నగరంలో కూర‘గాయాలు’

by  |
Vegetables-22
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన చాలామంది ఆర్ధిక ఇబ్బందుల పాలవుతుండగా ధరల దరువు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సుమారు రెండేళ్లుగా అంతంత మాత్రం సంపాదనతో నెగ్గుకొస్తున్న పేద, మధ్య తరగతి ప్రజలు ఇటీవల పెరుగుతున్న ధరలతో బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్, డీజీల్ ధరల పెంపు కారణంగా సరుకుల రవాణా చార్జీలు పెరిగి నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోగా భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని కూరగాయల ధరలు అందుబాటులో లేకుండా పోయాయి. మరోవైపు సుమారు రూ. వెయ్యికి గ్యాస్ ధరలు చేరడం సాధారణ ప్రజానీకాన్ని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిత్యం పెరుగుతున్న ధరలతో వారు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా మారాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అప్పట్లో ప్రభుత్వం లాక్ డౌన్ విధించగా చాలా ప్రైవేట్ సంస్థలు తమ వద్ద పని చేస్తున్న ఉద్యోగులను తొలగించాయి. కొంతమందికి వేతనాలలో కోతలు విధించాయి. దీంతో ఖర్చులకు తగిన ఆదాయం లేకుండా పోయింది. కూలి చేసుకుని జీవించే వారికి కూడా పనులు లేకుండా పోవడంతో ఇంటి అద్ధెలు చెల్లించలేక, చివరకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు కూడా కొనలేని స్థితిలో ధరలు ఉండడం వారికి పూట గడవడమే కష్టంగా మారింది.

అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న ధరలు..

కరోనాను సాకుగా చూపించి వ్యాపారులు ధరలను పెంచి ఇష్టారాజ్యంగా విక్రయాలు జరుపుతున్నారు. బియ్యం, కూరగాయలు, పప్పులు, ఇతర నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ముఖ్యంగా గత నెల రోజులుగా కూరగాయలు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆకాశమే హద్దుగా పెరిగిపోయాయి. నగరంలోని రైతు బజార్‌లలో సైతం ధరలు మండుతున్నాయని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు బజార్లలో బోర్డులపై కిలో రూ.34 అని పెడుతున్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రూ.50 వరకు విక్రయాలు జరుపుతున్నారు. బహిరంగ మార్కెట్ లో కిలో రూ. 60 వరకు ఉన్నాయి. చిక్కుడు, క్యారెట్, కాకరకాయ, బెండ, దొండ, దోసకాయ, పచ్చిమిర్చి, క్యాబేజీ తదితర కూరగాయల ధరలు అందుబాటులో లేకుండా పోయాయి.

ఆకు కూరలది అదే తీరు…

ఆకు కూరల సంగతి అయితే చెప్పలేని విధంగా ఉంది. ముఖ్యంగా పాలకూర, మెంతికూర, కొత్తిమీర చివరకు కరివేపాకుల ధరలు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. వంద రూపాయలు వెచ్చించినా నలుగురు ఉండే కుటుంబానికి ఒక్క రోజుకు సరిపోనంతగా ధరలు పెరిగాయి. గతంలో రెండు వందల రూపాయలు వెచ్చిస్తే ఓ మధ్య తరగతి కుటుంబానికి కనీసం వారం రోజులకు సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు వెయ్యి రూపాయలు వెచ్చించినా రాని పరిస్థితి ఉంది. వీటితో పాటే బియ్యం, పప్పుల ధరలు కూడా పెరిగిపోయి సాధారణ ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. అడ్డూ, అదుపు లేకుండా పెరిగిపోతున్న కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఏ రోజుకు ఆ రోజు నిన్ననే నయం అనేలా పెరుగుతున్న ధరల విషయంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు దృష్టి సారించి సామాన్యులకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.

కూరగాయల ధరలు…

కూరగాయ రకం రైతు బజార్ లో (కిలో)రూపాయలలో బహిరంగ మార్కట్ లో ధరలు (కిలో)
1. టమాట 34 50 నుండి 60
2. వంకాయ 55 70 నుండి 80
3. బెండకాయ 75 80 నుండి 100
4. పచ్చిమిర్చి 45 60
5. కాకారకాయ 55 80
6. బీరకాయ 55 80
7. క్యాబేజీ 37 60
8. క్యారెట్ 55 80 నుండి 100
9. దొండకాయ 53 70 నుండి 80
10. ఆలుగడ్డ 21 40
11. సోరకాయ 27 40 నుండి 50
12. బీన్స్ 45 80
13. గోకరకాయ 55 80
14. దోసకాయ 45 80
15. బీట్ రూట్ 45 70
16. క్యాప్సికమ్ 65 80
17. చిక్కుడు 65 80

రైతు బజార్ లలో కేవలం బోర్డు మీద మాత్రమే ఈ ధరలు ఉంటున్నాయి. మార్కెట్ లో కూరగాయలు విక్రయిస్తున్న ప్రతి ఒక్కరూ బోర్డు ధరల కంటే 15 రూపాయలకు పైగా ఎక్కువ ధరలకు అమ్ముతున్నా పట్టించుకునే అధికారులు లేకుండా పోయారు. ఇదేమని ప్రశ్నించిన వారి పట్ల మార్కెట్ లో వ్యాపారులుగా చెలామణి అవుతున్న దళారులు గొడవలకు దిగడం, దాడులు చేయడం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ధరలను నియంత్రించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

Next Story

Most Viewed