ఇక కలెక్టర్ల పని అంతా అదే!

by  |
collectors
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర పాలనా యంత్రాంగం కరోనాపై ఫోకస్​ పెట్టింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అదే ప్రాధాన్యతాంశంగా పని చేయాలంటూ సీఎస్​ సోమేశ్​ కుమార్.. అన్ని జిల్లాల కలెక్టర్లకు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఉదయమే జిల్లాల వారీగా కలెక్టర్లతో మాట్లాడిన సోమేశ్​ కుమార్​ కరోనాపైనే దృష్టి పెట్టాలంటూ మౌఖిక ఆదేశాలిచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం, పాజిటివ్​తేలిన వారికి ఏర్పాట్లు చేయడంపై ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.

ఇప్పుడంతా అదే ఫోకస్​

ప్రస్తుతం కరోనా కేసులు విస్తృతమవుతున్నాయి. పల్లెల నుంచి పట్టణాల దాకా పాజిటివ్​ కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు సరైన ప్రణాళిక లేదంటూ అన్ని వర్గాలతో పాటుగా హైకోర్టు కూడా మొట్టికాయలు వేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో రాజకీయ పరిణామాల్లోనే నిమగ్నమైన సీఎం, మంత్రులు… కరోనా అంశాన్ని గాలికి వదిలేశారు. అటు ప్రభుత్వ యంత్రాంగం కూడా అదే రీతిలో పని చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

అయితే పాజిటివ్​ కేసులతో పాటుగా రాష్ట్రంలో మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. శ్మశాన వాటికల్లో డెడ్​బాడీలు లైన్​లో ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి చేపట్టే చర్యలు ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో లేవు. నైట్​ కర్ఫ్యూ విధించినా.. ఫలితాలేమీ మారడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఇలాంటి పరిణామాల్లోనే రాష్ట్రంలో పాలనాయంత్రాంగం పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అన్నింటికంటే ముందుగా కరోనాపైనే ఫోకస్​ పెట్టాలని, ఇదే ప్రాధాన్యతగా తీసుకుని పని చేయాలని సీఎస్​… జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు చెప్పుతున్నారు. కరోనా వ్యాప్తి నివారణ, కరోనా పాజిటివ్​ వ్యక్తులకు ఐసోలేషన్​, ఆక్సిజన్​ సిలిండర్లు, మందుల పంపిణీ, తాత్కాలిక ఐసోలేషన్​ సెంటర్ల ఏర్పాటుపై కలెక్టర్లు నిత్యం సమీక్షించాలని సీఎస్​ సూచించారు. అంతేకాకుండా ప్రైవేట్​ ఆస్పత్రుల్లో చికిత్సలు, రెమెడిసివిర్​ ఇంజక్షన్ల కొరత వంటి వాటిపై కలెక్టర్లు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక బృందాల పర్యవేక్షణలో కరోనా కేసులపై స్పెషల్​ ఫోకస్​ ఉండాలని, కొన్ని రోజుల పాటు రాష్ట్రమంతటా ఇదే ఫోకస్​ ఉండాలని, అవసరమైతే ఇతర అంశాలను పక్కన పెట్టాలంటూ మౌఖికంగా సూచించారని తెలుస్తోంది.

అదేవిధంగా గ్రామాలు, పట్టణాల్లో వివాహాలు, శుభకార్యాలపై నిఘా పెట్టాలని, పరిమితికి మించి గుమిగూడితే చర్యలు తీసుకోవాలంటూ సీఎస్​ హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ముహూర్తాలు మొదలుకావడంతో ఆయా ప్రాంతాల్లో వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్నిచోట్ల వాయిదా వేసుకున్నా కొన్నిప్రాంతాల్లో మాత్రం యథాతధంగా కొనసాగుతున్నట్లు ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి వాటిపై నిఘా పెట్టాలని, మండలాల వారీగా రెవెన్యూ బృందాలను పరిశీలించేందుకు నియమించాలని సూచించారు.

అదేవిధంగా పీహెచ్​సీల్లో పాజిటివ్​ వ్యక్తులకు ఇచ్చే కిట్​లను అందుబాటులో పెట్టాలని, హోం ఐసోలేషన్​ సదుపాయాలు లేని వారిని తాత్కాలికంగా ఏర్పాటు చేసే ప్రాంతాలకు తరలించాలని, దీని కోసం ప్రత్యేకంగా వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని, ఈ బాధ్యతలన్నీ కలెక్టర్లు తీసుకోవాలంటూ గురువారం సీఎస్​… కలెక్టర్లకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు.



Next Story

Most Viewed