పాలేరు రిజర్వాయర్‌లో విషప్రయోగం.. భారీగా రొయ్యలు మృతి

by  |
Paleru Reservoir
X

దిశ, పాలేరు: పాలేరు జలాశయంలో విష గుళికలు కలుపడంతో రూ. 2 లక్షల విలువైన రొయ్యలు మృతి చెందాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయంలో వెలుగుచూసింది. మత్స్యకారుల వివరాల ప్రకారం.. మత్స్య సొసైటీ సభ్యులు, 18 గ్రామాల మత్స్యకారులు పాలేరు జలాశయంలో ప్రభుత్వం పంపిణీ చేసిన ఉచిత చేప పిల్లలతో పాటు రొయ్య పిల్లలను కొనుగోలు చేసి చెరువులో పోసి పెంచుతున్నారు. ప్రస్తుతం అవి పెరగడంతో చేపలు,రొయ్యలను ఈ నెల 13న పట్టేందుకు నిర్ణయించారు. కానీ ఆదివారం తెల్లవారుజామున చెరువులోని రొయ్యలు మృతి చెందాయనే విషయం తెలుసుకున్న మత్స్యకారులు అక్కడికి చేరుకొని బోరున విలపించారు.

శనివారం రాత్రి కాపలాగా ఉన్న సొసైటీ సభ్యులకు పాలేరు గ్రామానికి చెందిన నందనబోయిన రాము, గోపినాధ్, వల్లేపు సామ్రాజ్యం, వెంకటేష్, రాంబాబు, రవి అనే వారు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వారు పాలేరు మిషన్ భగీరథ సంపూ వద్ద విషం గుళికలు కలిపి వలతో చేపలు, రొయ్యలు పడుతున్నట్లు గుర్తించారు. దీనిపై కూసుమంచి పోలీసులకు సొసైటీ అధ్యక్షుడు ఇస్లావత్ ఉపేందర్, కార్యదర్శి ఏడుకొండలు ఫిర్యాదు చేశారు. జలాశయాన్ని నమ్ముకొని రెండు వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఇదే విషయమై ఫిషరీస్ అసిస్టెంట్ డైరెక్టర్, కూసుమంచి సీఐ సతీష్‌కు దృష్టికి తీసుకెళ్లినట్లు మత్స్యకారులు తెలిపారు. దీంతో జలాశయంలో సుమారు 10 టన్నుల రొయ్యలు మృతి చెందినట్లు భావిస్తున్నారు.

తాగునీటిలో విషం.. నాలుగు జిల్లాల ప్రజలకు ముప్పే

పాలేరు జలాశయంలో విషం కలిపారన్న వార్తతో నాలుగు జిల్లాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పాలేరు రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ పథకం ద్వారా ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో గ్రామాలకు తాగునీటిని అవసరాలకు ఇక్కడి నుంచే నీటిని అందిస్తున్నారు. గ్రామీణ తాగునీటి పథకం (ఆర్‌డబ్ల్యూఎస్) ద్వారా ఆయా జిల్లాలోని గ్రామాలకు నీటి సరఫరా సాగుతోంది. ఇప్పుడు విషం కలిపిన నీళ్లు ప్రజలు తాగితే పరిస్థితి ఎంటనేది ప్రశ్నగా మారింది. ఈ నీటిని తగిన ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విషం కారణంగా నీటి సరఫరాను వెంటనే నిలిపివేసి ఆయా గ్రామాల్లో ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీటిని ల్యాబ్‌కి పంపి వచ్చిన నివేదిక తర్వాతనే నీటిని ఆయా గ్రామాలకు వదలాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed