తొలిరోజు రెండు మాత్రమే…

by  |
తొలిరోజు రెండు మాత్రమే…
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: ధరణి పోర్టల్ సేవలు మేడ్చల్ జిల్లాలో అందుబాటులోకి వచ్చాయి. సోమవారం మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ధరణి వెబ్ సైట్ లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. అక్టోబర్ 29న జిల్లా లోని మూడు చింతలపల్లిలో సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ను ప్రారంభించిన విషయం విధితమే. రెవెన్యూ అధికారులకు ఈ జిల్లాలోనే ధరణి పోర్టల్ పై అవగాహన కల్పించారు. అయినా తొలిరోజు ధరణి పోర్టల్ సేవల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. మేడ్చల్ తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ధరణి పోర్టల్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ఎటువంటి ఇబ్బందులు తలేత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియపై సందేహాలు ఉంటే నివృత్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ గీత పాల్గొన్నారు.

శామీర్ పేటలో రెండు..

జిల్లా వ్యాప్తంగా ఒక్క శామీర్ పేట మండలంలో మాత్రమే రెండు డాక్యుమెంట్లను పూర్తి చేసినట్లు అధికారులు తెలియజేశారు. రెండు డాక్యమెంట్లను అష్టకష్టాలు పడి రెవెన్యూ అధికారులు పూర్తి చేశారు. శామీర్ పేట మండల రెవెన్యూ కార్యాలయాన్ని అదన పు కలెక్టర్ విద్యాసాగర్, ఆర్డీఓ మల్లయ్య సందర్శించారు. తహసీల్దార్ సురేందర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయగా, ఆర్డీఓ మల్లయ్య కొనుగోలుదారులకు పాస్ పుస్తకాలను అందజేశారు. వారం పది రోజుల్లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లను పూర్తి చేసి పాస్ పుస్తకాలను అందజేస్తామని తెలియజేశారు.

పోర్టల్లో సాంకేతిక సమస్య..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ధరణి సేవలు తొలిరోజే మొరాయించాయి. మండల తహసీల్ కార్యాలయాల్లో ఆపరేటర్ దగ్గర కూడా ధరణి పోర్టల్ ఓపెన్ కాలేదు. ధరణి వెబ్ సైట్ ఓపెన్ కాకపోవడం తో వ్యవసాయ భూముల క్రయవిక్రయ దారు లు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. దీంతో జిల్లా కలెక్టరేట్ టెక్నికల్ సిబ్బంది పలు తహసీల్ కార్యాలయాల్లో సమస్యను అధిగమించేందుకు చేసిన కృషి ఫలించలేదు. ఉద యంనుంచే ఈ సేవా కేంద్రాల వద్ద స్లాట్కోసం రైతులు క్యూకట్టారు. ఈ సేవా కేంద్రా ల నిర్వహకులు స్లాట్ బుకింగ్ కోసం రూ. 200 నుంచి రూ.300 వసూలు చేస్తున్నట్లు పలువురు రైతులు వాపోయారు. 55 రోజుల తర్వాత వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు తిరిగి ప్రారంభం కావడంతో పలు కార్యాలయాల వద్ద సందడి నెలకొంది.

సాధారణ సేవలకు ఇబ్బందులు..

సాధారణ సేవల కోసం మండల కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం వేరే ప్రాంతాల నుంచి వచ్చామని వసంత అనే మహిళ వేడుకున్నా సిబ్బంది పట్టించుకోలేదు. ధరణి పోర్టల్ లో బీజీబీజీగా ఉన్నామని, ఇప్పుడు మిగితా పనులు చేయలేమని సిబ్బంది తెలియజేయడంతో ఇతర సేవల కోసం వచ్చిన వారంతా నిరాశతో వెళ్లిపోయారు.



Next Story

Most Viewed