ఖాకీల వలయంలో ‘గ్రేటర్’ కౌంటింగ్

by  |
ఖాకీల వలయంలో ‘గ్రేటర్’ కౌంటింగ్
X

దిశ, క్రైమ్‌ బ్యూరో : గ్రేటర్ ఎన్నికల పోరు చివరి అంకానికి చేరింది. ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరీ పీల్చుకున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా 30 సర్కిళ్లు ఉండగా, సర్కిళ్ల వారీగానే ఓట్ల లెక్కింపు ఉండనుంది. బ్యాలెట్ బాక్సులను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్‌లను కూడా అధికారులు సర్కిళ్ల వారీగానే ఏర్పాటు చేశారు. డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కౌంటింగ్ కేంద్రాలుగా (డీఆర్‌సీ) పిలిచే ఈ స్ట్రాంగ్ రూమ్‌లకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. ఈ కేంద్రాల వద్ద టీఎస్‌ఎస్‌పీ, ఆర్డ్మ్ రిజర్వ్, సివిల్ పోలీసు సిబ్బందిని ఏసీపీ స్థాయి అధికారి 24 గంటల పాటు పర్యవేక్షించేలా మూడంచెల పద్దతిలో రక్షణగా ఏర్పాటు చేశారు. మూడు డీఆర్‌సీ కేంద్రాలకు ఒక అడిషనల్ డీసీపీ స్థాయి అధికారికి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు.

మూడంచెల పద్ధతిలో..

గ్రేటర్ వ్యాప్తంగా 30 సర్కిళ్ల పరిధిలో 150 డివిజన్లు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 82 డివిజన్లు, సైబరాబద్ కమిషనరేట్ పరిధిలో 38 డివిజన్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 30 డివిజన్లు ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మొత్తం 52,500 పోలీస్ ఫోర్స్ ను భద్రత కోసం వినియోగించారు. వీటిలో హైదరాబాద్ లో 22 వేలు, సైబరాబాద్ లో 13,500, రాచకొండ పరిధిలో 10 వేల పోలీసు బలగాలను కేటాయించారు. ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లకు తరలించగా, ఈ కేంద్రాల వద్ద జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పోలీసులు కట్టుదిట్టమైన భదత్రా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 14, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 10, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 6 కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ కేంద్రాల్లో టీఎస్ఎస్‌పీ, ఏఆర్, సివిల్ బలగాలను మూడంచెల పద్దతిలో రింగ్ లు వారీగా భద్రత కల్పించారు. కౌంటింగ్ సమయంలో సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా 8 అడుగుల ఎత్తులో జాలీలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో బ్యాలెట్ బాక్సులను ఉంచిన అనంతరం స్ట్రాంగ్ రూమ్ ను వీడీయో చిత్రీకరిస్తూ సీజింగ్ చేశారు. ఈ కేంద్రాలను ఎవరెవరూ విజిట్ చేశారు అనే విషయాలను తెలియడానికి లాగ్ బుక్ ను ఉంచారు. అధికారులు ఎవరైనా.. విజిట్ సమయంలో కచ్చితంగా వారి పేర్లు, హోదాను ఆ బుక్ లో రాయాల్సి ఉంటుంది.

200 మీటర్ల దూరంలో ఆంక్షలు ..

గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న 30 కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ కేంద్రాల పరిసరాల్లో ఎన్నికల అధికారులు గుర్తింపు కార్డు కలిగిన ఏజెంట్లు, అధికారులు, సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంది. అధికారులు, సిబ్బంది కోసం 30 ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను కౌంటింగ్ కేంద్రాలకు సమీపంలోనే అధికారులు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ జరిగే కేంద్రాల పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే, ఏదైనా ప్రదేశంలో ట్రాఫిక్‌ను మళ్లించాల్సి వస్తే.. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తామని ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.


Next Story

Most Viewed