జల్లేరువాగు బస్సు ప్రమాదంలో కీలక మలుపు.. కారణం అదే అంటున్న ప్రత్యక్ష్య సాక్షి

by  |
bus
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా జల్లేరువాగులో ఆర్టీసీ బస్సు పడిపోయిన ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం మానవ తప్పిదం వల్ల జరగలేదని.. స్టీరింగ్ పట్టేయడం వల్లే జరిగిందని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో సోమశేఖరరెడ్డి తన కుమారుడితో కలిసి బస్సులో ప్రయాణిస్తున్నాడు. అయితే బస్సు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా స్టీరింగ్ పట్టేసిందని వెల్లడించాడు. బస్సును కంట్రోల్ చేసేందుకు డ్రైవర్ తీవ్రంగా ప్రయత్నించాడని.. అయితే స్టీరింగ్ తిరగలేదని చెప్పుకొచ్చాడు. దాంతో బస్సు వంతెన రెయిలింగ్‌ను ఢీకొట్టి వాగులో పడిపోయిందని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ నీళ్లలో ఊపిరాడక మరణించగా.. తమను స్థానికులు రక్షించారని సోమశేఖర్ రెడ్డి తెలిపాడు. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 15న ఉదయం అశ్వారావుపేట నుంచి సుమారు 43 మంది ప్రయాణికులతో బస్సు జంగారెడ్డిగూడెం బయలుదేరింది.

ఈ క్రమంలో జల్లేరు వాగు వంతెన వద్దకు రాగానే బస్సు అదుపుతప్పి వంతెనపై ఉన్న డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ఒక్కసారిగా వాగులోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో 9 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. అయితే జంగారెడ్డిగూడెం వద్ద బస్సు అదుపుతప్పి వంతెన పైనుంచి వాగులో పడిపోయిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రమాదం జరిగిన బస్సును డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ అదేరోజు పరిశీలించారు. ప్రమాదానికి గురైన బస్సు కొత్తదని.. ఎలాంటి సమస్యలు లేవని వెల్లడించారు.

గత వారం రోజులుగా బస్సుకు ఎలాంటి సమస్యలు లేవని చెప్పుకొచ్చారు. బస్సులో టెక్నికల్ సమస్యలు తలెత్తలేదని తెలిపారు. ఈ బస్సు 3 లక్షల 11 కి.మీ మాత్రమే తిరిగిందని.. ఇది కొత్త బస్సు కిందే లెక్క అని స్పష్టం చేశారు. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని ఆయన పేర్కొన్నారు. డ్రైవర్ చిన్నారావు రోడ్డును సరిగా అంచనా వేయలేకపోయాడని ఇంజనీర్ పేర్కొన్నారు. తాజాగా ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షి బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి సోమశేఖర్ రెడ్డి స్టీరింగ్ పట్టేయడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పడం కీలక మలుపు చోటు చేసుకుంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.



Next Story

Most Viewed