‘దళిత బంధు’ కు షాకిచ్చేలా TPCC కీలక నిర్ణయం..

by  |
Tpcc-key-decision
X

దిశప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగితే బావుంటుంది? ఇతర పార్టీలకు ధీటుగా నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందన్న విషయంపై టీపీసీసీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. అయితే, అధికార టీఆర్ఎస్ పార్టీ ఎత్తుకున్న నినాదానికి చెక్ పెట్టేలా అభ్యర్థి ఎంపిక సాగితే ఎలా ఉంటుంది అన్న విషయంపై ఈ సమావేశంలో డిస్కషన్ సాగినట్టు సమాచారం. దళితులను ఆకట్టుకునేందుకు దళిత బంధు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టినందున ఏకంగా దళితున్నే అభ్యర్థిగా ప్రకటిస్తే ఎలా ఉంటుందని ఈ సమావేశంలో చర్చించారు. ఒక వేళ దళిత సామాజిక వర్గానికి చెందిన వారినే బరిలో నిలిపితే కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, వరంగల్ రూరల్ జిల్లా పరకాల ప్రాంత కాంగ్రెస్ నాయకుడు దొమ్మాటి సాంబయ్య పేరును పరిశీలించినట్టుగా తెలుస్తోంది. దళిత నినాదంతో వీరిద్దరిలో ఎవరో ఒకరిని బరిలో నిలిపితే కాంగ్రెస్ పార్టీకి మరింత సానుకూలత ఉంటుందన్న అభిప్రాయానికి నాయకులు వచ్చినట్టు సమాచారం. అయితే, తుది నిర్ణయం మాత్రం హుజురాబాద్ ఇంఛార్జీ దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లదేనని సమావేశం నిర్ణయించింది.

పది రోజుల పాటు ప్రత్యేక ప్రచారం..

ఈనెల 11 నుంచి 21 వరకు పదిరోజుల పాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని సమావేశం సారాంశం. పదిరోజుల్లో 5 మండలాలు, 2 మునిసిపాలిటీల్లో 2 నుంచి 3 వేల మందితో ర్యాలీలు, ఏడు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాల్లో మండలంలోని ఓటర్లలో పదిశాతం మంది హాజరయ్యేలా ప్రణాళిక తయారు చేయాలని పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి సూచించారు. కాంగ్రెస్ శ్రేణులను, అనుబంధ సంఘాల నాయకులను క్షేత్ర స్థాయిలో పని చేయించాలని కోరారు.

Next Story

Most Viewed