రిపోర్టర్‌పై చిందులు తొక్కిన డొనాల్డ్ ట్రంప్

by  |
రిపోర్టర్‌పై చిందులు తొక్కిన డొనాల్డ్ ట్రంప్
X

వాషింగ్టన్: మీడియాపై, రిపోర్టర్లపై విరుచుకపడటం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కొత్తేమీ కాదు. ముఖ్యంగా తనపై విమర్శలు చేసే వారిని ట్రంప్ ఎప్పుడూ టార్గెట్ చేస్తూనే ఉంటారు. తరచూ మీడియా సమావేశాల్లో గతంలో తనపై రాసిన కథనాలకు రిపోర్టర్లపై, సదరు మీడియాపై మాటలతోనే విరుచుకపడుతుంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రిక రిపోర్టర్, సీఎన్ఎన్ రాజకీయ విశ్లేషకురాలైన మ్యాగీ హబర్‌మాన్ ఎదుర్కుంటున్నారు. శనివారం వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. మీడియా సంస్థలు తమ కథనాల్లో వార్తలకు సంబంధించిన సోర్సుల వివరాలు, వారి పేర్లు కచ్చితంగా రాయాలని డిమాండ్ చేశారు. మీ ఇష్టానికి విశ్వసనీయ సమాచారం, సంబంధిత వర్గాల సమాచారం అని రాసుకుంటూ పోతే చూస్తూ ఊరుకోమన్నారు. మ్యాగీ హబర్‌మాన్ సరైన ఆధారాలు లేకుండా వార్తలు రాస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసలు ఆమెకు సమాచారం ఇస్తున్న సోర్సులు ఎవరో చెప్పకుండా సంబంధిత వర్గాల సమాచారం అంటూ సీఎన్ఎన్, ది న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టు‌లో వార్తలు రాయడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసలు ఈ మీడియా వాళ్లకు చెప్పే సోర్సులు ఎవరూ ఉండరు. తమకు తోచినట్లు కథనాలు రాసుకొని.. సంబంధిత వర్గాల సమాచారం అని పేర్కొంటుంటారు. నిజంగా వాళ్లే ఉంటే పేర్లు రాయొచ్చుకదా’ అని ట్రంప్ ప్రశ్నించారు. కరోనా వ్యాప్తిపై, అమెరికాలో నష్టానికి కారణం చైనానే అని దానిపై నెట్టేసి రాబోయే ఎన్నికల్లో లబ్ది పొందాలని చాలా మంది రిపబ్లికన్లు భావిస్తున్నట్లు మ్యాగీ మరో రిపోర్టర్‌తో కలసి ఒక కథనం రాసింది. దీనిపైనే ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కథనాలు రాసి విశ్వసనీయ సమాచారం అంటూ పేర్కొనడం తప్పే అంటూ విరుచుకపడ్డారు. అంతే కాకుండా ఆమె గతంలో రష్యాపై రాసిన వార్తకు పులిట్జర్ అవార్డు అందుకున్నారని.. కాని ఆ కథనం కూడా తప్పేనని.. వెంటనే అవార్డు తిరిగి ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఆమె ఒక థర్డ్ గ్రేడ్ రిపోర్టర్ అంటూ తీవ్రంగా విమర్శించారు. కరోనాపై తప్పుడు వార్తలు రాస్తున్న రిపోర్టర్ల పేర్లు అన్నీ వైట్ హౌస్ అధికారులు సేకరిస్తున్నారు. దీనిలో మ్యాగీ పేరు కూడా ఉండటం గమనార్హం.

Tags: coronavirus, new york times, us president, donald trump, america, against, media



Next Story

Most Viewed