నెక్ట్స్ ఎమ్మెల్యే నేనే.. అందరూ సపోర్ట్ చేయాల్సిందే!

by  |
Vanama-Raghavendra-Rao
X

దిశ, కొత్తగూడెం: ‘కొత్తగూడెం నెక్ట్స్ ఎమ్మెల్యేను నేనే.. కచ్చితంగా అధికార పార్టీ నుంచి నాకే టికెట్ వస్తుంది.. నేనే పోటీ చేస్తా.. అందరూ నాకే సపోర్ట్ చేయాలి.. లేకపోతే…’ ఇవి.. ఇప్పుడు వనమా రాఘవకు సంబంధించి ప్రచారం జరుగుతున్న మాటలు. ఏకంగా ఎమ్మెల్యేనంటూ ప్రచారం చేసుకోవడంతో ఆయన వెంట ఉండే నేతలతో పాటు పార్టీ శ్రేణులందరూ అవాక్కవుతున్నారు.. పనిలో పనిగా.. అందుకేనా.. తండ్రిని ఇప్పటినుంచే పక్కకు పెట్టి పెత్తనం చేస్తున్నారంటూ నియోజకవర్గ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేందర్ రావు చేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయి. వచ్చేసారి నేనే ఎమ్మెల్యేనంటూ వచ్చిన వారి దగ్గర చెబుతున్నారట. అంతేకాదు కొంతమంది రాఘవ అనుచరులు ఆయన పేరు చెప్పి దందాలకు పాల్పడుతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఇక వివాదాల్లో తలదూర్చడం మొదటినుంచీ ఉందని, అధికార పార్టీలోకి చేరాక ఈ తంతు మరీ ఎక్కువైందని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. తండ్రి ఎమ్మెల్యేగా ఉంటేనే ఈ స్థాయిలో ఉంటే.. తనకు పోటీ చేసే అవకాశం వస్తే పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదంటూ వాపోతున్నారు.

ప్రచారం చేస్తున్న రాఘవ యువసేన..

ఇప్పటికే కొత్తగూడెం నియోజకవర్గంలో రాఘవ యువసేన పేరుమీద సోషల్ మీడియాలో రాఘవకు సంబంధించి రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే రాఘవ వచ్చే ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లుగానే తెలుస్తోంది. అయితే పోటీచేయడం, గెలిచి ఎమ్మెల్యే కావాలనుకోవడం తప్పు కాదని.. ఆ పేరుతో రాఘవ, ఆయన అనుచరులు చేసే ఆగడాలే ఎక్కువవుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. అంతేకాదు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను ఇప్పుడే ఎమ్మెల్యే స్థాయిలో ఆర్డర్లు చేస్తే.. ఒకవేళ నిజంగానే గెలిస్తే అప్పుడెలా వ్యవహరిస్తారో అనే భయం కొందరిలో వెంటాడుతోందట.. వచ్చే ఎన్నికల కోసం ఇంత హంగూ ఆర్భాటాలు చేస్తున్నారని ఆయన వెంట ఉండే కొంతమంది అనుచరులే చర్చించుకోవడం గమనార్హం.

అందుకేనా తండ్రిని పక్కకు పెట్టేది..

నెక్ట్స్ పోటీచేయాలనే ఉద్దేశంతోనే రాఘవ తన తండ్రి వెంకటేశ్వరరావును పక్కన పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాఘవకు ఎలాంటి పదవి లేకున్నా కేవలం తన తండ్రి ఎమ్మెల్యే పేరుతోనే పెత్తనం చేస్తున్నాడనే అపవాదూ ఉంది. తన తండ్రి పాల్గొనాల్సిన కార్యక్రమాలు, మీటింగుల్లో కూడా ఈయనే పాల్గొంటున్నారు. నియోజకవర్గంపై పట్టు సాధించేందుకే కిందిస్థాయి నేతలకు, నియోజకవర్గ అధికారులకు ఆర్డర్లే వేస్తున్నారనే చర్చ జరుగుతోంది. అయితే పట్టు సాధించడం పక్కకు పెడితే పార్టీ క్యాడర్ ఇబ్బంది పడే విషయాన్ని ఎవరూ గుర్తించపోవడం గమనార్హం. రాఘవ వల్ల ఎదురైతున్న ఇబ్బందులను ఎవరైనా చెప్పాలనుకున్నా.. ధైర్యం చాలడం లేదని ఓ ద్వితీయ శ్రేణి నాయకుడు చెప్పుకొచ్చారు.

వర్గాలను ప్రోత్సహిస్తే పార్టీకి నష్టమే..

నియోజకవర్గంపై పట్టుసాధించాలంటే వర్గాలను ప్రోత్సహించడం కాదని.. తమవారికి ప్రాధన్యం ఇచ్చి మిగతా వారిని పక్కకుపెడితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం కాదుకదా.. కనీసం డిపాజిట్ కూడా దక్కదని రాఘవపై గుర్రుగా ఉన్న ఓ కార్యకర్త తన ఆవేదన వెళ్లగక్కుతున్నాడు. అయినా అధిష్టానం అన్నీ గమనిస్తుందని.. తనకు తానే సొంతంగా నెక్ట్స్ ఎమ్మెల్యేనని ప్రచారం చేసుకోవడం ఎంత వరకు కరెక్టని అంటున్నారు.


Next Story