కేటీఆర్‌కు తలనొప్పిగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. హుజూరాబాద్‌ ఎన్నికపై అసంతృప్తి

by  |
కేటీఆర్‌కు తలనొప్పిగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. హుజూరాబాద్‌ ఎన్నికపై అసంతృప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ ఉప ఎన్నికపై అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. సంక్షేమ పథకాల ప్రారంభానికి కేంద్రంగా, పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీనికితోడు రోడ్లు, పెండింగ్ అభివృద్ధి పనుల పూర్తికి నిధులు మంజూరు చేస్తోంది. త్వరితగతిన పూర్తికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలపై ప్రజల ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది. రాజీనామాలు చేయాలని డిమాండ్లు సైతం వస్తుండటంతో చేసేదేమీ లేక అధికారపార్టీ ప్రతినిధులు అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారు. తమ నియోజకవర్గాలకు సైతం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమైన విషయం తెలిసిందే. అయితే ఈటల రాజీనామా చేసి తిరిగి బీజేపీ నుంచి పోటీ చేస్తుండటంతో అధికార పార్టీ ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. అభివృద్ధి పనులు చేపడుతోంది. వందల కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు సైతం కేటాయిస్తోంది. దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌నే పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం విధితమే. అంతేగాకుండా రెండో విడుత గొర్రెల పంపిణీని సైతం ప్రారంభించడం, అభివృద్ధి పనులు సైతం వేగంగా జరుగుతుండటంతో రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గ ప్రజలు ఆ నియోజకవర్గంపై దృష్టి సారించారు. అక్కడ జరుగుతున్న పనులు తమ నియోజకవర్గాల్లో జరిగితే బాగుండని తమతమ ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతున్నారు. మీరు కూడా రాజీనామా చేసి నిధులు తేవాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రజల ఒత్తిడిని, డిమాండ్లకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఎమ్మెల్యేలకు దాపురించింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై రోజురోజుకూ రాజీనామాల డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తామని అభివృద్ధికి హుజూరాబాద్ తరహాలో నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో అధికార పార్టీపై మరింత ఒత్తిడి పెరిగింది. నకిరేకల్, కోదాడ నియోజకవర్గాల ప్రజలతో పాటు అన్ని నియోజకవర్గాల ప్రజలు వినతులు సైతం అందజేసిన సందర్భాలు ఉన్నాయి. రాజీనామాలతోనే నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని లేకుంటే ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసే పరిస్థితి లేదనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. దీంతో ఒత్తిడి తీవ్రమవుతోంది.

ఎమ్మెల్యేలకు స్థానిక నియోజకవర్గాల్లో ఒత్తిడి పెరుగుతుండటంతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ను కొంతమంది ఎమ్మెల్యేలు కలిసినట్లు సమాచారం. హుజూరాబాద్ నియోజకవర్గానికి కేటాయిస్తున్న నిధులు తమ నియోజకవర్గాలకు కేటాయించాలని, పెండింగ్ పనుల పూర్తికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాలకు వెళ్తే సమస్యలను పరిష్కరించాలని, నిధులు కేటాయించాలని అడుగుతున్నారని, చేసేదేమీలేక దాటవేత ధోరణిని ప్రదర్శిస్తున్నామని వాపోయినట్లు సమాచారం. తమకు హుజూరాబాద్ తరహాలో నిధులు కేటాయిస్తే నియోజకవర్గాల్లో సాఫీగా అభివృద్ధి పనులు చేసుకుంటామని లేకపోతే మా పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుందని విన్నవించినట్లు ఓ ఎమ్మెల్యే పేర్కొన్నారు. మరి ప్రభుత్వం కేవలం అభివృద్ధిని హుజూరాబాద్‌కే పరిమితం చేస్తుందా? లేకుంటే రాష్ట్రం మొత్తం అదే విధానాన్ని అవలంభిస్తుందా? అనేది చర్చనీయాశంగా మారింది.

ఇవి కూడా చదవండి:

ఆసక్తి రేపుతోన్న సింగరేణి ఎన్నికలు.. బరిలోకి సీతక్క..?

Next Story

Most Viewed