వివాదంలో మంత్రి సీదిరి అప్పలరాజు.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్

by  |
Sidiri Appalaraju
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు క్షమాపణలు చెప్పాలని శ్రీకాకుళం జిల్లాలోని వీఆర్వోల సంఘం డిమాండ్ చేసింది. వీఆర్వోలు సచివాలయాలకు వస్తే వారిని తరమాలని ప్రజా ప్రతినిధులకు మంత్రి అప్పలరాజు చెప్పారంటూ వీఆర్వోలు ఆరోపించారు. తమపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి అప్పలరాజు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకపోతే బుధవారం ఓటీఎస్ పథకంపై పలాస నియోజకవర్గంలోని బుధవారం మందస, వజ్రపుకొత్తూరు, పలాస రూరల్, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ స్థానిక సంస్థల ప్రతినిధులతో, అధికారులతో మంత్రి అప్పలరాజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

అయితే స‌మావేశానికి ముందు అక్కడే ఉన్న వీఆర్వోల‌పై మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎందుకు ఇక్కడికి వ‌చ్చారు. ఇక్కడి నుంచి వెంట‌నే వెళ్లిపోండి అంటూ ఆదేశించారు. దీంతో వీఆర్వోలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పిలిచి అవ‌మానించ‌డం స‌రైంది కాదంటూ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ రాజ‌గోపాల్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యవహారాన్ని మంత్రి సీదిరి అప్పలరాజు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌ కూడా వివాదంపై వివరణ ఇచ్చారు. అనంతరం మంత్రి వీఆర్వోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స‌మావేశానికి మీరు రాజ‌కీయం చేయ‌డానికే వ‌చ్చారా ? లేదా ఉద్యోగం చేయ‌డానికి వ‌చ్చారా అంటూ మండిపడ్డారు. మంత్రి వ్యాఖ్యల పట్ల వీఆర్వోలు అసంతృప్తికి గుర‌య్యారు. అనంతరం జరిగిన వ‌న్‌టైం సెటిల్‌మెంట్ స‌మావేశంలో వీఆర్వోల విష‌యం కూడా ప్రస్తావించారు. రేప‌టి నుంచి వీఆర్వోలు స‌చివాల‌యానికి రానీయ‌కండ‌ని, వ‌స్తే త‌రిమి కొట్టాల‌ని స్థానికుల‌కు సూచించారు.

దీనిని స్థానిక స‌ర్పంచ్‌లు, ఎంపీటీసీలు గ‌మ‌నించాల‌ని అన్నారు. అనంత‌రం త‌హ‌సీల్దార్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. త‌హ‌సీల్దార్లు వీఆర్వోల‌ను కూడా ఆప‌లేక‌పోతున్నారా అని ప్రశ్నించారు. అలాంట‌ప్పుడు త‌హ‌సీల్దార్లు ఎందుక‌ని మండిప‌డ్డారు. ఈ వ్యాఖ్యలపట్ల రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్వోలు నిరసనలకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా గురువారం శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్వోలు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. మంత్రి అప్పలరాజు వీఆర్వోలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.


Next Story