సర్కారీ బడులకు కార్పొరేట్ మేకప్.. మౌలిక వసతుల కోసం రూ.18 కోట్లు

by  |
సర్కారీ బడులకు కార్పొరేట్ మేకప్.. మౌలిక వసతుల కోసం రూ.18 కోట్లు
X

దిశప్రతినిధి, మేడ్చల్ : సర్కారు బడులపై ప్రభుత్వం దృష్టి సారించింది. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు త్వరలోనే మారనున్నాయి. పేదల బడుల్లో సకల సౌకర్యాలు సమకూరనున్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా స్కూళ్లను తీర్చిదిద్దెందుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏటా ఇచ్చే నియోజకవర్గ అభివృద్ది కార్యక్రమం (సీడీపీ) నిధుల నుంచి 40 శాతం విధిగా పాఠశాలల సమస్యల పరిష్కారానికి ఖర్చు పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

ఏటా రూ.18 కోట్లు..

2021- 22 ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నియోజకవర్గాల అభివృద్దికి సీడీపీ నిధులను రూ.5 కోట్ల చొప్పున ఇస్తుంది. గతంలో రూ.3 కోట్లు మాత్రమే ఇచ్చేది. కరోనా కారణంగా రెండేళ్లుగా ఈ నిధుల కేటాయింపు జరగలేదు. తాజాగా సీడీపీ నిధుల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పెంచిన ప్రకారం రూ.5 కోట్ల నిధుల్లో 40 శాతం అంటే రూ.2 కోట్లు ఇక నుంచి ఖచ్చితంగా విద్యా సంస్థల సమస్యల పరిష్కారానికి వినియోగించాలి. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.

జిల్లాలో శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కూకట్ పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్ ఆరు నియోజకవర్గాలుండగా, ముగ్గురు ఎమ్మెల్సీలు శంభీపూర్(సుంకరి) రాజు, నవీన్ రావు, కాటెపల్లి జనార్దన్ రెడ్డి ఉన్నారు.దీంతో ఈ తొమ్మిది మంది ఒక్కొక్కరి నుంచి రూ.2 కోట్ల చొప్పున ఏటా రూ.18 కోట్లను కేటాయించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ నిధుల మంజూరుకు ఇన్‌చార్జి మంత్రి ఆమోదాన్ని తప్పనిసరి చేసింది. మార్గదర్శకాల ప్రకారం సీడీపీ నిధులు ఖర్చయ్యేలా చూసే బాధ్యతను జిల్లా ముఖ్య ప్రణాళికాధికారులకు అప్పగించింది. సీడీపీ నిధులు సద్వినియోగమయ్యేలా చూడాలని కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించింది.

సకల సౌకర్యాలు..

మేడ్చల్ జిల్లాలో మొత్తం 505 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి.వీటిలో 375 ప్రాథమిక పాఠశాలలు, 22 ఉన్నత ప్రాథమిక పాఠశాలలు, 108 హై స్కూల్స్ ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం 79,962 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలల అభివృద్ధికి నిర్దేశించిన నిధులను వేటికి ఎంత ఖర్చు చేయాలనే అంశాలను మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలు, అదనపు తరగతి గదులు, గ్రంథాలయాలు, ల్యాబరేటరీ బ్లాక్‌ల నిర్మాణం, విద్యార్థులకు వసతి గృహాలు, గదులు, ప్రహరీలు, కంప్యూటర్‌ కేంద్రాలు, ఆడిటోరియంలు, సైకిల్‌ స్టాండ్లు, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనానికి వంట గదులు, డైనింగ్‌ హాళ్ల నిర్మాణం, వాటర్‌ ప్యూరిఫయర్లు, సోలార్‌ గీజర్ల ఏర్పాటు, డ్యూయెల్‌ డెస్క్‌ బెంచీలు, ప్రొజెక్టర్ల కొనుగోలుకు ఈ నిధులను ఖర్చుచేయాలని మార్గదర్శకాలను రూపొందించింది.



Next Story

Most Viewed