని హాలియా సభకు హాజరైన ప్రజలు సీఎం ప్రసంగానికి స్పందించకపోవటాన్ని చూస్తేనే అర్థం అవుతోందని విజయశాంతి తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు.

సభలో కేసీఆర్ ఏమన్నారంటే..!

“పోలీసులూ! కాగితాలు పట్టుకున్నోళ్ళ నుంచి వాటిని తీసుకోండయ్యా. ఆ కాగితాలను తీసుకోండి పోలీసులూ.. కిషోర్ (ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌ను ఉద్దేశించి)! మీరు పొయ్యి తీసుకోండి. అమ్మా… ఇగ మీరు ఇచ్చిండ్రు.. అయిపోయింది. మర్యాదగా బైటకు వెళ్ళిపోండి.. మీరేదో పిచ్చి పని చేస్తే ఇక్కడెవ్వరూ డిస్టర్బ్ కారు. మీరే దెబ్బతింటరు అనవసరంగా.. వెళ్లిపోండి. మీరు ఐదుగురు లేరు.. నష్టమైపోతరు.. జాగ్రత్త.. పోలీసులూ! వాళ్ళను బైటకు తీసుకెళ్ళండయ్యా.. మీరు ఎవ్వరూ పట్టించుకొవద్దమ్మా.. వాళ్ళను వదలేయండి.. ఎవ్వరూ పట్టించుకోవద్దు.. ఈ డ్రామాలు చాలా చూసినమమ్మా మేము.. మీలాంటి కుక్కలు చాలా ఉంటయి.. మీ లాంటి కుక్కలు చాలా మంది ఉంటరు.. బైటకెళ్ళండి. పోలీసులూ! తీసుకెళ్ళండి వాళ్ళను. టేక్ దెమ్ అవుట్.. ” అంటూ నిండు సభలో కేసీఆర్ వ్యాఖ్యానించారు.



Next Story

Most Viewed