సొంత నిధులతో స్కూల్ నిర్మించిన సుభాష్ రెడ్డి.. ప్రారంభించిన కేటీఆర్

by  |
సొంత నిధులతో స్కూల్ నిర్మించిన సుభాష్ రెడ్డి.. ప్రారంభించిన కేటీఆర్
X

దిశ, కామారెడ్డి: విద్య, వైద్యం పైనే ప్రస్తుతం సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనున్నారని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం బీబీపేట మండల కేంద్రంలో ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి తన సొంత ఖర్చులతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. పాఠశాలకు వచ్చిన మంత్రికి విద్యార్థులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పాఠశాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. తిమ్మన్నగారి సుభాష్ రెడ్డి తాను పుట్టిన గ్రామానికి, చదువుకున్న పాఠశాలకు రుణం తీర్చుకోవడం గొప్ప విషయమన్నారు. పక్కనే ఉన్న మా నాయనమ్మ సొంత ఊరు కొనాపూర్ పాఠశాలను కూడా ఇలాగే అభివృద్ధి చేయబోతున్నానని తెలిపారు.

శ్రీమంతుడు సినిమా స్పూర్తితో సుభాష్ రెడ్డి ఈ పాఠశాలను అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. త్వరలో ఈ పాఠశాలను జూనియర్ కళాశాలగా మార్చనున్నామని, తర్వాత ఆ కార్యక్రమానికి హీరో మహేష్ బాబును తీసుకుని వస్తానని తెలిపారు. తద్వారా మరింత మంది దాతలు ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన ఏడున్నర ఏళ్లలో దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను పరిష్కరించుకుంటు వస్తున్నామన్నారు. దేశంలోనే 24 గంటలు ఉచిత విద్యుత్, ఇంటింటికి తాగునీరు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ లాంటి పథకాల ద్వారా సాగునీరు అందిస్తూ భారతదేశంలోనే ధాన్యం విషయంలో అగ్రభాగాన నిలిచిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. త్వరలో అన్ని రంగాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుందన్నారు.

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

రాష్ట్రంలో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయని, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ఖర్చుకు వెనకాడకుండా పాఠశాల భవనం నిర్మించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ది చేయాలన్నది సీఎం కేసీఆర్ కల అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

సుభాష్ రెడ్డి స్పూర్తితో ప్రతి ఒక్కరు పాఠశాలల అభివృద్ధికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి, మెయింటెనెన్స్ కు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్పస్ ఫండ్ కు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ 3 లక్షలు, ఎంపీ బీబీపాటిల్ 11 లక్షలు అందిస్తామని ప్రకటించారు. అనంతరం సుభాష్ రెడ్డికి గాంధీ శాంతి దూత అవార్డును మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అందజేశారు.

Next Story

Most Viewed