ఓరుగల్లు ‘కారు’లో జోష్.. తీన్మార్ మోగించిన కేసీఆర్

by  |
ఓరుగల్లు ‘కారు’లో జోష్.. తీన్మార్ మోగించిన కేసీఆర్
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక వ‌రంగ‌ల్ టీఆర్ఎస్‌లో తీన్మార్ మోగిస్తోంది. కారు పార్టీలో జోష్ హుషారెత్తుతోంది. ముగ్గురు నేత‌ల‌నూ ఒకేసారి ఎంపిక చేయ‌డం.. మంత్రి ప‌ద‌వులు సైతం ద‌క్కే అవ‌కాశం ఉంద‌న్న ఊహాగానాల నేప‌థ్యంలో కారు పార్టీ శ్రేణుల్లో దిల్‌ ఖుష్ వ్యక్తమ‌వుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన బండా ప్రకాశ్, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, కడియం శ్రీహరి పేర్లను అధిష్టానం ప్రకటించిన విష‌యం తెలిసిందే. రాజ‌కీయ అనుభ‌వం, సీనియ‌ర్ కోటాలో క‌డియంకు, పార్టీకి అంకితాభావం, నిబ‌ద్ధతతో ప‌నిచేసినందుకు త‌క్కెళ్లప‌ల్లికి, ముదిరాజ్ సామాజిక వ‌ర్గం దూరం కాకూడ‌ద‌నే కోణంలో బండా ప్రకాశ్‌ల‌ అభ్యర్థిత్వాల‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖ‌రారు చేసిన‌ట్లుగా పార్టీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతోంది.

కార‌ణాలేమైనా ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో ఎలాంటి చ‌డీ చ‌ప్పుడు లేకుండా మూడు రాజ‌కీయ ప‌ద‌వులు ద‌క్కడం ఆ పార్టీ శ్రేణుల‌ను ఆనందంలో ముంచెత్తుతోంది. వాస్తవానికి ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా నుంచి చాలా మంది నేత‌లు ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌కు పోటీప‌డ్డారు. దాదాపు 10మంది నేత‌లు తీవ్రంగా ప్రయ‌త్నం చేశారు. అయితే అధినేత కేసీఆర్ మాత్రం క‌డియం, బండా ప్రకాశ్‌, త‌క్కెళ్లప‌ల్లి లాంటి సీనియ‌ర్లు, ఉద్యమ నేప‌థ్యం, రాజకీయాల‌ను ప్రభావితం చేసే సామాజిక కోణాల‌నే ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఎంపిక తంతును పూర్తి చేసిన‌ట్లు స‌మాచారం.

ఓరుగ‌ల్లుకు పెద్దపీట‌..

ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌కు అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ వ‌రంగ‌ల్‌కు పెద్దపీట వేశార‌నే చెప్పాలి. తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌తో ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా టీఆర్ఎస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ క‌నిపిస్తోంది. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీ బ‌ల‌ప‌డ‌కుండా, కారు పార్టీలో క‌ద‌లిక‌లు లేకుండా ఉండేందుకే అధినేత తాజా రాజ‌కీయ నిర్ణయాలని ఆ పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఆరుగురు అభ్యర్థుల్లో ముగ్గురు ఓరుగ‌ల్లు నేత‌ల‌ను ఎంపిక చేయ‌డంతో వ‌రంగ‌ల్ జిల్లాకు రాజ‌కీయంగా ఇచ్చే ప్రాధాన్యాన్ని చాటుకున్నారు. గ‌తంలోనూ ఉమ్మడి వ‌రంగ‌ల్ నుంచే క‌డియంకు డిప్యూటీ సీఎం ప‌ద‌వి, మ‌ధుసూద‌నాచారికి స్పీక‌ర్ ప‌ద‌వి ఇచ్చిన విష‌యాన్ని జిల్లా నేత‌లూ గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా క‌డియం, బండా ప్రకాశ్‌ల అభ్యర్థిత్వాల ఖ‌రారు వెనుక రాష్ట్ర రాజ‌కీయా కోణాలు దాగి ఉన్నాయ‌న్న చ‌ర్చ సైతం రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది.

ఎట్టకేలకు త‌క్కెళ్లప‌ల్లికి న్యాయం..

పార్టీ ఆవిర్భావం నుంచి ప‌నిచేస్తూ ఉద్యమ స‌మ‌యంలో ఉమ్మడి జిల్లాకు నాయ‌క‌త్వం వ‌హించిన త‌క్కెళ్లప‌ల్లి ర‌వీంద‌ర్‌ రావుకు ఎట్టకేల‌కు ఎమ్మెల్సీ ద‌క్కడంతో ఆయ‌న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి సుదీర్ఘకాలంగా ఆయ‌న పార్టీనే న‌మ్ముకుని ప‌నిచేస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ కోసం, ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌కు ఎంపిక ప్రతిపాద‌న వ‌చ్చిన ప్రతీసారి త‌క్కెళ్ల పేరు వినిపించినా.. చివ‌రికి వీగిపోవ‌డం ప‌రిపాటిగా మారింది. కానీ, ఈ సారి మాత్రం ఉద్యమ స‌మ‌యంలో ఆయ‌న చేసిన సేవ‌ల‌ను గుర్తు పెట్టుకుని పిలిచి మ‌రీ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఖ‌రారు చేయ‌డం గ‌మనార్హం. ఉద్యమ నేత‌ల‌ను పార్టీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వ‌స్తున్న విమ‌ర్శల‌కు త‌క్కెళ్లప‌ల్లి ఎంపిక‌తో కాస్త చెక్ పెట్టిన‌ట్లయింద‌ని ఆ పార్టీ లీడ‌ర్లు పేర్కొంటున్నారు.

సీనియ‌ర్ కోటాలో క‌డియం..

క‌డియం శ్రీహ‌రికి ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని పార్టీలో గ‌త కొద్దిరోజులుగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. పార్టీ ప్లీన‌రీ, ద్విద‌శాబ్ది ఉత్సవాల‌ను వ‌రంగ‌ల్‌లో ఘ‌నంగా నిర్వహించాల‌ని భావించిన‌ప్పుడే కేసీఆర్ ప్రత్యేకంగా హైద‌రాబాద్‌కు పిలిపించుకుని మాట్లాడారు. ఆయ‌న‌పై ఎలాంటి అవినీతి ఆరోప‌ణ‌లు లేక‌పోవ‌డంతో మొద‌ట్నుంచి కూడా క‌డియంకు పార్టీలో ప్రాధాన్యం క‌ల్పిస్తూ వ‌స్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఎంపిక చేయ‌డమే ఇందుకు నిద‌ర్శనం. సిట్టింగ్‌ల‌కే టికెట్లు అనే ప్రాతిప‌దిక‌కు కేసీఆర్ క‌ట్టుబ‌డి ఉండ‌టంతో స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ టికెట్‌ను క‌డియం ఆశించినా ద‌క్కలేదు. అదే స‌మ‌యంలో క‌డియంకు ఎమ్మెల్సీ ఇచ్చి పార్టీలో ప్రాధాన్యం క‌ల్పించింది. అయితే, మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటార‌ని అనుకున్నా జ‌ర‌గలేదు. తాజాగా క‌డియంను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయ‌డంపై మంత్రి వ‌ర్గంలోకి తీసుకునే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ కూడా జ‌రుగుతోంది.

బండా ప్రకాశ్ ఎంపిక‌లో ముదిరాజ్ కోణం..

క‌డియం శ్రీహ‌రి, ర‌వీంద‌ర్‌రావుల పేర్లు ముందు నుంచి వినిపించినా బండా ప్రకాష్ ఎంపిక‌కు మాత్రం ముదిరాజ్ సామాజిక కోణంలో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా చ‌ర్చ జ‌రుగుతోంది. జిల్లాకే చెందిన‌ మాజీ స్పీక‌ర్ మ‌ధుసూద‌న‌చారి పేరు చివ‌రి వ‌ర‌కు వినిపించినా.. అనూహ్యంగా అధినేత బండా ప్రకాశ్‌కు అవ‌కాశం క‌ల్పించ‌డం గ‌మ‌నార్హం. ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేర‌డంతో ఆ సామాజిక వ‌ర్గానికి పెద్దదిక్కుగా ఉండేందుకు, ఆ సామాజిక వ‌ర్గం ఓటు బ్యాంకు.. పార్టీ నుంచి దూరం కాకుండా ఉండేందుకే ఆయ‌న ఎంపిక జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. త్వర‌లోనే ఆయ‌న్ను మంత్రి వ‌ర్గంలోకి కూడా తీసుకుంటున్నార‌న్న ఊహాగానాలు వినిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

Next Story

Most Viewed