ఒంటరి వ్యక్తులే వారి లక్ష్యం

by  |
ఒంటరి వ్యక్తులే వారి లక్ష్యం
X

దిశ, కామారెడ్డి: తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకొని ఇప్పటిదాకా దొంగతనాలకు పాల్పడ్డారు దుండగులు. తాము ఎంచుకున్న ప్రాంతంలో పూర్తిగా రెక్కీ నిర్వహించి ఆధారాలు దొరకకుండా చోరీలకు పాల్పడేవారు. ఇప్పటికీ కొన్ని కేసులను పోలీసులు ఛేదించలేదు. ప్రస్తుతం దొంగల దృష్టి మార్చుకున్నారు. నిర్మానుష్య ప్రాంతాలను ఎంచుకుని దారి దోపిడీలకు తెగబడుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన దొంగతనాలు పోలీసులకు సవాల్‌గా మారాయి. జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల సంఖ్య తక్కువగా ఉండడం, కెమెరాల ఏర్పాటుకు గ్రామీణ ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చినట్టు జిల్లా కేంద్రంలో ముందుకు రాకపోవడంతో కెమెరాల ఏర్పాటు తగ్గింది. ఇటీవల ఎస్పీ ఆదేశాలతో సేఫ్ కాలనీ పేరుతో స్థానిక కాలనీల ప్రజలు, సంబంధిత కాలనీ కౌన్సిలర్లతో మాట్లాడి సీసీ కెమెరాల ఏర్పాటుపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. అయినా అక్కడక్కడ చోరీలు జరుగుతూనే ఉన్నాయి. దుకాణాలు, వైన్ షాపులు, తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు దుండగులు.. నెల రోజుల నుంచి జిల్లా కేంద్రంలో చోరీలు జరగడం లేదు. అయితే తాజాగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శివారు ప్రాంతాల్లో దారి దోపిడీకి పాల్పడుతున్నట్టు సమాచారం.

గ్రామీణ ప్రాంతాల ప్రజలే టార్గెట్..

గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వేలాదిగా తరలి వస్తుంటారు. రాత్రి అయ్యేసరికి పనులు ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణమవుతారు. అయితే రాత్రి 7దాటిన తర్వాత జిల్లా కేంద్రం శివారులో ప్రజలు తక్కువగా సంచరిస్తుంటారు. ఇదే అదునుగా భావించిన కొందరు దుండగులు శివారు ప్రాంతాలను రెక్కీ ప్రాంతాలుగా ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. జిల్లా కేంద్రం నుంచి రామారెడ్డి వైపు వెళ్లే దారి దోపిడీకి అడ్డాగా మారినట్టు తెలుస్తోంది. గుమస్తా కాలనీ దాటిన తర్వాత బైపాస్ బ్రిడ్జి వద్ద గల గెలాక్సీ ఫంక్షన్ హాల్ నుంచి గోదాం రోడ్డు వరకు గల దారి నిర్మానుష్యంగా ఉంటుంది. ఇదే ప్రాంతాన్ని దుండగులు తమకు అనుకూల స్థలంగా ఎంచుకున్నారు. రాత్రి 7నుంచి కొందరు వ్యక్తులు గ్రూపులుగా ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకరిద్దరు దారిలో నిలబడి ఎవరూ లేని సమయంలో సింగల్ గా వస్తున్న బైకులను ఆపి బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఎదురు తిరిగిన వారిపై దాడులు చేసి వారి వద్ద ఉన్న సొత్తును దోచుకుంటున్నారని తెలుస్తోంది. ఇటువంటి ఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రెండు రోజుల క్రితం వ్యక్తిపై దాడి…

గత శుక్రవారం రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన లక్కాకుల చంద్రమౌళి టెక్రియాల్ గ్రామానికి వెళ్లి రాత్రి 7:30 ప్రాంతంలో తిరిగి వస్తున్నాడు. గెలాక్సీ ఫంక్షన్ హాల్ వద్ద బైపాస్ దిగగానే ఇద్దరు వ్యక్తులు అతడిని ఆపి ఎవరు అంటూ ప్రశ్నించి ఇబ్బందులకు గురి చేశారు. ఆ సమయంలో వెనక నుంచి మరో ఏడుగురు వ్యక్తులు వచ్చి చంద్రమౌళిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో చంద్రమౌళి చేతికి తీవ్ర గాయమైంది. బైకు ఆపకుండా అక్కడి నుంచి చంద్రమౌళి తప్పించుకుని వెళ్లి పోయాడు. ఇంటికి వచ్చి స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి వద్ద చికిత్స చేయించుకోగా 8 స్ట్రిచింగ్స్ పడ్డాయని బాధితుడు తెలిపాడు. అదే రోజు రామారెడ్డి ఎస్ఐకి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పినట్టు తెలిపాడు. అయితే దాడి విషయాన్ని పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేదన్నారు.

గతంలోనూ మూడు దోపిడీలు..

కొద్దిరోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు అదే ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల వద్ద దారి కాచి దోపిడీకి పాల్పడినట్టుగా తెలిసింది. కామారెడ్డిలో వివిధ దుకాణాల్లో పని చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా గర్గుల్ సమీపంలో ఓ వ్యక్తిని ఆపి అతడి వద్ద ఉన్న పర్సును లాక్కున్నారు. అలాగే గర్గుల్ కామారెడ్డి మధ్యలో మరో వ్యక్తిని ఆపి అతడి వద్ద రూ.5వేల వరకు దోచుకున్నారు. దీంతో రాత్రి సమయంలో ఆ ప్రాంతంలో వెళ్లాలంటే ద్విచక్ర వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.

పెట్రోలింగ్ చేపడతాం

కామారెడ్డి నుంచి రామారెడ్డి వెళ్లే దారిలో దారి దోపిడీ విషయం తమ దృష్టికి రాలేదని దేవునిపల్లి పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఆ ప్రాంతంలో రాత్రిపూట పెట్రోలింగ్ చేపడతామని, ఇటువంటి ఘటనలు జరగకుండా చూస్తామని పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed