అల్లం.. అనారోగ్యానికి కళ్లెం

by  |
అల్లం.. అనారోగ్యానికి కళ్లెం
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ వంటకాల్లో అల్లం ఎలాంటి పాత్ర పోషిస్తుందో చెప్పనవసరం లేదు. శాకాహారంలోనైనా, మాంసాహారంలోనైనా తాలింపులో అల్లం పేస్టు వేసి చేస్తే వాటికొచ్చే రుచే వేరు. ఆ సువాసనే వేరు. అంతెందుకూ మనం లేవగానే తాగే ఛాయ్‌లో అల్లం వేసి చేస్తే అదిరిపోతుందన్న విషయం తెలియంది కాదు. ఇలా.. అల్లం రుచినివ్వడమే కాదు.. ఏదో ఒక రూపంలో ప్రతిరోజూ తీసుకుంటే ఆరోగ్యాన్నీ ఇస్తుంది. అల్లంలో అనేక ఔషధ గుణాలున్నాయి. ఎన్నో అనారోగ్య సమస్యలకు వంటింట్లోనే దొరికే అల్లంతో కళ్లెం వేయొచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఓ సారి పరిశీలిస్తే..

జలుబు, దగ్గుకు దివ్య ఔషధం

ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణ జలుబైనా, దగ్గైనా జనాలు బెంబేలెత్తిపోతున్న విషయం తెలిసిందే. ఇలా సాధారణంగా చేసిన జలుబు, దగ్గును పారదోలాలంటే.. ఒక టేబుల్ స్పూన్ తేనేలో కొన్ని అల్లం రసం చుక్కల్ని కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రోజుకు రెండు నుంచి నాలుగుసార్లు ఇలా చేస్తే పూర్తిగా నయమవుతుంది.

ఉబ్బరం, కడుపు నొప్పి

అల్లం టీ తాగితే ఉబ్బరం, కడుపు నొప్పి నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. అల్లంలో ఉండే ఔషధ గుణాలు కడుపులో వున్న గ్యాస్‌ను బయటకు పంపేందుకు ఉపయోగపడుతాయి. ఫలితంగా ఉబ్బరం, కడుపునొప్పి నుంచి త్వరిత ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా అల్లం టీతో మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.

షుగర్‌ను అదుపులో ఉంచుతుంది

దీర్ఘకాలిక అనారోగ్యసమస్యలను తెచ్చే షుగర్ వ్యాధిని అల్లం అదుపులో ఉంచుతుంది. ఈ విషయం సిడ్నీ విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనలో వెల్లడైంది. అల్లం రసాన్ని, లేదా నూరిన అల్లం పేస్టు ముద్దను తీసుకుంటే, రక్తంలోని చక్కెరలు కండరాలకు చేరే ప్రక్రియ వేగవంతం అయినట్టు పరిశోధకులు గుర్తించారు. ఇన్సులిన్ అనే హార్మోన్ ఇచ్చినప్పుడే జరిగే ఈ ప్రక్రియ అల్లం రసంతోనే జరగడం విశేషం.

పెయిన్ కిల్లర్‌గానూ పనిచేస్తుంది

ప్రతిరోజూ ఆహారంలో ఏదో ఒక రకంగా అల్లాన్ని తీసుకుంటే శరీరంలో నొప్పులున్నా మటుమాయమవుతాయి. కీళ్ల నొప్పులు తగ్గేందుకు వేడి నీటిలో అల్లం, నిమ్మరసం, తేనే మిశ్రమాలు కలిపి సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది.

పాదాల కోమలత్వానికి..

పాదాలను పగుళ్ల నుంచి రక్షిస్తూ, కోమలంగా ఉండేందుకు అల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. అల్లం ముక్కలు వేసి మరుగబెట్టిన నీళ్లలో 15 నిమిషాలపాటు పాదాలను ఉంచితే, పగిలిపోకుండా ఉంటాయి. ఇవే కాకుండా అన్నం తినేటప్పుడు మొదటి ముద్దగా శొంఠి (ఎండబెట్టిన అల్లం)ని పలుచగా కలిపి నేతితో తింటే, అజీర్తి సమస్య తొలగిపోతుంది. పాలల్లో కలిపి తీసుకుంటే రక్త శుద్ధికి తోడ్పడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టనీయకుండా సహాయపడుతుంది. చిన్న చిన్న అల్లం ముక్కలను నోట్లో వేసుకుని ఆడించడం ద్వారా నోటి దుర్వాసనను పోగొట్టడమేకాకుండా, ప్రమాదకర బ్యాక్టీరియాలను హరించి, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Tags: uses of ginger, sneeze, cough, body pains, joint pains, diabetic, stomach ache, ulcer



Next Story

Most Viewed