పీఆర్సీ ఊసెత్తని సర్కారు.. నిరుత్సాహంలో ఉద్యోగులు

by  |
Telangana budget
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ప్రతిపాదనలు, నిధుల కేటాయింపులు బడ్జెట్‌లో కనిపించలేదు. అసెంబ్లీ వేదికగా పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం కేసీఆర్​బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిట్‌మెంట్‌ను దాదాపు 30 శాతానికి పెంచితే రూ.9 వేల కోట్లు అదనంగా అవసరమవుతాయని ఆర్థిక శాఖ లెక్కలేసింది. సీఎం కేసీఆర్​కూడా దీనిపై ప్రకటన చేయడంతో బడ్జెట్‌లో వివరిస్తారని ఉద్యోగులు భావించారు. నాన్​ప్లానింగ్​బడ్జెట్​అయినప్పటికీ చాలాకాలంగా ఇస్తున్న హామీ కావడంతో బడ్జెట్​ప్రసంగంలో ఉంటుందనుకున్నారు. కానీ ఈ బడ్జెట్‌లో సర్కారు పీఆర్సీ ఊసే ఎత్తకపోవడంతో ఉద్యోగ వర్గాలు నిరుత్సాహానికి గురయ్యాయి.

పదవీ విరమణ పెంపు కూడా బడ్జెట్​ప్రసంగంలో ఉంటుందనుకున్నారు కానీ, అదీ లేదు. మరోవైపు బడ్జెట్‌లో కేటాయించిన పద్దుల్లో పెద్దగా మార్పులేమీ లేనట్లుగా ఉంది. వాస్తవంగా 010 నుంచి 019 దాకా పద్దులు, వేతనాలు, అలవెన్సులకు సంబంధించిన వివరాలను పొందుపర్చిన ప్రభుత్వం మార్పులను పెద్దగా చూపించలేదు. ఇక రాష్ట్రంలో మొత్తం ఉద్యోగుల వివరాలు కూడా ఈసారి శాసనసభకు సమర్పించలేదని తెలుస్తోంది. గత బడ్జెట్‌ సమావేశాల్లో మొత్తం 4.49 లక్షల మంది ఉద్యోగులున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వీరిలో పోలీస్ శాఖలోనే అత్యధికంగా 54 వేలు ఉన్నట్లు వివరించారు. కానీ ఈసారి ఆ వివరాలేవీ వెల్లడించలేదు. ఏదేమైనా మండలి ఎన్నికల ముందు ప్రభుత్వం ఉద్యోగుల అంశంలో చూపించిన చొరవ బడ్జెట్‌లో మాత్రం కనిపించలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్​అండ్​బీకి 8,788 కోట్లు

బడ్జెట్‌లో ఆర్​అండ్​బీకి రూ. 8,788 కోట్లు ప్రతిపాదించారు. దీంతో పాటుగా రీజనల్​రింగ్​రోడ్డు భూ సేకరణ కోసం అదనంగా రూ.750 కోట్లు కేటాయించారు. ఆర్​అండ్​బీకి గతేడాది రూ.3,493 కోట్లు కేటాయించారు. గ్రామీణ రహదారుల కోసం గత బడ్జెట్‌లో రూ. 400 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.800 కోట్లు ప్రతిపాదించారు. ఇక పంచాయతీరాజ్​రోడ్ల కోసం రూ.3‌‌00 కోట్లు, అదేవిధంగా 21 చోట్ల ఆర్‌వీబీ, ఆర్‌యూబీ నిర్మాణాలు చేపట్టేందుకు రూ.400 కోట్లు చేయగా, గతేడాది వీటి కోసం కేవలం రూ.20 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది.

సమీకృత కలక్టరేట్ల నిర్మాణాలు, పోలీస్​ కార్యాలయాలు, కమాండ్​కంట్రోల్​సెంటర్ల కోసం రూ.725 కోట్లు ఈసారి ప్రతిపాదించగా, గతేడాది రూ.275 కోట్లు మాత్రమే కేటాయించారు. నూతనంగా నిర్మాణం చేస్తున్న సచివాలయానికి ప్రత్యేకంగా ఫండ్స్​ ఇస్తున్నారు. సచివాలయ నిర్మాణం కోసం రూ. 610 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇక టీఎస్ ఆర్టీసీ కోసం గతేడాది రూ.1000 కోట్లు కేటాయిస్తే, ఈసారి మాత్రం రూ.1500 కోట్లు కేటాయించగా, రుణాలతో మరో రూ.1500 కోట్లకు బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశారు. దీనిలో ఆర్టీసీ బస్‌ పాసుల రాయితీ కింద రూ.900 కోట్లు చెల్లించాల్సి ఉంది.

నియోజకవర్గానికి రూ.5 కోట్లు

నియోజకవర్గ అభివృద్ధి నిధులను గతేడాది రూ.3 కోట్లకు పెంచగా, ఈసారి రూ.5 కోట్లకు పెంచుతున్నట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. 2020కి ముందు ప్రతి సెగ్మెంట్‌కు అభివృద్ధి నిధుల కింద రూ.కోటి ఉండగా, దాన్ని ప్రభుత్వం 2020–21 బడ్జెట్‌లో రూ.3 కోట్లకు పెంచింది. 2019లో కారణాలేమైనా రూపాయి కూడా ఖర్చు చేయలేదు. అలాగే గతేడాది కరోనా ఆర్థిక పరిస్థితులతో సీడీఎఫ్‌ను విడుదల చేయలేమంటూ సీఎం కేసీఆర్​ ప్రకటిండంతో ఒక్క రూపాయి రాలేదు. అయితే ఈసారి అన్నింటినీ కలుపుకొని ప్రతి సెగ్మెంట్‌కు రూ.5 కోట్లను ప్రతిపాదిస్తే, దీనికోసం బడ్జెట్‌లో రూ.800 కోట్లు ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోటా కింద ఈ నిధులు విడుదల చేయనున్నారు.

పంచాయతీల కోసం పద్దు

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రభుత్వం రూ.29,271 కోట్లను కేటాయించింది. అయితే ఇప్పటికే పల్లెప్రగతి కింద గ్రామ‌పంచాయ‌తీల‌కు రూ.5,761 కోట్ల నిధులు విడుద‌ల‌ చేసినట్లు వెల్లడించింది. అదేవిధంగా తొలిసారిగా ప్రభుత్వం బ‌డ్జెట్ నుంచి మండ‌ల‌, జిల్లా ప‌రిష‌త్‌ల‌కు రూ.500 కోట్ల నిధులు కేటాయించింది. ఇందులో జిల్లా ప‌రిష‌త్‌ల‌కు రూ. 252 కోట్లు, మండ‌ల పరిష‌త్‌ల‌కు రూ.248 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించింది. మొత్తంగా పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌కు రూ.29,271 కోట్లు కేటాయించింది. పంచాయతీరాజ్​ శాఖకు గత బడ్జెట్‌లో రూ. 23 వేల కోట్లు కేటాయించారు. ఇక మహిళా సంఘాలకు గత బడ్జెట్‌లో రూ.1200 కోట్లు మాత్రమే కేటాయిస్తే, ఈసారి మాత్రం రూ.3 వేల కోట్లను వడ్డీ లేని రుణాల కింద మంజూరు చేయాలని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. అయితే వడ్డీ లేని రుణాలు అంటూ చెప్పుతున్నా రెండేండ్ల నుంచి వడ్డీ రాయితీని వర్తింపచేయడం లేదు.

Next Story

Most Viewed