పసుపు రైతుల క‘రోనా’..!

by  |
పసుపు రైతుల క‘రోనా’..!
X

దిశ, నిజామాబాద్: కరోనా(కోవిడ్-19) ఎఫెక్ట్ రైతులపైనా పడింది. దేశంలో అన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెటింగ్ స్తంభించింది. పచ్చ బంగారంగా ప్రసిద్ధి గాంచిన పసుపు ఎగుమతులు నిలిచి పోయాయి. దేశంలో 36 శాతం నిజామాబాద్ నుంచే ఎగుమతి అవుతుంది. శ్రీలంక, బంగ్లాదేశ్, చైనాలకూ నిజామాబాద్ పసుపు ఎగుమతి అవుతుంది. అయితే, ఆ దేశాలు దిగుమతులు నిలిపేయడంతో పసుపు రైతుల ఆసలు అడియాసలు అవుతున్నాయి. పంట చేతికొచ్చే ఫిబ్రవరి-మార్చి కాలంలో పసుపు విక్రయాలు బాగా జరుగుతాయని అనుకున్న వారికి ఈసారి కరోనా నిరాశే మిగిల్చింది.

21 నుంచి మార్కెట్ బంద్

పసుపునకు మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో కరోనా నేపథ్యంలో క్రయవిక్రయాలను మార్కెటింగ్ అధికారులు ఈ నెల 21 నుంచి నిలిపేయడం రైతుల నెత్తిన పిడుగు పడేయడమేననీ, కొన్ని రోజులపాటు మార్కెట్ నడపాలని రైతులు కోరుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో పసుపు రైతులు 40 వేల హెక్టార్లలో పసుపును సాగు చేశారు. ఈసారి 9 నెలలకాలంలో చేతికి వచ్చే గుంటూర్, ప్రతిభ అనే రకాల పసుపు సాగు చేశారు. గతేడాది రైతులకు 10 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ సారి 13 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్టు వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. పసుపు అమ్మకమంతా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కేంద్రంగా జరుగుతుంది. 2017 నుంచి ఇక్కడ ఈ నామ్ ద్వారా క్రయ విక్రయాలు జరుగుతాయి. గత నెలలో మార్కెట్ యార్డుకు 2 లక్షల క్వింటాళ్ల పసుపు వచ్చింది. మార్చిలో పెద్ద ఎత్తున పసుపు మార్కెట్‌కు పోటెత్తింది. కనీసంగా ఒక రోజు మార్కెట్‌కు 80 వేల బస్తాలు రైతులు తీసుకొస్తారు. అత్యధికంగా రూ.6,500 మార్కెట్‌ ధర పలికింది. తేమ, పచ్చివి అనే కారణంగా గోల, మండ రకాలకు తక్కువగా రూ.4,500 ధర మాత్రమే దక్కింది.


గురువారం, శుక్రవారం మార్కెట్‌కు వచ్చిన పసుపును మాత్రం బీట్ చేసి నిలిపేశారు అధికారులు. ఇప్పటి వరకు 9 లక్షల క్వింటాళ్ల పసుపు విక్రయం జరిగినట్టు అధికారులు చెప్పారు. రైతుల వద్ద ఇంకా 3 లక్షల క్వింటాళ్ల పసుపు ఉందని అంచనా. ఈ నెల 21 నుంచి మార్కెట్ నిలపేస్తున్నట్టు చెబుతున్న అధికారులు తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని రైతులు కోరుతున్నారు. మళ్లీ మార్కెట్ ప్రారంభమయ్యే వరకు నిలువ ఉంచుకోవాలన్నా కోల్డ్ స్టోరేజీలు సరిపోయే అన్ని లేవని రైతులు వాపోతున్నారు. కొంత మంది రైతులు మహరాష్ర్టలోని సాంగ్లీకి తరలించారు. మిగతా రైతులు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ గోదాములులోగానీ, నాబార్డు గోదాములలోగానీ నిల్వ ఉంచాలా అని యోచిస్తున్నారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తాత్కాలిక కోల్డ్ స్టోరేజీలు లేదా గోదాముల్లో నిల్వ ఉంచేందుకు అనుమతులిచ్చేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Tags: corona(covid-19) effect, turmeric farmers, market breakdown, nizamabad dist



Next Story