టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఆస్తుల వివరాలు.. ఎంతంటే..!

by  |
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఆస్తుల వివరాలు.. ఎంతంటే..!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా రిటర్నింగ్ అధికారికి తన స్థిర, చరాస్తుల వివరాలు లిఖితపూర్వకంగా అఫిడవిట్ ద్వారా అందజేశారు. మొత్తం రూ. 46,76,893.44 విలువ చేసే స్థిర, చరాస్తులు తన, తన భార్య పేరిట ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన వద్ద రూ.10 వేల నగదు ఉండగా, హుజురాబాద్‌లోని కోటాక్ బ్యాంక్‌లో రూ.50 వేలు, హైదరాబాద్‌లోని అబిడ్స్ కెనరా బ్యాంక్‌లో రూ.1,73,586.04, యూనియన్ బ్యాంక్ నారాయణగూడ బ్రాంచ్‌లో రూ.153, అదే బ్యాంకులో మరో ఖాతాలో రూ.48,663.40 డిపాజిట్లుగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

అలాగే, వీణవంక మండల కేంద్రంలో 10.25 గుంటల విస్తీర్ణంలో నివాస గృహం నిర్మించగా, ప్రస్తుతం దాని విలువ రూ. 20 లక్షలు ఉన్నట్టుగా అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. తన భార్య శ్వేత పేరిట రూ.23,94,491 విలువ చేసే ఆస్తులుండగా, రూ. 5 వేల నగదుతో పాటు రూ.11,94,491 చరాస్తులు, రూ.12 లక్షల విలువ చేసే స్థిరాస్తి ఉన్నట్టు వెల్లడించారు. హుజురాబాద్‌లో 12 గుంటల భూమి ఉండగా దీని విలువ రూ.12 లక్షలుగా ఉంది. రూ.11,87,500 విలువ చేసే 25 తులాల బంగారు ఆభరణాలు, యూనియన్ బ్యాంకులో రూ.1838, అదే బ్యాంకులో మరో ఖాతాలో రూ.153 డిపాజిట్లు ఉన్నట్టు తెలిపారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4,60,540 చొప్పున భార్యాభర్తలు ఇద్దరు వేర్వేరుగా ఆదాయ పన్ను చెల్లించినట్టు, ఇద్దరు తుక్కు వ్యాపారం ద్వారా పైన పేర్కొన్న ఆదాయం ఆర్జించినట్టు అఫిడవిట్‌లో వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో నమోదైన కేసుల్లో చాలా వరకు కొట్టివేయగా, మూడు కేసులు మాత్రం వివిధ కోర్టుల్లో పెండింగులో ఉన్నట్టు, వాటిలో 2012 మార్చి 1న నిర్వహించిన రైల్ రోకో సందర్భంగా నమోదైన కేసు, 2013 మార్చ్ 7 న మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు నాగర్ కర్నూల్ కోర్టులో, 2020 డిసెంబర్ 8న షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదు అయిన కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Next Story