భార్యాభర్తల ఆత్మహత్య.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

by  |
భార్యాభర్తల ఆత్మహత్య.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
X

దిశ, వెబ్‌డెస్క్: వారిద్దరు ఇష్టపూర్వకంగా పెండ్లి చేసుకున్నారు. మధ్యతరగతి కుటుంబం అయినా ఉన్నంతలో సంతోషంగా ఉన్నారు. ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉంటూ కాలం వెల్లదీశారు. కానీ, కాలం కరుణించలేదు. ఏండ్లు గడిచినా సంతానం కలుగలేదు. ఇదే బాధ 20 ఏండ్లకు పైగా వేటాడింది. దీంతో భార్యభర్తలిద్దరికీ ఆరోగ్యం దెబ్బతింది. ఈ వయసులో వారి బాగోగులు చూడటానికి కన్న బిడ్డలు కూడా లేరే అన్న బాధ మరింత కృంగదీసింది. దీనికి తోడు వయసు పైబడే కొద్ది శరీరం కూడా పనికి సహకరించడం మందగించింది. దీంతో ఆరోగ్యాన్ని చూసుకునే స్థోమత లేని పరిస్థితిలో భార్యభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది.

పూర్తి వివరాళ్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన రాములు (50), గౌరి (50) భార్యభర్తలు. రెండు దశాబ్దాల క్రితమే క్రితమే వివాహం చేసుకున్న వీరు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ కొచ్చారు. ఈ నేపథ్యంలోనే గోల్నాకలో నివాసం ఉంటూ.. సమీప మార్కెట్‌లో పూల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా, పెండ్లి అయినా తర్వాత పిల్లలు కలుగడం లేదని ఆస్పత్రులు, గుడిల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది.

ఈ పరిణామాలతో భార్యభర్తలిద్దరూ ఒకరి కోసం మరొకరు జీవించసాగారు. ఓ వైపు పిల్లలు లేరన్న బాధ వారిని వయసు పెరిగే కొద్ది వేటాడ సాగింది. సరిగ్గా ఇదే సమయంలో ఇద్దరికీ ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఒకరి ఒకరు సేవ చేసుకోవడమే తప్ప మరో సొంత వ్యక్తి కరువయ్యాడు. దీంతో ఇద్దరూ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఇక అనారోగ్య సమస్యలతో నిత్యం బాధపడటం కంటే.. ఒకేసారి చావడం మేలనుకున్నారేమో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం వెలుగుచూసింది. ఉదయం నుంచి ఇంట్లో నుంచి దంపతులిద్దరూ బయటకు రావడం లేదని స్థానికులు వెళ్లి చూడగా.. ఫ్యాన్‌కు వెలాడుతూ కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం బంధువులకు సమాచారం ఇచ్చారు.

Next Story

Most Viewed