హుజూరాబాద్‌లో కాంగ్రెస్ అందుకే గెలవలేదు: వేం నరేందర్ రెడ్డి

by  |
హుజూరాబాద్‌లో కాంగ్రెస్ అందుకే గెలవలేదు: వేం నరేందర్ రెడ్డి
X

దిశ, మహబూబాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో కేసీఆర్, ఈటల మధ్య పోటీగా అక్కడి ప్రజలు, ఓటర్లు భావించారని.. ఫలితంగా కాంగ్రెస్ అభ్యర్థి గట్టి పోటీ ఇవ్వలేకపోయారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు వేం నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కేసముద్రం మండలానికి టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా తొలిసారిగా వచ్చిన సందర్భంగా.. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. హుజూరాబాద్‌ ఉప ఎన్నికతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం కోల్పోయినట్లుగా భావించకూడదన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని చెప్పారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో, వందల కోట్ల రూపాయల ఖర్చుతో నాయకులను, ఓటర్లను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించినా.. హుజూరాబాద్ ప్రజలు, ఓటర్లు అధికార టీఆర్‌ఎస్‌కు తగిన రీతిలో బుద్ధి చెప్పారన్నారు. దాదాపు 20 ఏళ్ల నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల కోసం పాటుపడే ఈటలను గెలిపించారని, కానీ, బీజేపీపై మక్కువతో కాదంటూ ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్‌కు ఇక గడ్డు రోజులేనని, కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో విజయ దుందుభి మోగిస్తామని వేం నరేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed