‘కరోనా’తో..వాళ్లకు మేలు..!

by  |
‘కరోనా’తో..వాళ్లకు మేలు..!
X

దిశ, నిజామాబాద్: భారత్ సహా ప్రపంచాన్ని వణికిస్తోన్న నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) అన్ని రంగాలనూ ఆగమాగం చేసింది. ఈ మహమ్మారి వ్యాప్తి కట్టడికి విధించిన లాక్ డౌన్‌తో ఫ్యాక్టరీలు, సంస్థలు మూతపడ్డాయి. కులవృత్తులు, కూలీనాలీ చేసుకునే చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతులు నష్టపోతున్నారు. ఇందరిని నష్టపరుస్తున్న కరోనా జిల్లాలోని పసుపు వ్యాపారులకు మాత్రం మేలు చేస్తోంది. పసుపు పంట చేతికొచ్చే ఈ సమయంలో లాక్ డౌన్‌తో వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు క్రయవిక్రయాలు నిలిపేశారు. ఈ-నామ్ ద్వారా కొనుగోళ్లు జరిపే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ మూసేశారు. దీంతో వ్యాపారులు ‘జీరో’ దందా చేస్తూ అన్నదాతకు అన్యాయం చేస్తున్నారు.

అగ్గువ ధరకే..అమ్మకాలు..

పసుపును కేంద్రం సుగంధ ద్రవ్యాల జాబితాలో చేర్చడంతో పాటు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న రైతులకు ‘కరోనా’ కొత్త కష్టాలు తెచ్చింది. పసుపునకు దేశ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ మేరకు ఈ-నామ్ ద్వారా మార్కెట్‌లో అమ్ముకోవాలన్న ఆశలపై నీళ్లు చల్లింది. పసుపును నిలువ చేసి రుణాలు తీసుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకుందామనుకున్న రైతుల కోరికలపై కోల్డ్ స్టోరేజీలూ షాక్‌ను ఇచ్చాయి. ఇతర పంటలు నిల్వ ఉండటంతో వాటిని స్టోర్ చేసేందుకు స్థలం లేక వ్యాపారులకు అగ్గువకే అమ్ముకుంటున్న పరిస్థితి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో పసుపు క్రయవిక్రయాలు బంద్ అయి నెలరోజులు కావొస్తుంది. నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్ జిల్లాలో పండిన పసుపులో ఇప్పటి వరకు రైతులు అమ్ముకున్నది 40 శాతమే. మహరాష్ర్టలోని సాంగ్లీలో ప్రభావతీ, గుంటూర్ రకం, శీలవతి అనే పసుపు రకాలకు డిమాండ్ ఉన్నా అక్కడికి వెళ్లి విక్రయించలేని పరిస్థితి. దానిని అసరాగా చేసుకుని పసుపు వ్యాపారులు జీరోలో పసుపును కోనుగోలు చేస్తున్నారు. నిజామాబాద్ శ్రద్ధనంద్ గంజ్‌కు చెందిన వ్యాపారులే కోల్డ్ స్టోరేజీల కృత్రిమ కొరత సృష్టించారు అనే వాదనలూ ఉన్నాయి.

రైస్ మిల్లులే కేంద్రంగా..

వ్యవసాయ మార్కెట్‌ను ప్రభుత్వం మూసివేయడంతో వ్యాపారులు జీరో వ్యాపారానికి రైస్ మిల్లులను అడ్డాలుగా చేసుకున్నారు. దుబ్బ, కాలుర్, ఖానాపూర్‌లలోని రైసు మిల్లులలో పసుపు క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులను సాకుగా చూపి వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొమ్ములకు రూ.5,000 క్వింటాల్‌కు, మండ‌కు క్వింటాల్‌కు రూ.4,800 మాత్రమే చెల్లిస్తున్నారు. నిత్యం 10 వేల వరకు బస్తాల అమ్మకాలు జరుగుతున్నాయంటే ఇందూరులో పసుపు జీరో దందా ఎంతగా జరుగుతుందో అంచనా వేయొచ్చు. రైస్ మిల్లుల ప్లాట్‌ఫారాలు పసుపు రాశులు, సంచులతో నిండిపోతున్నాయి. ఇదిలా ఉండగా మిల్లింగ్ కోసం మిల్లుల వద్దకు వచ్చిన ధాన్యం లారీలు అన్‌లాడింగ్ కోసం రోడ్డుపైనే ఉంటున్నాయి. వాటికి హమాలీ కొరతను సాకుగా చూపిస్తున్న వ్యాపారులు పసుపు విక్రయాలకు మాత్రం ఆ కొరత లేకుండా చూస్తున్నారు. అయితే, ప్రభుత్వం పసుపు విక్రయాలపై కనీస మద్దతు ధరపై ప్రకటన చేస్తే బాగుండేదని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇలా జీరో దందాకు తెరలేపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న పసుపు వ్యాపారులపై మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Tags: turmeric farmers, loss, income to, merchants, covid 19 effect, lock down, e nam, market

Next Story

Most Viewed