పంచాయతీ కార్యదర్శులపై ‘ఉపాధి హామీ’ ఒత్తిడి

by  |
Upadhihami
X

దిశ, భువనగిరి: గ్రామపంచాయతీ కార్యదర్శులకు ఉపాధి హామీ పనులపై ఆందోళన మొదలైంది. ఉపాధి కూలీల సంఖ్య పెంచాలని అధికారులు వత్తిడి చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్న కూలీలు ఉపాధి పనులకు రావడంలేదు. ఈ నేపథ్యంలో పనుల్లో జరిగే అవకతవకలపై సస్పెన్షన్లు, ఫండ్స్ రికవరీ అంటూ చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో 421 గ్రామ పంచాయతీలకు సీనియర్ పంచాయతీ కార్యదర్శులు సుమారు70 మంది ఉండగా మిగిలిన పంచాయతీలకు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల భర్తీ చేశారు. అయినప్పటికీ సుమారు 25 గ్రామ పంచాయతీలు ఇన్‌చార్జి కార్యదర్శుల ద్వారా కొనసాగుతున్నాయి. గతంలో కార్యదర్శులు పంచాయతీల పర్యవేక్షణ, పన్నుల వసూళ్లు, పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా ప్రభుత్వ సంక్షేమ పథకాలపనుల అమలులో భాగస్వాములు కావాల్సి ఉంది. గతంలో ఉపాధి హామీ పథకం కింద పనిచేసే పనులను గుర్తించడం, కూలీలను పనులకు రప్పించడం, వారి హాజర్లు నమోద్ చేయడంలాంటి వ్యవహారాలను ఫీల్డ్ అసిస్టెంట్లు చూసుకునేవారు. వారిని గతేడాది తొలగించడంతో ఉపాధి హామీ పనుల భారం పంచాయతీ కార్యదర్శులపై పడింది. దీంతో కార్యదర్శులకు పంచాయతీ బాధ్యతలతోపాటు ఉపాధి హామీ పనులు భారంగా మారాయి.

కార్యదర్శులకు ఇబ్బందులు..

పంచాయతీ కార్యదర్శులు హరితహారం మొక్కలు నాటించడం, వాటికి నీరు పోయించడం, శానిటేషన్స్, వాటర్ వర్క్స్ చూస్తున్నారు. దీనికితోడు ఉపాధి పనులకు కూలీలను రప్పించాల్సి ఉండడంతో కార్యదర్శులు పని వత్తిడితో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నందున కూలీలు ఉపాధి పనులు చేయడానికి ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. అధికారులు మాత్రం కూలీల సంఖ్య పెంచాల్సిందేనని వత్తిడి చేస్తుండడంతో చాలా మంది కార్యదర్శులు తమ బాధను ఎవరికి చెప్పుకోలేక మదనపడుతున్నారు. ఒక్కో ఊరిలో ఉన్న జాబ్ కార్డుల్లో కనీసం 90 శాతం కూలీలు ఉపాధి పనులకు రావాలని చెబుతున్నారు. కూలీల సంఖ్య తక్కువైతే మెమోలు జారీ చేస్తున్నారని పేర్కొంటున్నారు. చిన్న గ్రామాలు, వ్యవసాయం అధికంగా ఉండే గ్రామాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తుంది.

సోషల్ ఆడిట్ తిప్పలు..

ఓ వైపు ఉపాధిహామీ పనులతో సతమత వుతున్న పంచాయతీ కార్యదర్శులకు మరో వైపు సోషల్ ఆడిట్ గుబులు ఆందోళనకు గురిచేస్తోంది. ఏటా గ్రామాల్లో ఉపాధి ద్వారా చేపట్టిన పనులు, ఖర్చులు, కూలీలకు చెల్లింపులపై సోషల్ ఆడిట్ నిర్వహిస్తారు. ఇందులో ఏమాత్రం పొరపాట్లు గుర్తించినా కార్యదర్శుల నుంచి ఫండ్స్ రికవరీ చేయాలంటూ నోటీసులు జారీ చేస్తారు. నెలకు రూ.15 వేల వేతనంతో కుటుంబాన్ని వెళ్లదీసుకుంటున్న తమపై ఉపాధి పనుల అదనపు భారం మోపి పనులలో లోపాలకు మమ్మల్ని బాధ్యుల్ని చేసి వేధించడం మానుకోవాలని కార్యదర్శులు కోరుతున్నారు.

ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే బాధ్యతలు..

ప్రభుత్వం తీసుకున్న రాష్ట్ర వ్యాప్త పాలసీ ప్రకారమే పంచాయతీ కార్యదర్శులకు ఉపాధి పనుల నిర్వహణ అదనపు బాధ్యతలు అప్పగించాం. వత్తిడి లేకుండా చూస్తున్నాం. వత్తిడికి లోనవుతున్నట్లు మాకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. అలాంటిదే జరిగితే ప్రభుత్వ నిర్ణయం కోసంపై అధికారులకు నివేదిక పంపుతాం.

– డీఆర్డీవో, మందడి ఉపేందర్‌రెడ్డి

ఉపాధి నుంచి మమ్ముల్ని తప్పించాలి

ఉపాధి పనులనుంచి తప్పించాలి. మా కున్న విధులతోనే సతమతమవుతున్నాం. అదనంగా ఉపాధి పనులు అప్పగించడం వల్ల పనుల్లో ఏకాగ్రత కోల్పోతున్నాం. తక్కువ జీతంతో ఎక్కువ పనులు చేస్తున్నాం. ప్రతి చిన్నపనికి మమ్మల్ని బాధ్యుల్ని చేయడం సరి కాదు.

– మందడి ఇంద్రసేనారెడ్డి, కార్యదర్శుల సంఘ జిల్లా అధ్యక్షుడు


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed