ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు

by  |
ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు
X

లక్నో: తమ రాష్ట్రంలో జనాభాను నియంత్రించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా జనాభా నియంత్రణ బిల్లు ముసాయిదాను రూపొందించింది. ఈ ముసాయిదా ప్రకారం.. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నవారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు. ఒకవేళ ఇప్పటికే ప్రభుత్వోద్యోగంలో ఉంటే వారికి ప్రమోషన్లు ఉండవు. ప్రభుత్వ పథకాలేవీ వర్తించవు. ఎంత మంది ఉన్నా రేషన్ కార్డులో నలుగురికే స్థానం ఉంటుంది. స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు వంటి ప్రతిపాదనలతో యూపీ లా కమిషన్ తొలి ముసాయిదాను తాజాగా విడుదల చేసింది. అయితే, ‘ఇద్దరు పిల్లల’ నిబంధన పాటించేవారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహకాలు అందించనుంది.

ఇద్దరు పిల్లలు కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు తమ సర్వీస్ మొత్తంలో రెండుసార్లు అదనపు ఇంక్రిమెంట్లు పొందుతారు. ఇళ్లు, లేదా ప్లాట్ కొనుగోలు చేస్తే సబ్సిడీ లభించనుంది. పీఎఫ్‌లో 3శాతం పెరుగుదల ఉంటుంది. ఒక్కరే సంతానం ఉంటే, వారికి మరిన్ని ప్రోత్సాహకాలు ఉండనున్నాయి. ఒక్కరే సంతానానికి 20 ఏళ్లు వచ్చేవరకు ఉచిత వైద్యం, విద్య ప్రభుత్వమే అందించనుంది. ప్రభుత్వ ఉద్యోగం లేకపోయినా ఇద్దరు పిల్లల నిబంధన పాటించేవారికి వాటర్, ఎలక్ట్రిసిటీ, ఇంటి పన్ను, గృహ రుణాల చెల్లింపులో డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ ముసాయిదా బిల్లును యూపీ లా కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేశారు. జూలై 19వరకు ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించనున్నారు. వచ్చే నెలలో దీనిని అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.



Next Story

Most Viewed