ఈ సీజన్ హీరోలు వీరే..

by  |
ఈ సీజన్ హీరోలు వీరే..
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 13వ సీజన్ లీగ్ దశ పూర్తి చేసుకొని ప్లేఆఫ్స్ దశకు చేరుకుంటున్నది. సాధారణంగా క్రికెట్ అంటే బ్యాట్స్‌మెన్ ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుంది. అలాంటిది టీ20 వంటి ధనాధన్ ఫార్మాట్లో అత్యధిక శాతం బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చూపిస్తుంటారు. ఐపీఎల్ కూడా దీనికి అతీతమేమీ కాదు. ఈ సారి ఐపీఎల్‌లో ఎంతో మంది బ్యాట్స్‌మెన్ మెరుపులు మెరిపించారు. పొట్టి క్రికెట్‌లో కూడా సెంచరీలు, అర్థ సెంచరీలు చేస్తూ జట్టు స్కోర్ బోర్డును పెంచారు. మెరుపులా సిక్సులు, బౌండరీలు బాది పరుగులు రాబట్టారు. అలా ఈ సీజన్‌లో తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన టాప్ 5 బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా. మంగళవారం నాటికి ఈ ఐదుగురు పరుగుల లిస్టులో టాప్ 5 స్థానంలో ఉన్నారు.

కేఎల్ రాహుల్ (595 పరుగులు)

ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ 595 పరుగులతో లిస్టులో అగ్రస్థానంలో ఉన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై అతడు అజేయంగా 132 పరుగులు చేశాడు. దీంతో పాటు అతడి ఖాతాలో మరో 5 అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ సీజన్‌లో అతడు 59 సగటుతో 595 పరుగులు చేశాడు. జట్టు విజయాల్లో ఇతడి పరుగులు కీలకపాత్ర పోషించాయి.

శిఖర్ ధావన్ (471 పరుగులు)

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనర్ అయిన శిఖర్ ధావన్ ఈ సారి సీజన్ ప్రారంభంలో ఫామ్ లేమితో కనపడ్డాడు. పరుగులు రాబట్టడానికి తీవ్రంగా శ్రమించాడు. చివరగా ధావన్ తనదైన శైలిలో ఫామ్‌లోకి వచ్చాడు. వరుసగా రెండు సెంచరీలు బాది ఐపీఎల్‌లో రికార్డు సృష్టించాడు. 152 స్ట్రైక్ రేటుతో 52 పరుగుల సగటుతో అతడు ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చాడు. రెండు సెంచరీలతో పాటు రెండు అర్థ సెంచరీలు చేశాడు.

డేవిడ్ వార్నర్ (436 పరుగులు)

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ సీజన్‌లో అత్యంత నిలకడైన ప్రదర్శన చేశాడు. 12 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ మూడు అర్థ సెంచరీలు చేశాడు. మధ్యలో రెండు మ్యాచ్‌లలో విఫలమైనా.. సీజన్ ఆసాంతం పరుగులు సాధిస్తూనే ఉన్నాడు. ఢిల్లీపై అతడు 34 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఇంత వరకు సెంచరీ చేయకపోయినా.. ఆరెంజ్ క్యాప్ రేసులో మాత్రం నిలిచాడు.

విరాట్ కోహ్లీ (415 పరుగులు)

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో మంచి టచ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడి 59 పరుగులు సగటుతో ఈ సారి 415 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు. 2016 తర్వాత కోహ్లీ ఆరెంజ్ క్యాప్ రేసులో ఉండటం ఇదే. అతడి నుంచి మరిన్ని భారీ ఇన్నింగ్స్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఫాఫ్ డు ప్లెసిస్ (401 పరుగులు)

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సారి పేలవ ప్రదర్శన చేసింది. కానీ ఆ జట్టు ఓపెనర్ డు ప్లెసిస్ మాత్రం విశేషంగా రాణించాడు. 12 మ్యాచులు ఆడిన డు ప్లెసిస్ 401 పరుగులు చేసి టాప్ 5 లిస్టులో ఐదో స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు 4 అర్థ సెంచరీలు చేసిన అతడికి ఈ సీజన్‌లో 87 పరుగులు టాప్ స్కోర్‌గా నిలిచింది.



Next Story