అక్రమార్కులకు సిరుల పంట

by  |
అక్రమార్కులకు సిరుల పంట
X

దిశ, తుంగతుర్తి: సూర్యాపేట జిల్లాలోనే నాగారం, జాజిరెడ్డిగూడెం, తిరుమలగిరి మండలాలు అక్రమ ఇసుక దందాకు అడ్డాగా మారాయి. మూసీ పరివాహక ప్రాంతం అయిన బిక్కెరు వాగు నుంచి అనుమతుల పేరిట దళారులు ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బిక్కెరు వాగు ఇసుకకు మంచి డిమాండ్ ఉండడంతో రాత్రికి రాత్రే ఇసుక ట్రాక్టర్లు తరలిస్తూ ప్రతి ట్రాక్టర్ పై రూ.3000 నుంచి 4500 వరకు అమ్ముతూ జేబులు నింపుకుంటున్నారు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు మూసీ వాగు ప్రవహిస్తున్నప్పటికీ వాగులోని ఇసుకను తోడేసి సమీప గ్రామాలలో డంపులను ఏర్పాటు చేసి జిల్లా నలుమూలలకు తరలిస్తున్నారు. ఈ విషయం తెలిసిన అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

అధికారుల అండతో..

ఇసుక అక్రమార్కులకు కొందరు పోలీసు అధికారులు, మండల రెవెన్యూ అధికారులు, జిల్లా స్థాయి అధికారులతోపాటు చోటామోటా రాజకీ య నాయకుల అండదండలతో ఇసుక అక్రమ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. ఇదే విషయమై సామాన్య ప్రజలు పలుమార్లు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు పొందకుండా పోలీస్ రెవెన్యూ కార్యాలయం ముందే ఇసుకను ఇండ్ల నిర్మాణాల కు తరలిస్తున్న, తమ దృష్టికి రా లేదని అధికారులు చెప్పడం విడ్డూరంగా మారింది.

రైతు వేదిక, వైకుంఠధామం నిర్మాణాల పేరిట కొందరు అనుమతి పత్రాలు పొంది, ఇసుకను నేరుగా ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్న ఉదాహరణలు కోకొల్లలు. అదేవిధంగా నాగారం మండలం పేరబోయిన గూడెం గ్రామం బిక్కెరు వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను నాగారం పోలీసు బృందం పట్టుకోగా ఓ ఉన్నత అధికారి వారిని వదిలేయమని చెప్పడం అనుమానాలకు మరింత దారి తీస్తుంది. అదేవిధంగా నాగారం మండల పరిధిలోని పేర బోయినగూడెం వాగు నుంచి ఇసుకను తరలించడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేనప్పటికీ శనివారం నాగారం జాజిరెడ్డిగూడెం మండలానికి చెందిన పలువురు 23 ట్రాక్టర్లో ఇసుకను తరలిస్తుండగా నాగారం పోలీసులు వారిని పట్టుకోగా, వారిలో ముగ్గురు ట్రాక్టర్లను, రాజకీయ నాయకుల జోక్యంతో వదిలేసినట్లు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఇటీవల నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊటుకూరు గ్రామంలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌తో మైనర్ పిల్లల సహాయంతో ఎలాంటి అనుమతులు పొందకుండా కొందరు ప్రజాప్రతినిధులు రైతు వేదిక డంపింగ్ యార్డ్ నిర్మాణాలకు తరలించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఇప్పటికైనా జిల్లాస్థాయి అధికారులు స్పందించి అక్ర మ ఇసుక రవాణా జరగకుండా చూసి ప్రభుత్వం అ సంపదను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story