నక్సలైట్లు ఉంటే బావుండేది.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by  |
Revanth Reddy
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ‘దేవుడా.. ఎందుకురా నక్సలైట్లు లేకుండా చేశావు. వాళ్లు ఉంటే అయినా పాలకులు భయపడే వాళ్లు.’ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్‌లో రేవంత్ మీడియాతో మాట్లాడుతూ… ఆ పరిస్థితి రావాలని కోరుకోవడం లేదు కానీ, ఇక్కడ నెలకొన్న పరిస్థితులు అలాంటి ఆలోచనలు కల్పిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో పోలీసు శాఖలో అధికారులు రెండు వర్గాలుగా చీలిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. డీజీపీ టెలిఫోన్ కూడా ట్యాపింగ్ అవుతోందని ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంత్రుల ఫోన్‌లు ట్యాపింగ్ అవుతున్నాయని కేంద్రానికి ఫిర్యాదు చేశారన్నారు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్, కోవర్ట్ ఆపరేషన్ చేసే ఇద్దరు పోలీసు అధికారులు నాపై, నా కుటుంబంపై నిఘా పెట్టారన్నారు. మరో అధికారి డీజీపీపై నిఘా పెట్టారని ఆరోపించారు. డీజీపీ సామాజిక వర్గాన్ని అనుమానించి తక్కువ హోదాలో ఉన్న అధికారితో నిఘా పెట్టారని దుయ్యబట్టారు. రిటైర్ అయిన వాళ్ళకు మళ్లీ పోస్టింగ్‌లు ఇచ్చి ప్రత్యేక నిఘా కోసం దళాలను ఏర్పాటు చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ బంధువును ఆంధ్రా నుంచి డిప్యూటేషన్ మీద హైదారాబాద్ తీసుకొచ్చి పోస్టింగ్ ఇచ్చారన్నారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంతర్జాతీయ తీవ్రవాదా?

ఆయనను, ఆయన చుట్టుపక్కల వారిని ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో ఇంతటి నిర్బంధం చూడలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామో అర్థం కాకుండా పోయిందన్నారు. 1200 మంది ఆత్మబలిదానం కేసీఆర్ కుటుంబం కోసమా? తెలంగాణ ప్రజల కోసమో అంతుచిక్కకుండా పోయిందన్నారు. హుజురాబాద్ తాత్కాలికమే అని, భవిష్యత్‌లో టీఆర్ఎస్‌ను అంతం చేసి తీరుతామని స్పష్టం చేశారు. మూడు రోజుల నుంచి కేసీఆర్ ఏమైనా పని చేస్తున్నారా? లేదా అని అడిగారు. కేసీఆర్ కుటుంబానికి కూడా పతనం ప్రారంభం అయ్యిందని తెలిసిపోయిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే వ్యాపార సంస్థలో వాటాల సమస్య వచ్చిందని, తనకు వాటా తక్కువ అయ్యిందని ఈటల ఎండీ కేసీఆర్‌ను ప్రశ్నించారన్నారు. దీంతో పార్టీలో ఆధిపత్య పోరు మొదలైందన్నారు. ఎండీ కేసీఆర్‌కు డైరెక్టర్ లాంటి ఈటలకు మధ్య గొడవలో తనకు సమాన వాటా కావాలన్న విషయంలో గొడవ జరిగిందని వ్యాఖ్యానించారు. దీంతో కంపెనీ నుంచి ఈటలను బయటకు పంపారని విమర్శించారు. కేసీఆర్‌ది గజ్వేల్ కాదని, హరీష్ రావు సిద్దిపేట కాదని, కేటీఆర్‌ది సిరిసిల్ల కాదని, అలాంటప్పుడు హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధి నాన్ లోకల్ ఎలా అవుతాడని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ నిజాం ప్రభువు అయితే హరీష్ రావ్ ఖాసీం రజ్వీలా తయారయ్యాడని ఆరోపించారు. అన్ని వర్గాల వారిని బెదిరిస్తున్నారన్నారు.

ఐదు నెలల కాలంలో ఏం చేశారో చెప్పాలి

మేనరికపు సంబంధం ఇద్దామనుకుంటే పిల్లగాడు పరాయి పిల్లను చేసుకోవడంతో తల్లి మరో సంబంధం వెతికినట్టు కాంగ్రెస్ పార్టీ కూడా మరో అభ్యర్థిని వెతుక్కోవడం వల్ల ఆలస్యం అయిందన్నారు. మేన పిల్లగాని లెక్క ఉన్నాడనుకున్న కసబ్ రెడ్డి కోవర్టు చేసి పోవడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. రాబోయే 40 ఏళ్లు వెంకట్ కాంగ్రెస్ కోసం కష్టపడతారన్నారు. మరో వైపు కేంద్ర ప్రభుత్వంపై కూడా రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. జీడీపీ పెంచడమంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతారని అనుకోలేదన్నారు. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని డిమాండ్ చేశారు. నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను బానిసలుగా మార్చిందని నిప్పులు చెరిగారు. రూ.400 సిలిండర్ 1000కి పైగా పెంచిన బీజేపీకి ఓటు వేయాలా? అని అడిగారు. స్వీయ రక్షణ కోసం బీజేపీలో చేరిన ఈటలను ఎందుకు గెలిపించాలన్నారు. బండి సంజయ్‌కి బీజేపీలో విలువ లేదు, ఫ్లెక్సీలలో మురళీధర్ రావు ఫోటో పెద్దగా ఉంటే బండి సంజయ్ ఫోటో రెవెన్యూ స్టాంప్ సైజులో ఉంటుందన్నారు.


Next Story

Most Viewed