అప్పు కోసం ఒప్పుకుంటున్నాం..!

by  |
అప్పు కోసం ఒప్పుకుంటున్నాం..!
X

దిశ, న్యూస్‌‌బ్యూరో: లాక్‌డౌన్ కాలంలో ఇన్​టైంలో విద్యుత్ బిల్లులు వసూలు చేయలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు).. కేంద్ర సాయం కోసం యత్నిస్తున్నాయి. ‘ఆత్మ నిర్భర్’ ప్యాకేజీలో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని డిస్కంలకు తాను యాజమానిగా ఉన్న పవర్ ఫైనాన్స్ కంపెనీలైన పీఎఫ్‌సీ, ఆర్ఈసీల నుంచి ₹90వేల కోట్ల రుణం ఇప్పిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ రుణం పొందాలంటే డిస్కంలు కొన్ని నిబంధనలు పాటించాలని షరతులు పెట్టింది. కష్టకాలంలో ప్యాకేజీ ఇస్తూ కండిషన్స్​ పెట్టిందని, రాష్ట్రాల హక్కులను కాలరాసే విధంగా కొత్త విద్యుత్ చట్టాన్ని తీసుకొస్తుందంటూ కేంద్రంపై గుర్రుగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం చివరికి ప్యాకేజీలో భాగంగా విద్యుత్ సంస్థలకు ఇచ్చే అప్పులు తెచ్చుకోవాలనే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని రెండు డిస్కంలు పీఎఫ్‌సీ, ఆర్‌ఈ‌సీ‌ల నుంచి ప్యాకేజీలో భాగంగా ₹12 వేల కోట్ల రుణాన్ని తీసుకోవడానికి అవసరమైన కసరత్తును ఇప్పటికే ప్రారంభించినట్టు సమాచారం. నెలవారి నిర్వహణ వ్యయానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రస్తుత సమయంలో కేంద్ర రుణం తీసుకోవడం తప్ప వేరే మార్గం లేనందునే డిస్కంలు ఈ నిర్ణయానికొచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.

కేంద్ర సంస్థల అప్పులే దిక్కు..

పీఎఫ్‌సీ, ఆర్‌ఈ‌సీ సంస్థలిచ్చే రుణాలకు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్లో భారీ మొత్తంలో వాటి నుంచి రుణాలు అందుబాటులో ఉండడంతో నిర్వహణ వ్యయం కోసం కేంద్ర ప్యాకేజీకి డిస్కంలు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నిధులతో విద్యుత్ ఉత్పత్తి సంస్థల(జెన్‌కో)కు బకాయిపడ్డ సొమ్ము చెల్లించడంతో పాటు ఇతర ఖర్చులకు వాడుకోవడానికి డిస్కంలకు అవకాశముంటుంది. డిస్కంలను బాగు చేయడానికి కేంద్రం తీసుకొచ్చిన ఉదయ్ పథకంలో రాష్ట్రాలు చేరిన తర్వాత నిర్వహణ వ్యయం కోసం అవి చేసే అప్పులపై పరిమితి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో డిస్కంలకు ఉన్న రెవెన్యూలో 25% మాత్రమే వాటి నిర్వహణ వ్యయం కోసం అప్పివ్వడానికి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు అనుమతి ఉంది. ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా ఈ పరిమితిని 45% పెంచుతూ త్వరలోనే కేంద్రం నిర్ణయం తీసుకోనుందని సమాచారం. లాక్‌డౌన్ లేకుండా పరిస్థితులు సాధారణంగా ఉంటే కేంద్ర పవర్ ఫైనాన్స్ సంస్థలిచ్చే రుణాల జోలికి డిస్కంలు వెళ్లి ఉండేవి కావని, ప్రభుత్వ గ్యారంటీతో తక్కువ వడ్డీకి బాండ్లు జారీ చేసుకునేవని పలువురు విశ్లేషిస్తున్నారు. లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో ప్రభుత్వమే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున డిస్కంలకు కేంద్ర సంస్థల అప్పులే దిక్కయ్యాయని వారు అభిప్రాయపడుతున్నారు.

ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడడానికి..

అప్పుల కోసం కేంద్రం పెట్టిన షరతులైన డిజిటల్ పద్ధతిలో విద్యుత్ బిల్లులు వసూలు చేయడం, ప్రభుత్వ కార్యాలయాల బాకీలు తక్షణమే వసూలు చేయడం, ఆర్థిక నష్టాలు తగ్గించుకోవడానికి చర్యలు తీసుకోవడం లాంటి వాటికి రాష్ట్ర డిస్కంలు ఒప్పుకునేందుకు సైతం సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ షరతుల్లో కొన్నింటిని తొలగించాలని డిస్కంలు ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశాయని, ఈ విజ్ఞప్తులకు కేంద్రం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ₹12వేల కోట్ల అప్పులు తెచ్చుకొని ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి బయటపడాలనే యోచనతో ప్యాకేజీకి సంబంధించి ఒప్పంద కాగితాలను మరో వారం పది రోజుల్లో సిద్ధం చేసే పనిలో డిస్కంలు ఇప్పటికే ఉన్నాయని సమాచారం. ప్యాకేజీలో భాంగా ఇచ్చే ఈ రుణాల్లో 3 ఏండ్లకు 8.75 శాతం, 5 ఏండ్లకు 9 శాతం, 7 ఏండ్లకు 9.25 శాతం, 10 ఏండ్లకు 9.5 శాతం వడ్డీని వసూలు చేయాలని పీఎఫ్‌సీ, ఆర్‌ఈ‌సీ సంస్థలు ఇప్పటికే నిర్ణయించినట్టు సమాచారం.

Next Story

Most Viewed