BRS హై కమాండ్‌కు కొత్త టెన్షన్.. ఎన్నికల వేళ అధిష్ఠానం ఆదేశాలు బేఖాతర్ చేస్తోన్న లీడర్స్..!

by Disha Web Desk 19 |
BRS హై కమాండ్‌కు కొత్త టెన్షన్.. ఎన్నికల వేళ అధిష్ఠానం ఆదేశాలు బేఖాతర్ చేస్తోన్న లీడర్స్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: నేతలంతా సమిష్ఠిగా పనిచేయాలని బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. కానీ, మాజీ ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నేతలు సైతం కొందరు అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారని సమాచారం. పైగా ఎంపీ అభ్యర్థులనే దబాయిస్తూ.. నియోజకవర్గానికి ప్రచారానికి వచ్చినప్పుడు తమకు చెప్పిరావాలని, తాము సూచించిన వారికి ప్రచార నిమిత్తం ఖర్చులు ఇవ్వాలని హుకూం జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరికొంతమంది ఏకంగా ఇతర పార్టీల వారికి లోపాయికారిగా మద్దతు ఇస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. కొందరు నేతల ఈ తరహా వ్యవహారశైలి బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది.

నామ్ కే వాస్త్‌గా ప్రచారం..

‘అసెంబ్లీ’ తప్పిదాలు రిపీట్ కాకుండా లోక్‌సభ ఎన్నికలలో లోపాలు సరిదిద్దేందుకు పార్లమెంట్ వారీగా బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాలను నిర్వహించింది. ఫీడ్ బ్యాక్ అనంతరం మాజీ ఎమ్మెల్యేలు గెలుపుబాధ్యత తీసుకొని ముమ్మర ప్రచారం చేయాలని పార్టీ ఆదేశించింది. ఎన్నికల సమన్వయకర్తలకు సైతం సహకరించాలని సూచించింది. అయినప్పటికీ ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఇలా పలు జిల్లాల్లోనూ మాజీ ఎమ్మెల్యేల్లో కొంతమంది ప్రచారానికి అంటిముట్టనట్టుగా ఉంటున్నారని సమాచారం.

పార్టీ అధిష్టానం సీరియస్‌గా చెప్పినప్పటికీ ఆ మాటలను బేఖాతార్ చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. మాజీ ఎమ్మెల్యేల్లో చాలా మందికి రియల్ ఎస్టేట్, బిజినెస్, వ్యాపారాలు తదితరాలు ఉండటంతో యాక్టివ్‌గా తిరిగితే తమపై ఎక్కడ కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నవారు పడతారేమోనని జంకుతున్నట్టు తెలిసింది. అందుకే ప్రచారం నామ్ కే వాస్త్‌గా చేస్తున్నట్టు సమాచారం. సీనియర్ లీడర్లు సైతం తూతూ మంత్రంగానే క్యాంపెయిన్ చేస్తున్నారు. పైగా పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థులనే దబాయిస్తున్నట్టు వినికిడి.

చర్చనీయాంశంగా నేతల వ్యవహార శైలి..

తను ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు లిప్టు చేయాలని, చెప్పినవారికి ప్రయారిటీ ఇవ్వాలని, ప్రచార ఖర్చులు సైతం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులకు ఆదేశాలిస్తున్నట్టు తెలిసింది. ప్రచారంలో ఉన్నప్పుడు ఫోన్ ఎత్తకపోతే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది. సదరు లీడర్లు ఎందుకు అలా వ్యవహరిస్తున్నారు..? పార్టీ అధిష్టానం దృష్టిసారించకపోవడమా..? లేకుంటే కావాలని చేస్తున్నారా..? అనేది అంతుచిక్కడం లేదని పార్టీలోని నేతలు కొందరు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు.

పార్టీలో ఉంటూనే.. మరో పార్టీకి క్యాంపెయిన్

కొందరు నేతలు బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ రాత్రి సమయాల్లో మాత్రం కేడర్‌తో మరోపార్టీకి ఓటు వేయాలని సూచిస్తున్నట్టు సమాచారం. ఇతర పార్టీలోనూ తనవాళ్లు ఉంటే భవిష్యత్‌లో ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయని వారు భావిస్తున్నట్టు సమాచారం. అందుకు పైకిమాత్రం పార్టీలో ఉంటూ పరోక్షంగా మరోపార్టీకి ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

హైదరాబాద్, మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ తరహా వ్యవహారం ఎక్కువగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికల వేళ పార్టీ నేతల వ్యవహార శైలి పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ప్రస్తుత పరిస్థితిలో అధిష్ఠానం ఎవరిపై చర్యలు తీసుకునే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. కొంతమంది లీడర్లు పార్టీలోనే ఉంటూ పార్టీకి నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నా చూసిచూడనట్టుగానే గులాబీ పార్టీ హై కమాండ్ వ్యవహరిస్తున్నది.

Next Story