కేటీఆర్ ఇలాకాలో ఎన్నికల అబ్జర్వర్ ఎక్కడ.. నిబంధనలకు తిలోదకాలు..!

by  |
కేటీఆర్ ఇలాకాలో ఎన్నికల అబ్జర్వర్ ఎక్కడ.. నిబంధనలకు తిలోదకాలు..!
X

దిశ, సిరిసిల్ల: పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో జనాలు గుమిగూడి ఉండరాదని ఎమ్మెల్సీ ఎన్నికల ముందు పోలీస్ అధికారులు.. సిబ్బందికి ఆదేశాలిచ్చారు. అమలు చేయాలనే ఆలోచన బాగున్నప్పటికీ ఆచరణలోకి వచ్చేసరికి అందరూ నిబంధనలను మరిచిపోయారు. సిరిసిల్ల జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు శుక్రవారం ఉదయం ప్రారంభం అయిన రెండు గంటల తర్వాత.. క్యాంపునకు వెళ్లిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బస్సు జిల్లా పరిషత్ కార్యాలయం, పోలీసు ఉన్నతాధికారి కార్యాలయానికి ముందు ఆగింది. ఆ బస్సును అక్కడ నిలపరాదని పోలీస్ అధికారులు చెప్తారేమో అని అటుగా వెళ్తున్న స్థానికులు భావించారు.

కానీ, ఆ బస్సును ఆపడం కాదు కదా.. క్యాంపు నుండి వచ్చిన టీఆర్ఎస్ ప్రతినిధులు( ఓటర్లు) ఒక్కొక్కరుగా బస్సు దిగుతుంటే పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి దగ్గరుండి వారిని పోలింగ్ బూత్‌లోకి పంపించారు. బస్సు వద్ద పోలీస్ అధికారులు గస్తీ కాస్తున్న విధానం స్థానికంగా విమర్శలకు దారితీసింది. సాధారణ ఎన్నికల సమయంలో ఉన్న ఎన్నికల నిబంధనలు.. స్థానిక ప్రజా ప్రతినిధులు ఓటర్లుగా ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు వర్తించవా.. అని సాధారణ ప్రజలు చర్చించుకున్నారు.

క్యాంపునకు వెళ్లిన ప్రజాప్రతినిధుల బస్సు పోలింగ్ కేంద్రం ముందు వచ్చి ఆగిన ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఎన్నికల నిబంధనలను పరిశీలించే ఎన్నికల అబ్జర్వర్ ఎక్కడున్నారన్న సందేహాలు అందరినీ వెంటాడుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అధిక శాతంలో ఓటర్లుగా ఉన్నప్పటికీ.. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలకు వెళ్లిందని సొంతగూటికి చెందిన వారే చర్చించుకోవడం గమనార్హం.

Next Story

Most Viewed