జెట్ స్పీడ్‌లో విచారణ.. ఈటల వ్యవహారంలో కొత్త ట్విస్ట్

by  |
Minister Etela Rajender
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం టీఆర్ఎస్ నేత, బర్తరఫ్‌కు గురైన ఈటల రాజేందర్ భూ ఆక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. నిన్న మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో అచ్చంపేటలో అసైన్డ్ భూములపై 24 గంటల్లోపు నివేదికను అధికారులు సమర్పించారు. అదే క్రమంలో మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం దేవరయంజాల్‌లోని శ్రీ సీతారామస్వామి ఆలయ భూములను మాజీ మంత్రి ఈటల, ఆయన బినామీలు కబ్జా చేశారంటూ ఓ దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందిస్తూ నలుగురు ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీని సమగ్ర దర్యాప్తు చేయాలని సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో పంచాయత్ రాజ్ శాఖ కమిషనర్ ఎం.రఘునందన్ రావు, నల్లగొండ, మంచిర్యాల, మేడ్చల్ కలెక్టర్లు ప్రశాంత్ పాటిల్, భారతి హోలికేరి, శ్వేతామెహంతీలు ఉన్నారు. వీరిని 11 అంశాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని సూచించారు.

అందులో ఆలయ భూముల కబ్జాల వివరాలు, నేచర్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్, ప్రస్తుతం దేని కోసం వినయోగిస్తున్నారు?, కబ్జాదారుల దగ్గర డాక్యుమెంట్లు, ప్రభుత్వం జారీ చేసిన అనుమతులు, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనలు, ఖాళీ స్థలం ఎంత?, పలుకుబడిన కలిగిన వ్యక్తుల బినామీలు ఎంత మంది, వారెవరు? వారి పేరిట ఎంత స్థలం ఉంది?, ఈ ఆక్రమణల వల్ల ఆలయం కోల్పోయిన ఆదాయం ఎంత? సిఫారసులు ఏమిటన్న కోణంలో దర్యాప్తు సాగించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఐతే ఉత్తర్వులో కూడా మాజీ మంత్రి ఈటల, ఇంకొందరు వ్యక్తులు అక్రమంగా పెద్ద ఎత్తున భూములను కబ్జా చేశారని తెలిపారు. అలాగే బినామీ పేర్లతోనూ కబ్జాకు పాల్పడ్డట్లు చెప్పారు. దీని విలువ రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటుందంటూ ఓ పత్రికలో కథనం వచ్చినట్లు ఉత్తర్వులోనూ ప్రస్తావించడం గమనార్హం. ఆలయం పేరిట 1521.13 ఎకరాల భూమి ఉన్నట్లు చెప్పారు. ఐతే ఈటల మాత్రం ఇందులో ఆరు ఎకరాలు మాత్రమే తాను కొనుగోలు చేశానని ప్రెస్ మీట్‌లో ప్రకటించారు.

అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఆలయ భూములపై దివాన్ కమిటీ సమగ్ర దర్యాప్తు చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందన్నారు. అందులో ఇది ప్రభుత్వానిదని, ఆలయానిదని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని.. ఈ విషయంపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసిందన్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తు చేశారు. గ్రామస్థులెందరో ఈ అనిశ్చితి కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. చాలా మంది రైతులు తమ భూములను అమ్ముకోలేకపోతున్నామని ఆవేదనతో ఉన్నట్లు వివరించారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన ఐఏఎస్ లతో కూడిన కమిటీ పాత నివేదికలను, పాత రెవెన్యూ రికార్డులను ఏ మేరకు ప్రామాణికంగా తీసుకుంటుందో వేచి చూడాలి. అలాగే ఇక్కడైనా రైతులందరికీ నోటీసులు జారీ చేస్తారా? లేదా.. ఏకపక్షంగానే దర్యాప్తు, సర్వే చేస్తారోనన్న అనుమానాలు ఉన్నాయి.

Next Story

Most Viewed