ఉబర్ ఉద్యోగాలలో కోత!

by  |
ఉబర్ ఉద్యోగాలలో కోత!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ సంక్షోభంతో ఉబర్ టెక్నాలజీస్ కీలక ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3,700 ఉద్యోగాలను తొలగించనున్నట్టు వెల్లడించింది. ఇదే క్రమంలో ఉబర్ సీఈవో ధారా ఖోస్రోసాహి తన మూల వేతనాన్ని వదులుకోనున్నట్టు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో సంస్థలోని 14 శాతం మంది ఉద్యోగాలను పోగొట్టుకోనున్నారు. ఉబర్ టెక్నాలజీస్ ప్రపంచవ్యాప్తంగా 450 డ్రైవర్ సేవా కేంద్రాల్లో 40 శాతం మూసేస్తోంది. కొవిడ్-19 ప్రభావం కారణంగానే వ్యాపారంలో భారీ నష్టాలను ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. రానున్న రెండు వారాల్లో మరిన్ని కష్టతరమైన సర్దుబాట్లు జరగనున్నట్టు సీఈవో ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా తెలిపారు. గత సంవత్సరం జూలై నుంచి అక్టోబర్ వరకూ వివిధ కారణాలతో వెయ్యి మందికి పైగా ఉద్యోగులను తొలగించిన సంస్థ తాజా నిర్ణయంతో ఉద్యోగులకు చేదు వార్తనందించింది.

కరోనా వైరస్ వ్యాప్తి విజృంభించడం, లాక్‌డౌన్ వంటి ఆంక్షల కారణంగా యాప్ ఆధారిత రైడింగ్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పూర్తిగా పడిపోయిందని, దీంతో ఉబర్ ఖర్చులను తగ్గించుకోవడానికి తగిన చర్యలను తీసుకున్నామని సంస్థ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉబర్‌కు సుమారు 20 మిలియన్ డాలర్ల వ్యయం ఉన్నట్టు సంస్థ అంచనా వేస్తోంది. ఇక, ఉబర్‌ బాటలోనే కరోనా ప్రభావంతో అమెరికాలోని మరో సంస్థ లిఫ్ట్ వారం రోజుల క్రితం 17 శాతం అంటే 982 మందిని తొలగించింది. కొందరు ఉన్నతాధికారులను కూడా తొలగించినట్టు ప్రకటించింది. ఎక్కువమంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నందున సాధారణ పరిస్థితులు మారిపోయాయి. దీనికి తోడు ఆరోగ్యానికి సంబంధించి నిబంధనలు పాటించాల్సి రావడం, ఇతర ఆందోళనల కారణంగా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారని, అందుకే తమ వ్యాపారాలకు అధిక నష్టాలు తప్పట్లేదని వెడ్‌బుష్ సెక్యూరిటీష్ విశ్లేషకులు డేనియల్ పేర్కొన్నారు. ఈ పరిణామాలు డ్రైవర్ల ఆదాయానికి పెద్ద దెబ్బ అని, వారంతా కాంట్రాక్ట్ కార్మికులుగా మారిపోతారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక, కరోనా సంక్షోభాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఉబర్ సంస్థ సరికొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. రియల్ టైం డెలివరీ ట్రాకింగ్ విధానంతో ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవడానికి కస్టమర్లకు అనుమతి ఇస్తోంది. ఫుడ్ డెలివరీ ద్వారా నష్టపోయిన ఆదాయాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే, డ్రైవర్లను స్వతంత్ర కాంట్రాక్టర్లుగా వర్గీకరించి, కార్మికుల ప్రయోజనాలను నిలిపేశారనే ఆరోపణలతో ఉబర్, లిఫ్ట్ సంస్థలపై కేసులు నమోదైనట్టు తెలుస్తోంది.

Tags: Uber, employees, losing workforce, CEO of uber



Next Story

Most Viewed