ఈరోజు మనకు స్పెషల్.. ఎందుకో తెలుసా..?

by  |
ఈరోజు మనకు స్పెషల్.. ఎందుకో తెలుసా..?
X

దిశ, డోర్నకల్: అన్యాయంపై అక్షర శస్త్రాలను ఎక్కుపెట్టిన విలుకాడు. నిజాం దోపిడీ పాలనపై అలుపెరగని పోరుసల్పిన ఉద్యమకారుడు. నిజాం భూస్వామ్య పాలనపై తన కవితలతో అగ్నిధార కురిపించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనుడు. నిజాం నిరంకుశ పాలనపై ధిక్కార స్వరం వినిపించి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అక్షరాన్ని ఆయుధంగా మలిచిన కవి దాశరథి 96వ జయంతి వేడుకలకు బుధవారం ఆయన స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లాలోని చిన్న గూడూరు మండలంలోని దాశరథి ప్రాంగణం వేదిక కానుంది. అందుకు గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

కృష్ణమాచార్యుల ప్రస్థానం..

ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రానికి చెందిన వెంకటాచార్యులు, వెంకటమ్మ దంపతులకు 1925 జూలై 22న దాశరథి జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం చిన్న గూడూరులోనే కొనసాగింది. ఇక్కడ చోటు చేసుకున్న కొన్ని పరిణామాల వల్ల దాశరథి కుటుంబం ఖమ్మం జిల్లా గార్లకు మకాం మార్చింది. 1932లో అక్కడ హైస్కూల్లో విద్యనభ్యసించి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి విప్లవ ఉద్యమ భావజాలం కలిగి రచనలపై ఆయన మక్కువ పెంచుకున్నాడు. మహాకవి దాశరథి కలం ద్వారా అనేక కవిత, రచనలు జాలువారినవి. రుద్రవీణ అగ్నిధార, అమృతాభిషేకం, కవితా పుష్యంకం, తిమిరంతో సమరం, పునర్నవం, ఆలోచనాలోచనలు లాంటి అద్భుత రచనలు దాశరథి సొంతం. అనేక అవార్డులతో పాటు కవితా పుష్యకం సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నాడు. 1974లో తిమిరంతో సమరం అనే సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించాయి. 1987 నవంబర్ 5న తన 61 ఏట కన్నుమూయడంతో ఆయన ప్రస్థానం ముగిసింది. మహాకవి పేరు మండలానికి పెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed