కరోనా కాలంలో.. ఆరు రుచుల ఆరోగ్య రహస్యం (ఉగాది పచ్చడి)

by  |
కరోనా కాలంలో.. ఆరు రుచుల ఆరోగ్య రహస్యం (ఉగాది పచ్చడి)
X

ప్రపంచమంతా.. కరోనా కలవరంలో ఉంది. మన ప్రభుత్వం కూడా కరోనా కట్టడికి దేశమంతా 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించింది. మరి ఈ రోజు మనమంతా కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఈ పండుగ పూట మనమందరం ఇల్లలోనే ఉండి .. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు , పర్వదినాన్ని ఇంటిల్లిపాదితో సంతోషంగా గడుపుదాం. మరి ఉగాది రోజు తప్పనిసరిగా మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం. ఆ పచ్చడి లో మన శరీర రోగ నిరోధకశక్తి పెంచే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఉగాది పచ్చడి ఔషధగుణాల నిధి. కరోనాతో క్లిష్టంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో రోగనిరోధకశక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం తోడ్పడే గుణాలు ఉగాది పచ్చడిలో పుష్కలంగా ఉన్నాయి. పచ్చడి తయారీలో ఉపయోగించే ఆహార పదార్థాలన్నీ కూడా రోగనిరోధకశక్తికి తోడ్పడేవే! అంతేకాదు షడ్రుచుల సమ్మేళనంలో మన జీవిత సారం కూడా దాగి ఉంది.

పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీకగా నిలుస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. తీపి, ఉప్పు, చేదు,పులుపు, వగరు, కారం.. ఈ షడ్రుచుల సమ్మేళనం.. మన జీవితంలో వేటికి సంకేతంగా నిలుస్తాయంటే.

బెల్లం – తీపి .. మన జీవితంలోని ఆనందానికి సంకేతం.
ఉప్పు – మనలో ఉత్సాహాన్ని తెలిపే రుచికి ఇది గుర్తు.
వేప పువ్వు – చేదు – అందరి జీవితాల్లో సంతోషం ఉన్నట్లే, భాదలు కూడా ఉంటాయి. మరి బాధకలిగించే అనుభవాలను సూచించేదే ‘‘చేదు’’.

చింతపండు – పులుపు – మనం జీవితంలో ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవరోధాలు. ఏ పరిస్థితుల్లోనైనా..మన నేర్పుగా వ్యవహరించాలనడానికి గుర్తుగా పులుపు నిలుస్తుంది.
పచ్చి మామిడి ముక్కలు – వగరు- కొత్త సవాళ్లు స్వీకరించాలని ఇది సూచిస్తుంది.
మిరపపొడి – కారం – సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులకు ఇది గుర్తుగా నిలుస్తుంది.

షడ్రుచుల మేలు :

ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధమే మన ఉగాది . షడ్రుచుల సమ్మేళనంగా దీన్ని తయారు చేస్తారని అందరికీ తెలిసిందే.. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు’వేపపువ్వు, చింతపండు, బెల్లం, కారం, మామిడి కాయ ముక్కలు వేసి చేయడం సంప్రదాయం. ఈ పచ్చడిని ఉగాది పర్వదినం నుంచి మొదలుకొని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

బెల్లం :

బెల్లం తీపి స్వభావం కలిగి ఉంటుంది. వాత, పిత్త నివారిణి. తీపి శరీరానికి అవసరమైన బలాన్ని అందించి పోషిస్తుంది. బెల్లం నీళ్లు.. తల్లి పాలను వృద్ధిపరుస్తుంది. దప్పిక, మూర్ఛలను తగ్గిస్తుంది. మంటలనుంచి శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. రక్తాన్ని శుద్ధిచేస్తుంది. బెల్లంనీళ్లు ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. దీన్లోని ఇనుముతో రక్తవృద్ధి జరుగుతుంది. కాలేయంలో పేరుకున్న విషాలు బయటకు వెళ్లిపోతాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కండరాలు బలపడతాయి.

చింతపండు :

ఇది పులుపు స్వభావం కలిగి ఉంటుంది. రుచి కోల్పోయిన నాలుకను ఉత్తేజితం చేస్తుంది. వాతాన్ని పోగొట్టి ఆకలిని పెంచుతుంది. గుండెకు మేలు చేసే పులుపు పంచేంద్రియాలను పరిపుష్టం చేస్తుంది. శుక్రాన్ని తగ్గిస్తుంది. చింతపండుకు సహస్రవేధి అని పేరు. వేయి విధాలుగా శోధన చేసి, వ్యాధులను నివారిస్తుంది కాబట్టే చింతపండుకు ఆ పేరు. చింతపండు త్రిదోషహారి. చింతపండు తీసుకుంటే శ్రమ, బడలిక తొలగిపోతాయి. జ్వరం తగ్గుతుంది. క్యాల్షియం, ఐరన్‌, సోడియం, జింక్‌, ఫాస్ఫరస్‌, మన శరీరానికి అందుతాయి. దీన్లోని పీచు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీన్లోని పొటాషియం యాంటీఆక్సిడెంట్‌ ఫలితాన్ని ఇస్తుంది. కేన్సర్‌ నుంచి రక్షణ కల్పించే గుణాలూ చింతపండుకు ఉన్నాయి. జీర్ణశక్తిని పెంచడంతో పాటు, మలబద్ధకాన్నీ నివారిస్తుంది. రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది.

రాతి ఉప్పు :

కఫహారం, విషాహారం, మలమూత్రాలలో ఇబ్బందులను తొలగిస్తుంది. రాతి ఉప్పు చలువ చేస్తుంది. జీర్ణశక్తిని పెంచి, మెటబాలిజంను వృద్ధి చేస్తుంది. సైనస్‌, ముక్కు సంబంధిత ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. పొట్టలో నొప్పి తగ్గుతుంది. నులిపురుగులు మరణిస్తాయి. అధిక బరువు తగ్గిస్తుంది. ఒత్తిడి తొలగించి నిద్రను అందిస్తుంది. చిగుళ్ల నుంచి రక్తం కారే సమస్యలూ తగ్గుతాయి.

వేప పువ్వు :

విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. తల్లిపాలలోని దోషాలను తగ్గిస్తుంది. దప్పికను, దురదలను, మంటలను పోగొడుతుంది. చర్మవ్యాధులనుంచి ఉపశమనం కలిగిస్తుంది. వేప పువ్వులో అత్యంత మెరుగైన యాంటీవైరల్‌ గుణాలు ఉంటాయి. కాబట్టే చికెన్‌పాక్స్‌ సోకినప్పుడు వేపాకును విరివిగా వాడతారు. దీనికి యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలూ ఉంటాయి. వేపతో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. చర్మ సమస్యలూ తగ్గుతాయి. రక్తం శుద్ధి అవుతుంది. కఫ పిత్తాదులను తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుంది. దగ్గు, వ్రణాలు, జ్వరానికి చాలా మంచిది. చర్మవ్యాధులను తగ్గిస్తుంది.

పచ్చి మామిడి :

ఇది వగరు రుచిని అందిస్తుంది. కషాయరసం కలిగినది. విరేచనాలను తగ్గిస్తుంది. బహుమూత్రత్వాన్ని నిరోధిస్తుంది. గుండెకు మేలు చేస్తుంది.
పచ్చి మామిడితో తయారుచేసిన కషాయం ఎండవేడిమికి ముక్కు నుంచి రక్తం కారడాన్ని నివారిస్తుంది. వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తుంది. కాలేయం, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

కారం :

మలబద్ధకాన్ని నివారిస్తుంది. పేగుల్లోని పురుగులను చంపి ఆకలిని పెంచుతుంది. రుచిని పుట్టిస్తుంది. దురదలను తగ్గిస్తుంది. కాని ఎక్కువగా తీసుకుంటే రస రక్తాది ధాతువులు దెబ్బతింటాయి.

ఆరోగ్యపరంగా ఇన్ని రకాలుగా ప్రయోజనకారి అయిన ఉగాది పచ్చడి మన సంప్రదాయం అందించిన ప్రకృతి ఔషధంగా చెప్పవచ్చు. ఈ పచ్చడిని ఇష్టంగా ఆరగించి, నూతన సంవత్సరంతో పాటు నూతనోత్తేజాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆహ్వానిద్దాం. అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు.

Tags: corona virus,ugadi, sampradayam, pachadi, mango, vepa puvvu, spices,chintapandu, jaggery


Next Story

Most Viewed