శాయంపేట ‘కారు’లో అధ్యక్ష పోరు.. చక్రం తిప్పనున్న గండ్ర దంపతులు

by  |
శాయంపేట ‘కారు’లో అధ్యక్ష పోరు.. చక్రం తిప్పనున్న గండ్ర దంపతులు
X

దిశ, పరకాల : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు శాయంపేట మండలంలోని ఒకటి, రెండు మినహా అన్ని గ్రామాలు వ్యవస్థాగత నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. అత్యధిక గ్రామాలు ఏకగ్రీవంగానే నిర్వహించబడ్డాయి. రెండ్రోజుల్లో పార్టీ మండల అధ్యక్షుడి నియామకం కూడా పూర్తికానుంది. ఇప్పటికే పలువురి పేర్లు గండ్ర వెంకటరమణారెడ్డి దంపతుల పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డిలు అధ్యక్ష పీఠం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే క్రమంలో బీసీ సామాజిక వర్గం నుండి గుర్రం రవీందర్, ఇమ్మడిశెట్టి రవీందర్‌లు సైతం గండ్ర దంపతులను కలిసి విన్నవించుకున్నట్టు సమాచారం. దళిత సామాజిక వర్గం నుండి కొమ్ముల భాస్కర్ సైతం అధ్యక్ష పదవి ఆశావహుల్లో ఒకరిగా ఉన్నట్టు పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

మండల అధ్యక్ష పదవి కోసం భాస్కర్ గతంలో కూడా ప్రయత్నించారు. పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీలోనైనా స్థానం దక్కుతుందనే ఆశతో ఇంత కాలం ఎదురు చూశాడు. గండ్ర దంపతులకు పదవులు ఉన్నా లేకపోయినా వారినే నమ్ముకుని ఉన్నవారిలో భాస్కర్‌కు అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరుంది. అయితే, వీరందరిలో అధ్యక్ష పదవి ఎవరిని వరించనుందోననే చర్చ మండలవ్యాప్తంగా ఊపందుకుంది. ఈ చర్చలో ఎవరి అంశం ఏదైనా ఒక వాదన మాత్రం బలంగా వినిపిస్తోంది. ఇప్పటివరకు మండలంలో రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యం కొనసాగుతోంది. ఎస్సీ ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఉండటం లేదనేది పలువురి ఆరోపణ.

జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, రైతు సమన్వయ సమితి కన్వీనర్, పీఎసీఎస్ వైస్ చైర్మన్ లాంటి ప్రజాప్రతినిధులతో పాటు మండల అధ్యక్ష పదవి సైతం రెడ్డి సామాజిక వర్గం చేతిలోనే ఉంది. పదవులే కాదు సభలు, సమావేశాల్లోనూ దళితులకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారనేది పలువురు దళిత నాయకులు ఆరోపిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులకు పదవులు ఉన్నాప్రోటోకాల్ ప్రకారం సభలు, సమావేశాల్లో అవకాశం కల్పించడం లేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకులు మాజీ ప్రజాప్రతినిధులైనప్పటికీ వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నారని కొందరి వాదన. కేవలం నలుగురు రెడ్డిలే మొత్తం మండలాన్ని శాశిస్తున్నారనే వాదనలు సైతం చక్కర్లు కొడుతున్నాయి. ఇన్ని వాదనలు మండలంలో జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ వాటన్నింటిని పట్టించుకోకుండా గండ్ర దంపతులు అదే రెడ్డి సామాజిక వర్గానికి మళ్లీ అవకాశం కల్పిస్తారా..? సామాజిక న్యాయాన్ని పరిగణలోకి తీసుకుని బీసీ సామాజిక వర్గానికో లేదా ఎస్సీ సామాజిక వర్గానికో అవకాశం కల్పిస్తారా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.


Next Story

Most Viewed