తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో కరోనా పేషెంట్లకు అందని వైద్యం

by  |
Tarnaka RTC Hospital
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ కార్మికులకు చికిత్సలు అందించే తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో కార్మికులకు వైద్యం అందించడం లేదని ఆర్టీసీ ఎంప్లాయిస్​యూనియన్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆర్టీసీ యాజమాన్యంతో పాటు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆర్టీసీ తార్నాక ఆస్పత్రిలో 250 బెడ్స్​ ఉంటే కేవలం 15 బెడ్స్​ను మాత్రమే వాడుతున్నారని, 235 ఖాళీగా పెడుతున్నారన్నారు. ఆర్టీసీ కార్మికుల్లో 10 శాతం మాత్రమే మరణాలు ఉన్నాయని ఆర్టీసీ అధికారులు, తార్నాక ఆస్పత్రి వైద్యుడు శ్రీనివాస్​ప్రకటించడం కరెక్ట్​ కాదని, ఆర్టీసీలో మరణాల శాతం 20 వరకు ఉంటుందన్నారు.

కనీసం కార్మికులకు సరైన వైద్యం చేయడం లేదని, మందుల కోసం ఎక్కడికో పంపుతున్నారన్నారు. ఈ ఆస్పత్రిలో 100 బెడ్స్​ను ఐసోలేషన్​కు కేటాయించాలని కోరారు. అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న కార్మికులు ఒకటీ, రెండు గదుల్లోనే అద్దెకు ఉంటున్నారని తెలిపారు. కరోనా పాజిటివ్​వస్తే హోం క్వారంటైన్​లో అవకాశం లేని కార్మికులకు ఇక్కడే వసతి కల్పించాలని సూచించారు.

అంతేకాకుండా తార్నాక ఆస్పత్రిలో కొవిడ్​ కిట్లలో కూడా భారీ అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపించారు. పల్స్​ఆక్షీ మీటర్లు పని చేయడం లేదన్నారు. కార్మికులకు ఇచ్చే కిట్లలో గ్లౌజులు ఉండటం లేదని, శానిటైజర్లు కూడా లేవని రాజిరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్​ తర్వాత పెద్దాస్పత్రి అయిన కరీంనగర్​లో కేవలం మందులు మాత్రమే ఇస్తున్నారని, పల్స్​ మీటర్లు, శానిటైజర్లు, మాస్కులు ఇవ్వడం లేదన్నారు. కనీసం కరోనా కిట్స్​ కూడా ఇవ్వని ఆస్పత్రులు ఎందుకని రాజిరెడ్డి ప్రశ్నించారు.



Next Story

Most Viewed