నెత్తురోడిన జాతీయ రహదారి.. వెనువెంటనే రెండు ప్రమాదాలు..

by  |
నెత్తురోడిన జాతీయ రహదారి.. వెనువెంటనే రెండు ప్రమాదాలు..
X

దిశ, నకిరేకల్: వారంతా వివిధ ప్రాంతాలకు చెందిన వారు.. సొంత పనుల నిమిత్తం ఎంతో ఆనందంగా ఇంటి నుంచి బయలుదేరారు.. పనులు ముగించుకొని తిరిగి వస్తాం అనుకున్నారు.. కానీ వారిని విధి వక్రీకరించింది.. ఎదురుగా వాహన రూపంలో మృత్యువు ఎదురొచ్చి కానరాని లోకాలకు తీసుకెళ్ళింది.. ఈ విషాద ఘటన హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి పై ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం హైపరాజుపాలెం గ్రామానికి చెందిన కదిరి గోపాల్ రెడ్డి తన భార్య రచన, స్నేహితుడు ప్రశాంత్ తో కలిసి హైదరాబాద్ నుంచి ఒంగోలుకు కారులో వెళ్తున్నారు. నల్గొండ జిల్లా, కట్టంగూరు మండలం, ముత్యాలమ్మ గూడెం గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. దీంతో పక్కనే ఉన్న డివైడర్ కు తగిలి కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు తగిలింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న గోపాల్ రెడ్డి(31), ప్రశాంత్ (24)అక్కడికక్కడే మృతి చెందారు. రచన(30)ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. అదేవిధంగా కారులో ప్రయాణిస్తున్న చిన్నారి రియాన్ష్ ప్రమాదం నుంచి బయటపడింది. ఈ ప్రమాదం వల్ల రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు వాహనాలను ఆపి ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా.. హైదరాబాద్ నుంచి విజయవాడ కి వెళ్తున్న మరో కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా దోమ మండలం, మోత్కూర్ గ్రామానికి చెందిన జంగం శివ ప్రసాద్ (23), బడంపేట కు చెందిన వినయ్ కుమార్(21) లు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిద్దరూ పురోహితులు కావడంతో సూర్యాపేటలో ఓ పూజా కార్యక్రమానికి వెళ్తున్నట్లు సమాచారం.

మృతులంతా యువతే:

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పై ఆదివారం ఉదయం జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారంతా యువతే కావడం గమనార్హం. దీంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదాల వల్ల యువత మృతి చెందడంతో ఆ ప్రాంతానికి వచ్చిన స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.

అతివేగమే ప్రమాదానికి కారణం :

ఈ రెండు వేర్వేరు సంఘటనల్లో అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. అవగాహన రాహిత్యం, అతివేగం కారణంగా ఐదుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి సీఐ నాగ దుర్గా ప్రసాద్, ఎస్సై శివప్రసాద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed