కేసీఆర్‌వి సెల్ఫ్ డబ్బాలు… కేటీఆర్‌వి సెల్ఫీలు.. ఫ్యాషన్ పరేడ్‌లు

by  |
Revanth KTR
X

దిశ, సిటీబ్యూరో : కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్ర మున్సిపల్ మంత్రి కావటం మన దురదృష్టమని పీసీసీ చీఫ్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో జరిగిన కౌన్సిల్ వర్చువల్ మీటింగ్‌కు ఆయన ఎక్స్ అఫిషియో సభ్యుడిగా హాజరై మాట్లాడారు.

కేసీఆర్ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకునేందుకు, కేటీఆర్ సెల్ఫీలు దిగటానికే పరిమితమయ్యారని విమర్శించారు. టీవీలో వచ్చే ఫ్యాషన్ పరెడ్ ల మాదిరిగానే కేటీఆర్ వాక్ ఉంటుందన్నారు. ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పి శ్రీ భాగ్యలక్ష్మి అమ్మావారిపై ఒట్టు వేసిన పగటి వేషగాళ్లు ఎక్కడ అని బీజేపీ నేతలను విమర్శించారు. 47 మంది గెలిచిన బీజేపీ సమస్యలపై యుద్ధం చేయవచ్చు గానీ ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. సర్కారు బల్దియాకు అదనంగా నిధులిచ్చే మాట దేవుడెరుగు కానీ, జీహెచ్ఎంసీకి చెల్లించాల్సిన ట్యాక్సులు కూడా సక్రమంగా కట్టడం లేదని ఆయన మండిపడ్డారు.

జీహెచ్ఎంసీకి అత్యంత పన్ను ఎగవేతదారులు ఎవరైనా ఉన్నారంటే అది రాష్ట్ర ప్రభుత్వమేనని అన్నారు. ఫలితంగానే జీహెచ్ఎంసీ అప్పుల పాలైందన్నారు. పేదల నుంచి ముక్కు పిండి మరీ పన్నులు వసూలు చేసే అధికారులు సీఎం దగ్గర నుంచి ఎందుకు వసూలు చేయరు, ప్రగతి భవన్ కు కరెంట్ కట్ చేయాలన్నారు. ప్రభుత్వం వందల కోట్ల ఎగవేతతో పెద్ద డిఫాల్టర్ గా మారిందని, దీనిపై సభ్యులు ప్రశ్నిస్తారనే భయంతోనే వర్చ్యువల్ మీటింగ్ నిర్వహించాలని రేవంత్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. డిపాల్టర్లుకు వర్తించే చట్టాన్ని అధికారులు సర్కారుపై ఎందుకు ప్రయోగించటం లేదని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావల్సిన రూ. 2వేల 600 కోట్లను రాబట్టాలని తాను మేయర్ కు సూచిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. నాగార్జున సర్కిల్ లో ఒక కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణం కోసం అక్కడ ఉన్న మర్రి చెన్నారెడ్డి విగ్రహాన్ని పక్కకు జరిపి, ఆ బిల్డింగ్ కు అదనపు ఫ్లోర్ల నిర్మాణ అనుమతి ఇచ్చారని ఆరోపించారు. నాలాలో చెత్త తీయకపోతే లోకల్ ఎమ్మెల్యే కాంట్రాక్టర్ పై చెత్త వేసి నిరసన తెలిపిన విధంగా మేం కూడా కేటీఆర్ కు అలాంటి సన్మానం చేయాలనుకుంటున్నామని అన్నారు. మూసీలోకి కేటీఆర్ ను దింపి నడుము లోతు వరకు నాలుగు గంటల పాటు పెడితే అప్పుడు పేద ప్రజల సమస్య, మూసీలోని బురద మురికి కంపు అర్థమవుతోందని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ కేటీఆర్ వల్లే అప్పుల పాలైందని విమర్శించారు.

నగర శివార్లలో కబ్జాలకు గురవుతున్న భూములన్నీ కేటీఆర్ ముఠా పనేనని ఆరోపించారు . కేటీఆర్ తనకు కావలసిన మున్సిపల్ కార్యదర్శి అరవింద్ కుమార్ లాంటి అధికారులకు ఉన్నత పదవులు కట్టబెట్టి, వారిని తమ చేతుల్లో పెట్టకుని కేటీఆర్ తన ఆగడాలను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కబ్జా అవుతున్న భూముల్లో వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, కబ్జాకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇప్పటి వరకు కబ్జాకు గురైన కొన్ని భూముల్లో సీసీ కెమెరాలున్నా, వాటిని తొలగించి మరీ కబ్జా చేశారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ రాష్ట్రానికి గుండెకాయ లాంటిదని, అది బాగుంటే మొత్తం రాష్ట్రం బాగుంటుందని అన్నారు. మున్సిపల్ మంత్రి అలసత్వం కారణంగా జీహెచ్ఎంసీలో పరిపాలన అస్తవ్యస్తమై నగరంలో అనేక సమస్యలు పేరుకుపోయాయని అన్నారు. గత సంవత్సరం నగరంలో వరదలు సంభవించి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినప్పుడు ఇలాంటి విపత్తు మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని చెప్పిన మంత్రి గడిచిన ఏడేళ్లలో ఏ ఒక్క వ్యవస్థను పునరుద్దరించలేక పోయారని విమర్శించారు. సుమారు రూ. 900 కోట్లతో నాలాల విస్తరణ, అభివృద్ది పనులు చేపడుతున్నామని చెబుతున్నా, వర్షాకాలానికి ముందే పూర్తి కావల్సిన పూడికతీత పనులు ఇంకా పూర్తి కాలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.

మంత్రి అవగాహనా రాహిత్యం వల్లే జీహెచ్ఎంసీ కోట్ల నిధులు ఖర్చు పెడుతున్నా ఏ ఒక్క పని ముందుకు సాగటం లేదన్నారు. నాలాల విస్తరణ,అభివృద్ధికి సంబంధించి రూ.900 కోట్ల నిధులకు పరిపాలనపరమైన మంజూరీ కూడా ఇచ్చినట్లు మంత్రి, అధికారులు చెబుతున్నా, మరెందుకు పనులు జరగటం లేదని ప్రశ్నించారు. గత ఏడాది నగరాన్ని వరదలు ముంచెత్తినపుడు తెరపైకి వచ్చిన నాలాల విస్తరణ, అభివృద్ది ప్రతిపాదనకు సంబంధించి నేటికీ కనీసం డీపీఆర్ కూడా సిద్ధం చేయకపోవటం మంత్రి నిర్లక్ష్యం, అలసత్వానికి ఓ నిదర్శనమని పీసీసీ చీఫ్ రేవంత్ పేర్కొన్నారు. సమావేశానికి ముందు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా నియమితులైనందున మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆయనకు పుష్పగుచ్ఛమిచ్చి అభినందనలు తెలిపారు.

Next Story

Most Viewed