నేడే పోలింగ్.. మాస్క్​ ఉంటేనే సెంటర్లోకి అనుమతి

by  |
నేడే పోలింగ్.. మాస్క్​ ఉంటేనే సెంటర్లోకి అనుమతి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జరుగుతున్న మినీ పురపోరు తుది అంకానికి చేరింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం పోలింగ్​ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్​ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని గ్రేటర్​ వరంగల్​, ఖమ్మం కార్పొరేషన్​తో పాటుగా అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్​, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీల్లోని 248 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఖమ్మంలోని ఒక వార్డు ఏకగ్రీవమైంది. ఈ వార్డులకు 1307 మంది పోటీ పడుతున్నారు.

వీటితో పాటుగా గజ్వేల్​ మున్సిపాలిటీ 12వ వార్డు, నల్గొండ మున్సిపాలిటీ 26వ వార్డు, బోధన్​ మున్సిపాలిటీ 18వార్డు, పరకాల మున్సిపాలిటీ 9వార్డుతో పాటుగా జీహెచ్​ఎంసీలోని లింగోజీగూడ 18వ డివిజన్​కు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. జల్​పల్లి మున్సిపాలిటీ 28వ వార్డు, అలంపూర్​ మున్సిపాలిటీ 5వార్డు, మెట్​పల్లి మున్సిపాలిటీ8వార్డు, బెల్లంపల్లి మున్సిపాలిటీ 30వార్డు ఏకగ్రీవమైంది. శుక్రవారం ఉదయం నుంచి పోలింగ్​ ప్రక్రియ మొదలుకానుండగా… కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎస్​ఈసీ ప్రకటించింది.

అటు హైకోర్టు కూడా ఎన్నికల నిర్వహణపై సూచనలిచ్చింది. దీంతో ఏర్పాట్లు కఠినంగా చేశారు. మాస్క్​ ఉంటేనే పోలింగ్​ కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. ఎన్నికల సిబ్బందికి శానిటైజర్లు, మాస్క్​లు, గ్లవ్స్ ఇచ్చారు. ఉదయమే మాక్​ పోలింగ్​ నిర్వహించనున్నారు. మరోవైపు కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న వార్డుల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎన్నికల సంఘం కమిషనర్​ పార్థసారథి వెల్లడించారు.

బరిలో 1307 మంది

మినీ పురపోరులో 1307 మంది బరిలో ఉన్నారు. కాగా గ్రేటర్ వరంగల్ పరిధిలోని 66 వార్డులకు 502 మంది ఉండగా 238 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 వార్డులకు ఒక వార్డు ఏకగ్రీవమైంది. కాగా 250 మంది బరిలో నిలిచారు. అచ్చంపేట మున్సిపాలిటీలో 20 వార్డులకు 66 మంది, సిద్దిపేట 43 వార్డులకు 236 మంది, నకిరేకల్ 20 వార్డులకు 93 మంది, జడ్చర్ల 27 వార్డులకు 112 మంది, కొత్తూరు 12 వార్డులకు 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

అవసరమైతే 144 సెక్షన్

ఈ ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా సంచరిరంచకుండా చూడాలని, అవసరమైతే 144 సెక్షన్ అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది తప్పనిసరిగా మాస్క్ వేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలను శానిటైజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఓటరు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే, బయటకి వచ్చే సమయంలోనూ చేతులు శానిటైజ్ చేసుకునేలా ఏర్పాట్లు సిద్ధం చేయాలని పేరర్కొన్నారు. ఇందుకు ఒక ఇన్ చార్జిని నియమించి పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

కేంద్రాల్లో దూరం పాటించేలా మార్కింగ్ సిద్ధం చేసుకోవాలన్నారు. పోలింగ్ సిబ్బంది సీటింగ్ వద్ద కూడా భౌతిక దూరం పాటించాలని ఆదేశించారు. ఎవరైనా సిబ్బంది అనారోగ్యానికి గురైతే విధులు కేటాయించొద్దని అధికారులకు ఎన్నికల కమిషనర్ సూచించారు. సిబ్బంది అందరూ ఆరోగ్యసేతు యాప్ వినియోగించేలా చూడాలని, సిబ్బందిని తరలించే వాహనాల్లో 50 శాతం మాత్రమే సీటింగ్ వినియోగించేలా జాగ్రత్తలు పాటించాలన్నారు. కొవిడ్ నిబంధనల పర్యవేక్షణకు హెల్త్ నోడల్ అధికారులను నియమించాలన్నారు. కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బంది మెడికల్ కిట్లతో సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సెంటర్ల వద్ద అంబులెన్సులతో పాటు ల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సిబ్బందికి నాణ్యమైన భోజనం అందించాలని ఆయన ఆదేశించారు. ఓటర్లకు కొవిడ్ నిబంధనలు పాటించేలా పోస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు.

స్ట్రాంగ్ రూమ్ లోనూ శానిటైజేషన్

పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రంగా దాచేందుకు విశాలమైన గదులను ఎంచుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అధికారులకు సూచించారు. ఆ గదుల్లో శానిటైజేషన్ పనులు కూడా చేపట్టాలని ఆయన ఆదేశించారు. కౌంటిగ్ హాళ్లలో ఐదు టేబుళ్లకు మించకుండా చూసుకోవాలన్నారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో టేబుల్ కో శానిటైజర్ బాటిల్ ఏర్పాటు చేయాలన్నారు.

మే 3న ఓట్ల లెక్కింపు

ఈ ఎన్నికల్లో బరిలో నిలిచిన 1307 మంది అభ్యర్థుల భవితవ్యం మే 3వ తేదీన తేలనుంది. ఓట్ల లెక్కింపు సమయంలో పాల్గొనే అభ్యర్థులు, ఏజెంట్లు, సిబ్బందికి అనుగుణంగా విశాలమైన హళ్లలో కౌంటింగ్ ఏర్పాట్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ ఆదేశించింది. 50 మందికి మించి సిబ్బంది ఉండొద్దని, జలుబు, దగ్గు, జ్వరంతో ఉన్న వారికి కౌంటింగ్ హాల్ లోనికి అనుమతించకూడదని మార్గదర్శకాలు జారీ చేశారు. గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథిఇప్పటికే అధికారులకు సూచించారు. రిటర్నింగ్ అధికారి నుంచి ధృవపత్రం పొందే అభ్యర్థితో మరొకరికి మాత్రమే అనుమతివ్వాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల అధికారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, డైరెక్టర్ సత్యనారాయణ, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకుడు శివబాలాజీ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, ఓఎస్డీ జయసింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story