హుజూరాబాద్‌లో మొదలైన ఆట.. పగలు TRS, రాత్రి BJP

by  |
huzurabad
X

దిశ, వెబ్ డెస్క్: హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ముగియగా మొత్తం 61 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ కాకుండా 15మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్లు నామినేషన్ వేశారు. నామినేషన్ల పరిశీలన రేపు జరగనుండగా, ఉపసంహరణకు గడువు ఈ నెల 13 వరకూ ఉంది. చివరకు బరిలో ఎంతమంది నిలిచినా ప్రధాన పోటీ మాత్రం మూడు ప్రధాన పార్టీల మధ్యనే ఉండనుంది. భూకబ్జా ఆరోపణలతో మే మొదటివారంలో రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల జూన్‌ 12న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. సెప్టెంబర్‌లోనే బెంగాల్‌లో మమత పోటీ చేసిన భవానీపూర్ స్థానంతోపాటు ఈ ఎన్నిక జరుగుతుందని భావించినా, నాటకీయ పరిణామాల మధ్య కరోనా సాకుతో ఎన్నికల కమిషన్ అప్పుడు హుజూరాబాద్‌ను చేర్చలేదు. అకస్మాత్తుగా గత నెల 28న షెడ్యూలు విడుదల చేసింది.

పలు కారణాల మూలంగా తెలంగాణ ప్రజల దృష్టి అంతా ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నిక పైననే ఉంది. టీఆర్ఎస్ ఏర్పడిన నాటి నుంచీ పార్టీలో, ఉద్యమంలో, అన్ని రకాల ఒడిదొడుకుల్లో కేసీఆర్‌కు కుడిభుజంగా వ్యవహరించిన ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేటీఆర్‌ను సీఎం చేయడాన్ని వ్యతిరేకించినందునే ఆయనను ఇలా బలిపశువును చేశారని, భూకబ్జా ఆరోపణలనేవి కేవలం సాకులేననే టాక్ నడిచింది. ఆయనపై సర్వత్రా సానుభూతి వ్యక్తమైంది. మరోవైపు, ఈటల కూడా బోలెడు అక్రమాస్తులు కూడబెట్టారని, భూములు కబ్జా చేశారని వాదించినవాళ్లూ లేకపోలేదు. స్వయంగా కేసీఆర్ కూడా ఈటల వ్యవహారంపై దృష్టి పెట్టారు. తన ఇమేజ్‌పై, ప్రభుత్వ పాలనపై, పార్టీ మనుగడపై మచ్చ పడకుండా అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే హుజూరాబాద్‌ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడ ఈటలను ఓడించి భారీ విజయాన్ని నమోదు చేయడం ద్వారా తాను తీసుకున్న చర్యకు జనామోదం ఉందని నిరూపించాలనుకుంటున్నారు. అంతేకాకుండా, హుజూరాబాద్‌లో గెలిచిన పక్షంలో మొత్తం తెలంగాణను గులాబీ మూడ్‌లోకి తీసుకువచ్చి కుదిరితే మధ్యంతరానికి లేదంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని తలపోస్తున్నారు.

ఈటలకు కూడా ఇది ప్రతిష్టాత్మకమే కాకుండా జీవన్మరణ సమస్యగా భావించాలి. 2004 నుంచి అప్రతిహతంగా హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఆయన గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు కనుక ఓడితే ఇక ఆయన రాజకీయ జీవితంలో అంధకారం అలుముకోవడం ఖాయం. ఆయనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలను జనం నమ్మినట్టు అవుతుంది. కమలదళంలో ఓ అనామకుడిలానే మిగిలిపోతారు. గెలిచిన పక్షంలో హీరో అవుతారు. కేసీఆర్‌ను ఎదిరించి నిలిచి గెలిచిన నేతగా చరిత్రకెక్కుతారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక క్యాంపునకు కేంద్ర బింధువుగా మారతారు. బీజేపీలో ఆయన స్థానం బలోపేతమవుతుంది. అదృష్టం కలిసివచ్చి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ మెజారిటీ సాధిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశమూ ఉంది.

హుజూరాబాద్‌లో ప్రస్తుతం తెలంగాణ చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా నిధుల, బలగాల సమీకరణ, కేంద్రీకరణ కొనసాగుతోంది. ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. నిజానికి, ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన రోజునే అక్కడ ఆట మొదలైంది. షామీర్‌పేట నివాసంలో మీడియాతో మాట్లాడిన తర్వాత నేరుగా హుజూరాబాద్‌ వెళ్లిన ఈటల యుద్ధ శంఖారావం పూరించారు. వేలాదిమంది తన అనుచరులతో, ముఖ్యులతో భేటీలు, ర్యాలీలు నిర్వహించారు. పక్కా ప్లాన్ రూపొందించారు. బీజేపీలో చేరిన తర్వాత ఆ పార్టీ నేతలతో, కార్యకర్తలతో సైతం సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత పాదయాత్ర సైతం కొనసాగించి మోకాలినొప్పి కారణంగా మధ్యలోనే ఆపేశారు. నియోజకవర్గంలోనే మకాం వేసి పల్లె పల్లె తిరుగుతున్నారు. ఓటర్ల అభిమానాన్ని చూరగొనడానికి సర్వవిధాలా ప్రయత్నిస్తున్నారు.

టీఆర్ఎస్ ప్రతివ్యూహాన్ని స్వయంగా సీఎం కేసీఆరే రచించారు. ఈటలను కేబినెట్ నుంచి తొలగించిన క్షణం నుంచే హుజూరాబాద్‌ గెలుపుపై కన్నేశారు. మొదట ఆ జిల్లా మంత్రి గంగుల కమలాకర్‌ను రంగంలో దింపగా, అది కాస్తా వికటించింది. దాంతో ట్రబుల్ షూటర్ హరీశ్‌రావుకు ఆ బాధ్యతను అప్పగించారు. అప్పటి నుంచి ఈటల వర్గం ముఖ్యులను తిరిగి టీఆర్ఎస్‌కు రప్పించడంలో నిమగ్నమయ్యారు. జూన్ 12న ఈటల రాజీనామా చేయగానే ముఖ్యమంత్రి కేసీఆర్ తన తురుపుముక్కగా దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. పైలట్ ప్రాజెక్టుగా అది హుజూరాబాద్‌లోనే మొదలవుతుందని, అక్కడి ఎస్సీ కుటుంబాలందరికీ రూ.10 లక్షల చొప్పున అకౌంట్లలో వేస్తామని ప్రకటించారు. ఇతరత్రా కూడా అక్కడ అభివృద్ధి, సంక్షేమ పథకాల వరద పారించారు. ఇప్పటిదాకా ఆయన వేయని ఎత్తు లేదు. చేయని ప్రయత్నమూ లేదు.

మరి పోలింగ్‌కు ఇంకా కేవలం 20 రోజులే మిగిలివున్న ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ ఎవరిది పైచేయిగా ఉంది? అంటే పగలు టీఆర్ఎస్.. రాత్రి బీజేపీ.. అన్న చందంగా ఉందంటున్నారు చాలామంది స్థానికులు. పగటి పూట పల్లెల్లో, పట్టణాల్లో గులాబీ ప్రచారదళాల హడివుడి మిన్నంటుతోంది. మంత్రి హరీశ్ సహా పలువురు మంత్రులు హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలపై ప్రధానంగా కేంద్రీకరిస్తూ అప్పుడప్పుడు పల్లె సభలకూ వెళుతున్నారు. ప్రతి మండలంలోనూ నలుగురైదుగురు ఎమ్మెల్యేలు తిష్ట వేసి తిరుగుతున్నారు. ఒక్కో ఎమ్మెల్యే ఐదారు గ్రామాలకు బాధ్యత తీసుకుని స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర చోటా నేతలు, మందీ మార్బలంతో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రతి రోజూ పండుగ వాతావరణమే ఉంటోందని, మూకుమ్మడి వంటలు.. సమిష్టి విందులు.. గుంపుగా మందుబాబుల సిట్టింగులు.. జోరుగా కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఒక్కో పల్లెలో నిత్యం లక్షల్లోనే ఖర్చు ఉంటోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక నిధులు, బిల్లులు, మంజూర్లు ఆగిపోతాయనే భయంతో దాదాపు అందరు సిట్టింగు వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అధికార పార్టీకే వంత పాడుతున్నారని అంటున్నారు.

మరోవైపు, ఈటల వర్గం చాలా సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్నది. పెద్దగా ఆర్భాటమేమీ లేకుండా వాళ్ల ప్రచారం కొనసాగుతున్నది. టీఆర్ఎస్ ఎత్తుగడలను గమనించడం, వాళ్ల ప్రచారసరళిపై నిఘా పెట్టడం ద్వారా రాజేందర్ ఎప్పటికప్పుడు తన అనుచరులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని, ఎక్కడ ఎవరి ఓట్లు ఎటువైపో బేరీజు వేసుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. ప్రధానంగా ఫోన్ కాల్స్ ద్వారానే స్థానిక కులసంఘాల నేతలతో, పలుకుబడి కలిగిన వ్యక్తులతో మాట్లాడుతున్నారని వినిపిస్తోంది. వారి మద్దతు పొందడం కోసం భారీ ప్యాకేజీలు ఎర వేస్తున్నారని సమాచారం. వందలాది సంఖ్యలో తన నమ్మకస్తులను ఈటల టీఆర్ఎస్‌లోకి పంపించారని, వాళ్లు కోవర్టులుగా ఉంటూ కీలక సమాచారం తమ నేతకు చేరవేస్తున్నారనే పుకారు కూడా నియోజకవర్గంలో షికారు చేస్తోంది. ఇప్పటి నుంచే డబ్బులు ఖర్చు పెడితే చివరకు చేతులెత్తేయాల్సి వస్తుందనే భావనతో ఉన్నందున వీరి ప్రచారం ఇంకా ఊపందుకోనట్టే కనిపిస్తున్నదని కూడా చెబుతున్నారు. అయితే, లోపల ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదంటున్నారు.

ఈటలను విజయం వరిస్తుందా? లేదంటే గెల్లు గెలుస్తారా? అని ఎంత మందిని ప్రశ్నించినా ఎవరూ స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. పోటీ చాలా టైట్‌గా ఉందని, ఎవరు గెలిచినా మెజారిటీ వందల్లోనే ఉంటుందని మాత్రం చెబుతున్నారు. పోలింగ్ రోజున కొంతమేరకు ట్రెండ్ బయటపడవచ్చునని, అంతిమ ఫలితం కోసం కౌంటింగ్ వరకు ఆగక తప్పదని అంటున్నారు. వీణవంక మండలం గంగారం గ్రామానికి చెందిన నా చిన్ననాటి మిత్రుడు చెప్పిన ఓ పిట్టకథ చెప్పి ముగిస్తాను.

‘‘వెనకటికి ఓ రాజుండేవాడు. ఆయనకు ఓ ముద్దుల కూతురుండేది. స్నానం చేస్తున్న సమయంలో ఓ రోజు ఆమె తల వెంట్రుక ఒకటి ఊడిపోయి బావిలో పడింది. ఆ వెంట్రుకకు ఎంత ధైర్యం? తననే వదిలేస్తుందా? అని ఆ రాజకుమారికి కోపం వచ్చింది. బావిలో పడిన తన వెంట్రుకను ఎలాగైనా వెలికి తీయించి శిక్షించాలని తండ్రికి ఆర్డరేసింది. రాజు కదా.. ఆ మాత్రం చేయకపోతే ఎలా? వెంటనే మంత్రులను, సేనానులను పిలిపించారు. మంతనాలు సాగించారు. వ్యూహాలు రచించారు. మొత్తం సైన్యాన్ని, సిబ్బందిని, ఇతర మందీ మార్బలాన్ని రంగంలోకి దింపారు. బంగారు జల్లెడలను, బొక్కెనలను తెప్పించారు. వెండి నిచ్చెనలను తయారుచేయించారు. ఆ బావిలోని నీళ్లన్నీ తోడి వడపోశారు. సర్కారు ఖజానాతోపాటు రాజు గారు దాచుకున్న భోషాణంలోని సంపదనంతా ఖర్చు చేశారు.’’

ఇంతవరకూ చెప్పి కథ ఆపేశాడు. ఎంత అడిగినా చివరకు ఆ వెంట్రుక దొరికిందో లేదో మాత్రం చెప్పలేదు. నాకు విషయం అర్థమైంది. మీకో..?
– డి మార్కండేయ

Next Story

Most Viewed