మంచం పట్టిన ‘మన్యం’.. వణుకు పుట్టిస్తున్న విషజ్వరాలు

by  |
manyam
X

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ ఏజెన్సీ గ్రామాల్లోని ఆదివాసీలు మంచం పట్టారు. ప్రతీ కుటుంబంలోని ముగ్గురు, నలుగురు విషజ్వరాల బారిన పడినట్టు సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి మోర అన్నారు. శుక్రవారం ఆదివాసీ గ్రామాల్లో విషజ్వరాలు, సీజనల్ వ్యాధుల పట్ల న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అశ్వాపురం మండలంలోని గొందిగూడెం, కొత్తూరు, గుండ్ల మడుగు, ఎలకలగూడెం, వేములూరు తదితర గ్రామాలను పరిశీలించి, గిరిజన ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీలు కుటుంబానికి ముగ్గురు, నలుగురు విషజ్వరాలతో మంచం పట్టినా ప్రభుత్వానికి, వైద్య అధికారులకు కొంచెం కూడా చలనం లేదని మండిపడ్డారు.

ప్రభుత్వం, వైద్యాధికారులు ఆదివాసీల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. ఆరోగ్య సమస్యలపై జిల్లా వైద్యాధికారులు అక్కడక్కడా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి తూతూమంత్రంగా పరీక్షలు నిర్వహించి ప్రచారానికి మాత్రమే పరిమితమౌతున్నారన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం ఎక్కడా జరగడం లేదని, ప్రభుత్వ వైద్యశాఖ నుండి అత్యవసర వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంలేదని మండిపడ్డారు. పారిశుద్ధ్య పనులు ఆయా గ్రామ పంచాయతీలు నిర్వహిస్తున్నా.. ప్రభుత్వం నుండి ఏజెన్సీ గ్రామాల్లో ఎలాంటి వైద్య సౌకర్యాలు అందడం లేదన్నారు. ప్రతీ ఏడాది కంటే ఈ ఏడాది ఏజెన్సీ గ్రామాల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు.

ఆదివాసులకు ప్రైవేటు వైద్యం భారంగా మారిందని, ప్రభుత్వ వైద్యం అందక ఆదివాసీల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వైద్య బృందాలను ఏజెన్సీ గ్రామాలకు పంపించి అత్యవసర వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆదివాసీ గిరిజనులకు అన్నిరకాల పరీక్షలు నిర్వహించి, తగిన మందులు ఉచితంగా అందించాలన్నారు. ఆదివాసీ ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం మండల అధ్యక్షులు బండ్ల వెంకటేశ్వర్లు, గంగయ్య, పద్మ దినేష్, భీమయ్య, శీను, జగ్గు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed