ఫ్లాష్.. ఫ్లాష్.. బారికేడ్లు దూకిన రేవంత్.. పోలీసుల లాఠీచార్జ్..

by  |
chalo raj bhavan
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హ్యాకింగ్ చేయిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. పోలీసులు, అధికారులు కేసీఆర్ ప్రభుత్వానికి తొత్తులుగా మారారని, వచ్చేది కాంగ్రెస్​ ప్రభుత్వమేనని, తొత్తులుగా మారిన అధికారులు మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇంటలీజెన్సీ ఐజీ ప్రభాకర్‌రావు ఖాసిం రిజ్వీ మాదిరిగా వ్యవహరిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్‌రావుకు పోస్టింగ్ ఇచ్చారని, ఐజీ ప్రభాకర్‌రావుపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తానన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించే వరకూ కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. ప్రధాని మోదీ సూచనతోనే కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ ఆందోళనను అడ్డుకుంటోందని రేవంత్ పేర్కొన్నారు.

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఛలో రాజ్​భవన్​ ఉద్రిక్తతకు దారి తీసింది. ఉదయం నుంచే కాంగ్రెస్​ నేతలను పోలీసులు అరెస్ట్​ చేశారు. అయినా పోలీసులు నిరసన వేదిక ఇందిరా పార్కుకు చేరుకున్నారు. అనంతరం కొంత దూరం టీపీసీసీ చీఫ్​ ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలోనే కొంతమంది కాంగ్రెస్​ శ్రేణులు పోలీసులను దాటుకుని వెళ్లి రాజ్​భవన్​ గేట్లపై కాంగ్రెస్​ జెండాలను ఎగురవేశారు. అనంతరం టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి రావడంతో కాంగ్రెస్​ శ్రేణులు రాజ్​భవన్ ​వైపు దూసుకుపోయారు. ఈ సమయంలోనే రేవంత్​రెడ్డి బారికేడ్లను దూకి రాజ్​భవన్​ వైపు పరుగు పెట్టారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం బారికేడ్లను కాంగ్రెస్ కార్యకర్తలు తోసివేయగా పోలీసులకు వారికి మధ్య తోపులాట జరిగింది.

పోలీసులు లాఠీచార్జ్​ చేయడంతో టీపీసీసీ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. ఆమెను కేర్​ హాస్పిటల్​కు తరలించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వైపు కార్యకర్తలు భారీ ర్యాలీగా వెళ్తుండగా దానిని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. శాంతియుతంగా చేపడుతున్న ర్యాలీని అడ్డుకుని పోలీసులు ఇబ్బంది పడొద్దని, కాంగ్రెస్​ కార్యకర్తలను ఇబ్బంది పెట్టొద్దంటూ టీపీసీసీ చీఫ్ సూచించారు. ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా… రేవంత్‌తో పాటు అంజన్ కుమార్ యాదవ్, పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కీలను పోలీసులు అరెస్టు చేసి అంబర్​పేట్ పీఎస్‌కు తరలించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ మీద తమకు నమ్మకం లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తామన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలను దోచుకుంటున్నారని, హ్యాకర్లతో తమ ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. వచ్చేది సోనియా రాజ్యం, కాంగ్రెస్ కార్యకర్తల రాజ్యం అని రేవంత్ పేర్కొన్నారు. ఈ అక్రమ అరెస్ట్​లను ఖండిస్తూ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో మోడీ, కేసీఆర్​ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​ మధుయాష్కి మాట్లాడుతూ పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని, శాంతియుత నిరసనను అడ్డుకున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్​ మహిళలను గౌరవించరని, చదువుకున్న వారంతా హమాలి పని చేయాలని ఓ మంత్రి అంటున్నారని, పురపాలక మంత్రి ట్విట్టర్లకే పరిమితమవుతున్నారని విమర్శించారు. దోపిడిని అరికట్టేందుకు తెలంగాణవాదులు కాంగ్రెస్​తో కలిసిరావాలని మధుయాష్కి కోరారు.

Next Story

Most Viewed