టీవీ యాడ్స్ మోతలకు బ్రేక్

by  |
టీవీ యాడ్స్ మోతలకు బ్రేక్
X

దిశ, న్యూస్‌బ్యూరో : ఒకటి, ఒకటి, ఒకటి, రెండు, రెండు, మూడు, మూడు, మూడు..అన్నీ ర్యాంకులు మా విద్యాసంస్థలవే..టెన్త్, ఇంటర్, ఎంసెట్, సీఏ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలేవైనా మా స్కూల్, కాలేజీ విద్యార్థులే అన్నింటిలోనూ టాప్ అంటూ..టీవీల్లో అడ్వర్టయిజ్‌మెంట్‌లు హోరెత్తిపోయేవి. పలాన స్కూల్, కాలేజీ అని పేరు వినబడితే చాలు..అందులో ర్యాంకుల పంటపండిందంట కదా.. మా పిల్లల్ని కూడా అందులో వేయాలను కుంటున్నాం..మరి మీ పిల్లల్ని ఎందులో వేస్తున్నారు అని విద్యార్థుల తల్లిదండ్రులు చర్చించుకునే దాకా రాత్రింబవళ్లు యాడ్స్ మోత మోగించేవారు. కరోనా పుణ్యమా అని టీవీల్లో ర్యాంకులు ప్రకటించే వారి గొంతులు మూగబోయాయి.

కనిపించని, వినిపించని ర్యాంకులు..

అకాడమిక్ పరీక్షలు ముగిసి ఫలితాలు వెలువడ్డాయంటే చాలు ఏ టీవీ ఛానెల్‌లో యాడ్ వచ్చినా అందులో పెద్ద సౌండ్ వినిపించేలా ర్యాంకుల గోల ఉండేది. కరోనా నేపథ్యంలో ర్యాంకులు కాస్త కనుమరుగవ్వగా, వాటి గోల వినిపించడం లేదు. ఈ ఎండా కాలం సెలవుల్లో న్యూస్, ఎంటర్‌టెయిన్‌మెంట్ ఛానెల్స్‌లో రాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థల యాడ్స్ చూద్దామన్నా కనిపించడం లేదు. అడపా దడపా తప్ప యాడ్స్ లేకపోవడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉన్నట్టు తెలుస్తోంది.

లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ ఈ సమయంలో పరీక్షా ఫలితాలు వచ్చాయంటే రాష్ట్రంలో టాప్ గ్రేడ్ ర్యాంకులు పొందిన విద్యార్థులు తమ వారేనని ప్రముఖ కార్పేరేట్ విద్యాసంస్థలు యాడ్స్‌తో రాష్ట్ర మంతటా డప్పు కొట్టించేవి. కేవలం ఛానెళ్లలోనే కాకుండా న్యూస్ పేపర్లు, పాంప్లెంట్లలో ఫొటోలు, హాల్ టికెట్ నెంబర్లను ముద్రించి యాజమాన్యాలు ప్రచారం చేయించేవి. కరోనా ఎఫెక్ట్ పరీక్షలు, మూల్యాంకనంపై పడటంతో కార్పొరేట్ విద్యాసంస్థల హడావిడీ కనిపించకుండా పోయింది.

ఇప్పటికే ఇంటర్ పరీక్షలు అయిపోయాయి. పదో తరగతి పరీక్షలు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో ఫలితాలు రావడానికి ఇంకా టైం పడుతుంది. పదో తరగతి పరీక్షలను ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటర్ కాలేజీలు తమ విద్యా విధానం, బోధన తీరు తెన్నుల గురించి ప్రచారం చేయించుకునే అవకాశం లేకుండా పోయింది. తమ విద్యార్థులు వివిధ కోర్సుల్లో స్టేట్ ర్యాంకులు సాధించారని చెప్పి టెన్త్ విద్యార్థులను ఆకర్షించడం కూడా ఆగిపోయింది. ఇంటర్‌, ఇతర పోటీ పరీక్షల్లోనూ తమ విద్యార్థులే మేటి, సరిలేరు మాకెవ్వరూ పోటీ అంటూ..విద్యాసంస్థల ప్రచారం ఆగిపోవడంతో పలు టీవీ సంస్థలు కూడా రెవెన్యూ కోల్పొయినట్టు తెలుస్తోంది. అయితే పరీక్షలు మధ్యలో ఆగిపోయిన విద్యార్థులు కొంత అసంతృప్తికి గురవుతుండగా.. మరికొందరు మాత్రం ప్రిపరేషన్ కోసం సమయం దొరికిందని ఊపిరి పీల్చుకుంటున్నారు. పరీక్షలు పూర్తయిన విద్యార్థులకు ఫలితాలు వాయిదా పడటం పెద్ద ఉపశమనం దొరికినట్టుగా భావిస్తున్నారు.

Next Story

Most Viewed