ప్రజాఉద్యమంగా వ్యాక్సినేషన్ : వెంకయ్య నాయుడు

by  |
venkaiah-naidu 1
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా ఉద్యమంలా వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశమంతటా చేపట్టాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ ను ఆయన సందరర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ టీకాలపై అపోహలు తొలిగిపోయేలా ప్రచారం చేసేందుకు ప్రసార మాధ్యమాలు ప్రత్యేకమైన చొరవతీసుకోవాలని సూచించారు. చిన్నారులకు కరోనా టీకా, ముక్కు ద్వారా అందించేందుకు ప్రయోగాలను వేగవంతం చేయాలన్నారు. తక్కువ సమయంలోనే ప్రభావవంతమైన టీకాను రూపొందించిన శాస్త్రవేత్తలకు, యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. కరోనా తీవ్రత కాస్త తగ్గిందని అలసత్వం వహించకూడదని సూచించారు. రాజకీయ పార్టీలు, వారి కార్యకర్తలు కరోనా నిబంధనలను తప్పని సరిగా పాటించాలని తెలిపారు.

కరోనా మూడో దశ రాకుండా అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు పాత్రను పోషించాలని తెలిపారు. మ్యూటేషన్లు చెందుతూ సవాళ్లను విసురుతున్న కరోనా వైరస్ బారినుంచి మానవాళిని కాపాడుకునేందుకు అవసరమైన పరిష్కార మార్గాలను కనుగొనేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరముందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 50 శాతం టీకాలు మన దేశం నుంచే పంపిణీ అవుతున్నాయని, దీంతోపాటు భారీ మొత్తంలో జెనరిక్ డ్రగ్స్ కూడా మన దేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. ఎయిడ్స్ వ్యాధికి అవసరమైన యాంటీ-రిట్రోవైరల్ డ్రగ్స్ కూడా 80 శాతం భారతదేశం నుంచే యావత్ ప్రపంచానికి పంపిణీ అవుతుందన్నారు. రానున్న రోజుల్లో ఫార్మారంగంలో భారతదేశం సాధించబోతున్న ప్రగతికి నిదర్శనమని తెలిపారు.

2021 నాటికి మన దేశీయ ఫార్మా వ్యాపారం 42 బిలియన్ డాలర్లు (దాదాపుగా రూ. 3.12 లక్షల కోట్లు)గా భావిస్తుండగా.. 2030 నాటికి ఈ వ్యాపారం 120-130 బిలియన్ డాలర్లకు (దాదాపుగా రూ. 9.6 లక్షల కోట్లకు) చేరుకోవచ్చనే అంచనాలున్నాయన్నారు. ఈ వ్యాపారంలో టీకాలు, బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రంగా హైదరాబాద్ మారడం శుభపరిణామని పేర్కొన్నారు. ఎటువంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండేలా మన వైద్యరంగ మౌలిక వసతులను అభివృద్ధి చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషి అభినందనీయమైనదని, ఈ ప్రయత్నంలో ప్రైవేటు రంగం కూడా కీలక భూమిక పోషించాలని సూచించారు.



Next Story

Most Viewed