ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. వారికి గౌరవ వేతనాలు పెంపు

by  |
ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. వారికి గౌరవ వేతనాలు పెంపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణను అనుసరిస్తూ ఆయా సంస్థలు, విభాగాల్లో పని చేస్తున్న వారితో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీసెస్ ఎంగేజ్‌డ్ సిబ్బందికి కూడా గౌరవ వేతనాల్లో 30 శాతం పెంపు వర్తిస్తుందని వెల్లడించారు. అదేవిధంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లకు కూడా ఈ వేతన పెంపు అమలు చేయనున్నట్లు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీసెస్ ఎంగేజ్‌డ్ విభాగంలోని హోం గార్డులు, అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు, విలేజ్​ రెవెన్యూ అసిస్టెంట్స్, వీఏఓలు, ఆశా వర్కర్లు, సెర్ప్ సిబ్బందికి కూడా 30 శాతం వేతన పెంపు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం వారికిచ్చే గౌరవ వేతనంపైనే ఈ పెంపు ఉండనుంది. అదే విధంగా రోజువారీ వర్కర్లుగా పని చేస్తున్న వారికి ప్రస్తుతం రూ. 300 చొప్పున చెల్లిస్తుండగా.. ఇక నుంచి రూ.390 చెల్లించాలని పేర్కొన్నారు. ఫుల్​టైం కాంటిజెంట్​ వర్కర్లకు ప్రస్తుతం రూ.8 వేల చొప్పున చెల్లిస్తుండగా వారికి రూ. 10,400కు పెంచారు.

పార్ట్​టై వర్కర్లకు ప్రస్తుతం రూ.4 వేలు చెల్లిస్తుండగా వచ్చేనెల నుంచి రూ.5,200 చొప్పున ఇవ్వనున్నారు. ఇక ఆయా శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్​ సిబ్బందికి గతంలో విడుదల చేసిన జీవో 6‌‌0 ప్రకారమే వేతనాలు ఇవ్వనున్నట్లు అనుబంధ జీవోను విడుదల చేశారు. 30 శాతం పెంపును వర్తింపచేస్తున్నట్లు స్పష్టం చేశారు. పీఆర్సీ కమిషన్ మాత్రం కనీస వేతనాన్ని సూచించిన విషయం తెలిసిందే. కనీస వేతనం రూ.19 వేలుగా ఉండాలని నివేదించినా.. 30 శాతం పెంపును అమలు చేస్తున్నారు. దీనిపై సదరు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. ప్రభుత్వం పెంపును యధాతథంగా అమలు చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులిచ్చారు.

Next Story

Most Viewed