ఈటలను ఢీకొట్టేందుకు ‘సాగర్’ వ్యుహం..?

by  |
ఈటలను ఢీకొట్టేందుకు ‘సాగర్’ వ్యుహం..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : త్వరలో ఉపఎన్నికలు జరగబోయే హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ నాగార్జున సాగర్‌లో అనుసరించిన వ్యూహానికి ధీటుగా పార్టీ నెట్‌ వర్కును ముమ్మరం చేసింది టీఆర్ఎస్ అధిష్టానం. ప్రతీ గ్రామానికి ఒక ఎమ్మెల్యేను ఇన్‌చార్జీగా నియమించింది. అధికారికంగా ప్రకటించడమే తరువాయి. ప్రతీ మండలానికి ఇద్దరు ఇన్‌చార్జీలను ఇప్పటికే నియమించగా, టీఆర్ఎస్ గ్రామ శాఖ సమన్వయంతో ప్రతి ఒక్క ఓటరునూ కలిసేలా ప్రణాళికలు రూపాందాయి. మంత్రులు, ఎమ్మెల్యేలంతా హుజూరాబాద్‌ వైపే కదులుతున్నారు. సంక్షేమ పథకాలు, కొత్త పథకాలు సైతం హుజూరాబాద్ కేంద్రంగానే వేగంగా అమలవుతున్నాయి.

హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా ఉంటాయని భావిస్తున్నది. ఇతర పార్టీల ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నది. బీజేపీ అభ్యర్థిగా దాదాపు ఖరారైన ఈటల రాజేందర్ పాదయాత్రతో అన్ని గ్రామాలనూ చుట్టేస్తున్నారు. టీఆర్ఎస్ తరఫున ఓయూ, కేయూ విద్యార్థి జేఏసీ కార్యకర్తలు బస్సు యాత్ర పేరుతో ప్రచారం చేస్తున్నారు. దళితబంధు, రెండో విడత గొర్రెల పంపిణీ, ఆసరా పింఛన్లు అధికార పార్టీకి ప్రధాన అంశాలు. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ప్రతీ గ్రామానికి ఇన్‌చార్జిగా ఎమ్మెల్యేను నియమించనున్నది.

మండలానికి ఇద్దరు ఇన్‌చార్జీలు..

హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు టీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే ఇద్దరు చొప్పున ఇన్‌చార్జులను నియమించింది. వీణవంక మండలానికి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావుకు బాధ్యతలను పార్టీ అధిష్ఠానం అప్పగించింది. జమ్మికుంట మండలాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్, వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌లు చూసుకుంటున్నారు. ఇల్లందకుంట మండలానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నియమితులయ్యారు. హుజూరాబాద్ పట్టణానికి కరీంనగర్ మేయర్ వై.సునీల్ రావు, హుజూరాబాద్ మండలానికి హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబు కేటాయించబడ్డారు.

కమలాపూర్ మండలానికి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, రాష్ట్ర నాయకుడు పేరాల రవీందర్ రావు ఇన్ చార్జులుగా వ్యవహరిస్తున్నారు. ఈ మండలాల్లో పార్టీ సూచించే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, సర్పంచులతో కలిసి ప్రతి ఓటరు దగ్గరకూ వెళ్తున్నారు. వీరిపై పర్యవేక్షణ బాధ్యతలను ఎంపీపీ, జడ్పీటీసీలకు అప్పగించింది పార్టీ అధినాయకత్వం.

ఇదిలాఉండగా మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ పూర్తి స్థాయిలో తిరుగుతున్నారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గ్రామస్థాయిలో జరుగుతున్న మార్పులు, ఓటర్ల నాడి, వారి అభిప్రాయాలను ప్రతిరోజూ అధిష్టానానికి అందజేస్తున్నారు.

ప్రతీరోజు రెండు గ్రామాలు..

ఓయూ, కేయూ జేఏసీ కార్యకర్తలు హుజూరాబాద్‌లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఎనిమిది రోజులుగా రోజుకు రెండు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నట్లు జేఏసీ నేత కట్టం శివ తెలిపారు.

ద‌ళిత మ‌హిళా జ‌డ్పీచైర్‌ప‌ర్స‌న్‌కు అవ‌మానం

Next Story